బిజెపిని ఓడించండి దేశాన్ని రక్షించండి.

ర‌వాణా, బిసి సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
మ‌హారాష్ట్ర‌లో మంత్రి సీత‌క్క‌తో క‌లిసి ప్ర‌చారం.

బ‌ల్లార్షా, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో బిజెపి కూట‌మిని ఓడించి దేశాన్ని ర‌క్షించాల‌ని ర‌వాణా, బిసి సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వోట‌ర్ల‌కు పిలుపునిచ్చారు.  మహారాష్ట్రలోని బల్లర్షా, చంద్రపూర్, రజురా నియోజకవర్గాల్లో సోమవారం  పాల్గొన్న మంత్రి పొన్నంప్రభాకర్ గౌడ్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్  కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఈ కీలకమైన సందర్భంలో ఒక దిశను చూపే అద్భుతమైన అవకాశం మీకు వొచ్చింద‌న్నారు. ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీకి భారత్ జూడయాత్ర ఆలోచన వొచ్చింద‌ని తెలిపారు. చాలా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని గుర్తించి ప్ర‌జ‌ల‌ ఆశయాన్ని నెర‌వేర్చేందుకు రాహుల్ గాంధీ నడుం బిగించారన్నారు. చాలా వర్గాలకు ప్రాతినిధ్యం క‌ల్పించేందుకే కులగణన నిర్ణయం తీసుకున్నారని వివ‌రించారు.

దేశవ్యాప్తంగా కులగ‌ణ‌న‌ చేసి తీరుతామ‌ని తెలిపారు. కుల‌గ‌ణ‌న చేసే వారిని తన్ని తరమండి అని నితిన్ గట్కరీ అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. భ‌విష్యత్‌లో బిజెపి నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలు ఏకమైతే వీళ్లకు పుట్టగతులు ఉండవ‌ని దుయ్య‌బ‌ట్టారు. గత ఎన్నికల్లో 400 సీట్లు గెలిపించాలని బిజెపి నేతలు క‌ల‌లు క‌న్నార‌ని, ఒకవేళ 400 సీట్లు గెలిపించి ఉంటే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసేవార‌ని చెప్పారు. కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేసేవారని ఆరోపించారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టింద‌ని, హిందుత్వం పేరుతో ఎన్నికల కోసం వర్గాలు, కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోంద‌ని విమ‌ర్శించారు. బల్లార్షా చంద్రాపూర్ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు కాంగ్రెస్ చలువేన‌ని తెలిపారు. బల్లార్షా పేపర్ ఫ్యాక్టరీ చంద్రపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించి జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని గుర్తు చేశారు. మేం ప్రజలకు ఉపాధి కోసం నిర్మించి ఇస్తే బిజెపి వాటిని ప్రైవేట్ పరం చేస్తోంద‌ని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వొచ్చిన తర్వాత ఉద్యోగాలు అడిగితే నిస్సిగ్గుగా పక్కోడాలు అమ్ముకోవాలని ఎగతాళి చేస్తున్నారని అన్నారు. మహిళా వికాసం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ కోరారు.

మ‌హారాష్ట్ర‌లో గెలిచేది కాంగ్రెస్సే..
మహారాష్ట్రలో అధికారం చేప‌ట్టేంది కాంగ్రెస్ కూట‌మేన‌ని  మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ధీమా వ్య‌క్తం చేశారు. చంద్ర‌పూర్ లో విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. బిఆర్ఎస్ బిజెపి ఒకరికొకరు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ను విమర్శించే ప్రయత్నం చేస్తున్నారని, మహారాష్ట్రలో కాంగ్రెస్ – కాంగ్రెస్ మిత్రపక్షాల విజయానికి స్పష్టమైన సంకేతాలు రాగానే తెలంగాణ బిజెపి నాయకత్వం డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసీ నిద్ర చేపట్టారని విమ‌ర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కు వోటు వేయద్దని చెప్తున్నారని,  అంటే బిజెపి వోటు వేయాలని సూచిస్తున్నార‌ని తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలు, నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు పార్లమెంట్లో జరిగే ప్రతీ ప్రొసీడింగ్స్ కి బీజేపీకి బిఆర్ఎస్ మద్దతు ఇచ్చింద‌ని ఆరోపించారు. పదేళ్లుగా వారు అవినీతి నుంచి రక్షించుకోవడానికి కేంద్రంతో బిఆర్ఎస్‌ అనేక సత్సంబంధాలను కొన‌సాగిస్తోందని తెలిపారు. తెలంగాణ‌లో త‌మ‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేప‌ట్టింద‌ని తెలిపారు.  ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,రూ. 500 కి గ్యాస్ సిలిండ‌ర్‌, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు ,రైతు రుణమాఫీ వంటివి అమ‌లు చేశామ‌ని తెలిపారు.

మంత్రి సీతక్కతో కలిసి ఎన్నికల ప్రచారం
మ‌హారాష్ట్ర చంద్ర‌పూర్‌లో మంత్రి సీత‌క్క‌తో క‌లిసి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌ట్టారు.రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ఈ దేశంలో ఎవరు అడ్డుపడినా కుల గణన జరిగి తీరుతుంద‌న్నారు.  గడ్కరి, నరేంద్ర మోదీ ఎవరూ ఆపలేరని,  రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కుల గణన అంశంపై దేశానికి దిశాదశగా నిలుస్తోంది. కులగణన పై క్యాబినెట్ లో తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానం చేశాo. ప్లానింగ్ శాఖ ద్వారా కుల గణన విజయవంతంగా నిర్వహిస్తున్నామ‌ని..  ఇప్పటికీ 50 శాతానికి పైగా సర్వే పూర్తయిందన్నారు.  ప్ర‌జలే ముందుకు వొచ్చి సర్వేలో తమ వివరాలు నమోదు చేయించుకుంటున్నారని తెలిపారు. ప్రజలంతా సహకరిస్తుంటే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. . మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బిజెపి, బిఆర్ఎస్ నేత‌లు దుష్ప్రచారం చేస్తున్నారు.
1.17 కోట్ల కుటుంబాల వివరాలను 87 వేల ఏన్యుమరేటర్లు సేకరిస్తున్నారు. ఒక్కో ఎన్ని మారేటర్ 150 ఇండ్ల వివరాలను సేకరిస్తున్నారు. కుల గణన చేపట్టే వారిని తన్ని తరిమేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ అహంకారంతో మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరిని తన్ని తరిమేస్తారో మహారాష్ట్ర ఎన్నికల్లో తేలిపోతుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page