- పారిశ్రామికవేత్తలదే కీలక భాగస్వామ్యం
- బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్19: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ కంపెనీల పేర్లను లేదా దాతల పేర్లను ఈ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు.
వీలైనంత వేగంగా తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చామని, ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు ఛైర్మన్ మహీంద్రా ఆనంద్కు అప్పగిస్తున్నామని అన్నారు. ఈ రంగంలో అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న మహీంద్రా ఆనంద్ స్కిల్ యూనివర్సిటీకి తన బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే నమ్మకం ఉందని అన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని చెప్పారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి.. 2028 ఒలింపిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామని అన్నారు.