దుమారం రేపిన పత్రికా ప్రకటనలు
న్యూదిల్లీ, నవంబర్ 18: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా వోటర్లను దర్శనం చేసుకున్నారు. ఇక ప్రధాని మోదీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు వరకు ప్రచారం నిర్వహించారు. అలాగే రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమిలోని ముఖ్యనాయకులంతా ప్రచారం చేశారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నేతలంతా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. మాటల తూటాలు పేల్చుకున్నారు. సోమవారంతో ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ మిగిలి ఉంది. ఇక చివరి రోజు పేపర్లలో వొచ్చిన ప్రకటనలు కాకరేపాయి. కర్ణాటక ప్రభుత్వ పథకాలపై ఎన్డీఏ కూటమి ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలు చివరి రోజు తీవ్ర దుమారమే రేపాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న గ్యారంటీ పథకాలను మహారాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు జారీ చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. మహాయుతి ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నవంబర్ 20న మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జార?ండ్‌లో నవంబర్ 13న తొలి విడత పోలింగ్ ముగిసింది. చివరి విడత బుధవారం జరగనుంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫస్ట్ ఫేజ్‌లో 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మిగతా స్థానాలకు బుధవారం జరగనుంది. ఇక మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.
మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. చివరి రోజు మరింత వేడెక్కెంది. ప్రత్యర్థుల వైఫల్యాలు ఇవేనంటూ అధికార, విపక్షాలు వార్తాపత్రికల్లో ఇచ్చిన ప్రకటనల రూపంలో వార్ కొనసాగింది. ఇదే సమయంలో కర్ణాటక పథకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను సిద్ధరామయ్య ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. విపక్షాల హయాంలో చోటుచేసుకున్న ఘటనలతో మహాయుతి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన భాజపా వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ముంబయి ఉగ్రదాడులు మొదలు కొవిడ్ కిట్ కుంభకోణం వరకు అనేక అంశాలను ప్రస్తావించింది. పాల్గర్‌లో సాధువుల హత్య, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీబీఐ విచారణ నిలివేసిన ఉద్ధవ్ ఠాక్రే, ముంబయి రైలు పేలుళ్లు, అంబానీ ఇంటికి బెదిరింపులు, అవినీతి ఆరోపణలతో పత్రికల్లో ప్రకటన ఇచ్చింది.
ఇదే సమయంలో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతికి సంబంధించి ఎంవీఏ కూడా ప్రకటనలు ఇచ్చింది. హిట్ అండ్ రన్ కేసులు, మహిళలపై నేరాలు, నెరవేర్చని హామీలు, శివాజీ విగ్రహం ఏర్పాటులో అవినీతి, ప్రభుత్వ నియామకాల వంటి విషయాలను పేర్కొంది. మహారాష్ట్ర వ్యతిరేక పాలనకు ముగింపు పలకాలని వోటర్లకు పిలుపునిచ్చింది. . ఎన్నికల ప్రచార చివరి రోజు ఆయా పార్టీల అగ్రనేతలు ముమ్మరం ప్రచారం నిర్వహించారు. ముంబయి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లక్షల మందికి ఉపాధి కల్పించే రూ.లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు మహారాష్ట్ర నుంచి తరలివెళ్లాయని ఆరోపించారు. ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్.. పుణె, అహిల్యానగర్‌లో ప్రచారం చేశారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.. బేలాపుర్, అక్కల్‌కోట్‌లో, నితిన్ గడ్కరీ గోండియాన, నాగ్‌పుర్‌లలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్.. బారామతితోపాటు అష్టీ, ఫల్తాన్ ఇందాపుర్‌లలో ప్రచారం చేశారు.