బీఆర్‌ఎస్‌కు లక్షలాది మంది కార్యకర్తలు
కుల, మతాలకు అతీతంగా బీఆర్‌ఎస్ పాలన
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : మాజీ సీఎం కేసీఆర్ అంటే ఓ వ్యక్తి కాదని.. ఆయన దేశానికి ఒక దిక్సూచిలా మారి రాష్ట్రం సాధించిన విషయం అందరికీ తెలుసునని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం బీఆర్‌ఎస్ పార్టీకి పల్లెల్లో, పట్టణాల్లో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.. రాష్ట్రం ఏర్పడిన సమయంలో హైదరాబాద్‌లో ముఖ్యంగా రాజేంద్ర నగర్‌తో పాటు పలు నియోజకవర్గాల్లో అనుమానాలు ఉండేది. హైదరాబాద్‌కు పెట్టుబడులు రావు.. ఉన్న పెట్టుబడులు తరలిపోతాయి.. అభివృద్ధి కుంటుపడుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది.
హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయని ప్రచారాలు జరుగుతుండేవి. కానీ కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి మన కులంగా, సంక్షేమమే మన మతంగా అందర్నీ కలుపుకొని పోయి సమపాలల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించారు. అని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టిపోయినా.. పదవుల కోసం పోయినా మేం మాత్రం మీతో ఉంటామని పార్టీని వొదిలిపెట్టకుండా ఉన్న గులాబీ సైనికులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. కష్టాలు అందరికి వొస్తాయి. గెలుపోటములు కొత్తకాదు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట పిడికెడు మంది ఉండే. ఇవాళ లక్షలాది కార్యకర్తలు ఉన్నారు.
పల్లె పట్టణాల్లో బీఆర్‌ఎస్ పార్టీ విస్తరించింది. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. బీఆర్‌ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు. కొందరు పిచ్చి కలలు కంటున్నారు. కేసీఆర్, బీఆర్‌ఎస్‌ను ఫినిష్ చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. నీలాగా ఈ 24 ఏండ్లలో చాలా మంది ప్రగ్భలాలు పలికారు.. పిచ్చి ప్రేలాపనలు చేశారు. కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అన్నవారే ఫినిష్ అయ్యారు. చరిత్రలోకి తొంగి చూడాలని రేవంత్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆర్ నడుం బిగించకపోతే ఇవాళ సీఎంగా రేవంత్ ఉంటుండేనా అని ఆలోచించాలి. అధికారం, పదవులు తాత్కాలికం. కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతంగా ఉంటుంది. అది కేసీఆర్‌కు మాత్రమే సొంతమనే మాట విజ్ఞప్తి చేస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక్కడ సొమ్మంత దిల్లీకి దోచిపెడుతున్న సీఎం రేవంత్
మూసీ మే లూటో దిల్లీ మే బాటో అనే విధంగా కాంగ్రెస్ నేతల తీరు ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఉండాలంటే దిల్లీకి మూటలు పంపాలి.. అందుకే మూసీలో డబ్బులు లూటీ చేసి, బ్యాగులు దిల్లీకి పంపుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటింది. దిల్లీ వాళ్లకు కోపం వొస్తే పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు. రాహుల్ గాంధీకి డబ్బులు కావాలి. ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. వాళ్లకు డబ్బులు పంచాల్సిందే. అందుకే మూటలు పంపే పనిలో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఓఆర్‌ఆర్ లీజును ఒక సంస్థకు రూ. 7 వేల కోట్లకు ఇస్తే లక్ష కోట్లు వొచ్చేదాన్ని రూ. 7 వేల కోట్లే ఇచ్చారన్నాడు. మరీ ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ నువ్వే కదా? ఆ టెండర్ రద్దు చేసి రూ. లక్ష కోట్లు తీసుకురా. నేను కోకాపేట భూముల్లో అవినీతి చేశానని అన్నావ్. విచారణ జరుపు. తప్పు చేస్తే శిక్ష వేయ్ అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.