బిజెపి చిత్తశుద్ధికి ఒక పరీక్ష!

  • అవినీతి వ్యవహారాల్లో కేంద్రం స్పందించేనా…
  • అమృత్‌ టెండర్లతో సహా కాళేశ్వరంపైనా విచారించగలదా…?

అవినీతి వ్యవహారాల్లో కేంద్రం ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరించడం లేదు. అవినీతి వొచ్చిన సందర్భాల్లో విచారణలు జరగడం లేదు. అవినీతి నేతలను నిలదీయడం లేదు. కేసులు కూడా తెమలడం లేదు. కేవలం ఇడి, సిబిఐలు దాడులు చేయడం, జ్కెళ్లకు పంపడం, విచారణలు సాగడం, బెయిళ్లు రావడం షరామామూలుగా మారింది. ఈ క్రమంలో దేశంలో రాజకీయ నేతలకు కేసుల భయం లేకుండా పోయింది. బిఆర్‌ఎస్‌ నేతల అవినీతి, జగన్‌ అవినీతిపైనా చర్యలు లేవు. ఇప్పుడు రేవంత్‌పైనా కెటిఆర్‌ ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారని, కాంగ్రెస్‌ కోసం ఎన్నికల ఖర్చును పంపుతున్నారని, రాహుల్‌కు కప్పం కడుతున్నారని ప్రధానంగా బిజెపి కూడా ఆరోపిస్తోంది. మహరాష్ట్ర, జార?ండ్‌ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పై కేటీఆర్‌ దిల్లీ వేదికగా ఆరోపణలు చేయడం వెనక కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడం ద్వారా బిజెపికి మేలు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ చేపట్టిన పథకాలపైన మాట్లాడి అక్కడి వోటర్లను ప్రభావింత చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌ దిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్‌ సర్కార్‌ ను, రేవంత్‌ తీరును గట్టిగా విమర్శిస్తూ మాట్లాడటం గమనార్హం.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే అమృత్‌ పథకంలో అవినీతికి తెరలేపారని చెప్పే ప్రయత్నం చేయడం, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు, ఏకంగా రేవంత్‌ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్‌ లో ఫార్మా కంపెనీకి తన స్వంత అల్లుడి కోసం భూములు కట్టబెడుతున్నారని అందులో భాగంగా అక్కడి ప్రజలు తిరగబడ్డారని దిల్లీ పర్యటనలో చెప్పే ప్రయత్నం చేశారు. అటు బీజేపీకి- ఇటు బీఆర్‌ఎస్‌ కు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌. ఈ నేపధ్యంలో కేటీఆర్‌ కామెంట్స్‌ ఎంతో కొంత బీజేపీకి లాభం చేకూర్చే అంశం అనే చెప్పాలి. ఇదంతా బిజెపితో కలిసి ప్లాన్‌ చేశారని రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇది ఆ రెండు పార్టీల వ్యూహంలో భాగమా.. లేక తనపై ఆరోపణలు చేసినందుకు కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారా అన్నది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో బీజేపీ- బీఆర్‌ఎస్‌ దోస్తానా బయటపడనుంది. ప్రస్తుతం కేటీఆర్‌ దిల్లీ యాత్ర మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసిందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో జరిగిన అమృత టెండర్ల స్కాంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌కి తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించిన ఆయన… తెలంగాణలో జరుగుతున్న అవినీతిపైన స్పందించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడడం కాదని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ఆర్‌ టాక్స్‌ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆధారాలతో సహా తెలంగాణ అమృత్‌ టెండర్లలో అవినీతిపైన ఫిర్యాదు చేశామని ప్రధానమంత్రి స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. నరేంద్ర మోదీ, బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే అమృత్‌ టెండర్లలలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇది బిజెపి చిత్తశుద్ధికి ఒక పరీక్ష అని గుర్తించాలి. అమృత్‌ టెండర్లలో ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులకు టెండర్లు ఇచ్చారని కేటీఆర్‌ ఆరోపణ. రూ. 8888 కోట్లపైగా టెండర్లు ప్రభుత్వం పిలిచిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ అవినీతిపై చర్యలకు దిగితే గతంలో కాళేశ్వరం ఎటిఎం అన్న ప్రధాని మోదీ బిఆర్‌ఎస్‌పైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇది బిజెపి చేస్తేనే చిత్తశుద్దిగా కేంద్రం వ్యవహరించినట్లుగా చూడాలి. లేకుంటే లోపాయకారి వ్యవహారం ఉన్నట్లే. తెలంగాణలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాలపై ఎండగడతామన్న బిజెపికి ఇదో మంచి అవకాశం. ఎలాంటి అర్హతలు లేకున్నా టెండర్లు కట్టబెట్టారంటున్నారు కేటీఆర్‌. ఇందుకోసం అన్ని అర్హతలు ఉన్న ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ అనే కంపెనీ ఉపయోగించారన్నారు. కానీ టెండర్లు గెలుచుకున్న కంపెనీ కేవలం 20 శాతం పనులనే చేస్తుందన్నారు. మిగిలింది అంతా కేవలం రెండు కోట్ల రూపాయల వార్షిక లాభం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బావమరిది కంపెనీకీ ఇచ్చారని అంటున్నారు. ఈ మేరకు ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ కంపెనీ స్టాక్‌ ఎక్స్చేంజికి సమాచారం ఇచ్చారన్నారు. అమృత్‌ టెండర్లపైన కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ ఫిర్యాదు చేసినప్పుడు చర్యలు తీసుకుంటామని హావిరీ ఇచ్చారని తెలిపారు కేటీఆర్‌. తనపై ఎలాంటి కేసు పెట్టుకున్నా, విచారణలు చేసుకున్నా భయం లేదంటున్న కేటీఆర్‌ తనపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ కోరాలి. తాను సుద్దపూసనని చెప్పడం సరికాదు.
-రేగటి నాగరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page