బిఆర్‌ఎస్‌ ‌తెలంగాణ అస్తిత్వ పార్టీ

ఇది కెసిఆర్‌, ‌కెటిఆర్‌దో కాదు…తెలంగాణ ప్రజలది
కాంగ్రెస్‌ ‌పాలనలో దోపిడీ పెరిగింది
బిజెపి మత రాజకీయాలు చేస్తోంది
బిఆర్‌ఎస్‌ ‌సమావేశంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు

‌రేవంత్‌ ‌రెడ్డి ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు.. ఈ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బంద్‌ అయితే.. సమాజం తరపున కొట్లాడడం బంద్‌ అయితే.. పేద ప్రజల తరపున మాట్లాడడం బంద్‌ అయితే తెలంగాణ మూగబోతది అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీజేపోడు మాట్లాడడు. తెలంగాణన నాశనం చేసిన బీజేపోడు మెసలడు. బడే భాయ్‌ ‌చోటే భాయ్‌ ఒక్కటే. పైననేమో జూమ్లా పీఎం.. ఇక్కడ్నేమో హౌలా సీఎం.. ఈయనకు ఏం తెల్వది.. ఆగమాగం అవుతున్నాడని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్వీ సమావేశంలో కేటీఆర్‌ ‌ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దోచుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఓ బిల్డర్‌ ‌తనకు వద్దకు వచ్చి.. హైదరాబాద్‌లో కరెంట్‌ ‌కనెక్షన్‌ ‌కోసం 25 లక్షలు సమర్పించుకున్నట్లు చెప్పాడు. కాంగ్రెస్‌ ‌నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. గత పది నెలల్లో అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొన్నాం. ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ప్రతిపక్షంలో కూర్చుంటామని ఊహించలేదు. డిసెంబర్‌ 7‌న కేసీఆర్‌కు ప్రమాదం జరగడం.. మూడు నెలల పాటు ఇబ్బందికి గురయ్యారు. ఓ పది మంది ఎమ్మెల్యేలు ప్రలోభాలతో దొంగల్లో కలిసిపోయారు. మన ఆడబిడ్డ కవితమ్మను ఐదున్నర నెలలు జైల్లో పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కొట్లాడినం, పోరాడినం కానీ ఎవరికీ లొంగలేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఇవాళ కేసీఆర్‌ను తలచుకుంటున్నారు. కేసీఆర్‌ ‌సీఎంగా ఉంటే రైతుబంధు, బతుకమ్మ చీరలు వస్తుండే అని అనుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా కేసీఆర్‌ను తలచుకుంటున్నారని కేటీఆర్‌ ‌తెలిపారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అంటే కేసీఆర్‌దో, కేటీఆర్‌దో కాదు.. ఇది తెలంగాణ ప్రజల గొంతుక అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. కేసీఆర్‌ ‌నాయకత్వం, గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ. ఈ పార్టీ మరో 75 ఏండ్ల పాటు ఒక డీఎంకే లాగా, శిరోమణి అకాలీదళ్‌ ‌లాగా ఉంటది. ఈ పార్టీ మన తెలంగాణ ప్రజలది అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌, ‌బీజేపీ పార్టీలతో మనం జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్‌నే శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజానికి మరింత డేంజరస్‌ ‌పార్టీ బీజేపీనే. మతాలను అడ్డంపెట్టుకుని, మతపరమైన రాజకీయాలు చేస్తూ.. దేవుడిని అడ్డుపెంట్టుకుని పిల్లలను రెచ్చగొడుతున్నారు. తెలంగాణకు చేసిందే లేదు బీజేపీ. ఐఐటీ, ఐఐఎం, మెడికల్‌, ‌నర్సింగ్‌ ‌కాలేజీ ఇవ్వలేదు. ఆఖరికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. తెలంగాణకు ఏం ఇచ్చారని అడిగితే ఎవరు చెప్పరు.. కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌కు మాటలు రావు. కానీ పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. 32 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్వీ సమావేశాలు జరగాలి. మండలం, నియోజకవర్గం స్థాయిలో కమిటీలు వేసుకుందాం. సమర్థవంతమైన విద్యార్థి నాయకులు ఉన్నారు. వారిని జిల్లాలకు పంపుదాం. మండల కమిటీ, కాలేజీ కమిటీలను భర్తీ చేసి కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్‌ ‌చేసుకుందాం. ఎక్కడికక్కడ సోషల్‌ ‌డియాలో క్రియాశీలక పాత్ర పోషించాలి. కేసులకు భయపడొద్దు.. లీగల్‌ ‌సెల్‌ను బలోపేతం చేస్తున్నాం. విద్యార్థి నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. బీఆర్‌ఎస్వీ లేని కాలేజీ ఉండొద్దు. విద్యార్థి నాయకులకు రాజకీయంగా అవకాశాలు ఇస్తాం. మున్సిపల్‌ ‌చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు ఇతర పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్‌ ‌భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page