నేటి బాల్యమే-రేపటి భారతం

‘‘యావత్‌ ప్రపంచం నిద్రిస్తున్న వేళ, అర్థరాత్రి సమయంలో భారతదేశం తన స్వతంత్య్ర జీవనానికై మేల్కొంది. భారతదేశం కొరకు, మన ప్రజల కొరకు ముఖ్యంగా మానవజాతి సేవకు అంకితమవుతామనే ప్రతిజ్ఞకై ఈ పవిత్రక్షణంలో మనమంతా అడుగేద్దాం!’’అంటూ ఆగష్టు 15,1947 న మన స్వాతంత్య్ర భారత తొలి ప్రధాని మరియు విదేశాంగమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ జాతినుద్దేశించి ప్రసంగించారు.సుసంపన్న కుటుంబం,ఉన్నత విద్యాభ్యాసపు నేపథ్యం వున్నప్పటికీ, స్వాతంత్య్ర సమరంలో జైలు జీవితాన్ని ఆనందంగా గడుపుతూ,’’మహర్షి వంటి వాడైన మా ప్రియతమ నాయకుడు గాంధీజీ కి శిక్ష విధించిన తర్వాత జైలు మాకు స్వర్గమైంది.

పవిత్రమైన యాత్రాస్థలమైంది’’ అంటూ తన జీవితాన్ని మనదేశం కోసమే త్యాగం చేసిన విశ్వ శాంతి కాముకుడు, మహాత్ముడి దార్శనికతను ఆచరించిన ఓ భారతరత్నం జవహార్‌ లాల్‌ నెహ్రూ.అభివృద్ధి చెందిన భారత్‌ గా మనం ఎదగాలని బాలలను,యువకులను కుల, మతాలకతీతంగా అందరికీ సమాన విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు కల్పించేలా ఎంతో కృషి చేశారు.’’నేటి బాలలే రేపటి పౌరులు’’ అంటూ చాచా నెహ్రూ గా మన త్రివర్ణ పతాకం సాక్షిగా నేటికీ స్ఫూర్తినిస్తూనే వున్నారు.%IIు,AIIవీూ,IIవీ% వంటి ప్రతిష్టాత్మక సంస్థల స్థాపనలో నెహ్రూ కీలకంగా వ్యవహరించారు.విఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు సివిరామన్‌, విక్రమ్‌ సారాభాయ్‌, హోంజహాంగీర్‌ బాబా వంటి ప్రముఖులతో కలిసి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా వుండాలనే సంకల్పంతో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు.ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కు పునాది వేశారు.

ప్రాక్టికల్‌ గా, నిజాయితీగా మాట్లాడుకుంటే ఎన్నో రాజకీయ పార్టీలు, నాయకులు  78 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూనే వున్నా పేదరికపు చావులు, బాలకార్మిక వ్యవస్థలు ఇంకా వున్నాయి.అంతర్జాతీయ స్థాయిలో అందరికీ సమాన విద్యావకాశాలు అందటం లేదు.చాలా వరకు సామాన్య ప్రజలు మొదలుకొని రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నత అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు సైతం ప్రభుత్వరంగంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి చూపిస్తున్న ఆసక్తిని తమ పిల్లలను ప్రభుత్వ బడులు,కళాశాలల్లో చేర్పించడంలో కనపడటం లేదు.దీనిపై మేధావులు, విద్యావేత్తలు, సామాన్య ప్రజలు దేశ స్థాయిలో చర్చలు  జరిపి లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం వుంది.విద్యలో పెరుగుతున్న అంతరాలను తగ్గించి,మార్పులను స్వాగతించాల్సిన సమయం ఆసన్నమైంది.కొంతమంది చేతిలో కొంతమేరలో విద్య కార్పోరేట్‌ అయ్యింది.ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కొన్ని కోట్ల మంది పిల్లలకు అవకాశాలే లేక ఐఐటీ,మెడిసిన్‌, ఐఎఎస్‌ వంటివి అందని అంతరిక్షపు తారలయ్యాయి.అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనలు మనదేశంలో పెద్దగా కనిపించటం లేదని ఎన్నో రీసెర్చ్‌ సంస్థల గణాంకాలే చెబుతున్నాయి.నెహ్రూ కలలు గన్న భవిష్యత్తు భారతపు బాల్యం సమస్యల వలయంలోనే కొట్టుమిట్టాడుతుందనే చెప్పవచ్చు.

నెహ్రూ తనజీవితాంతం గాంధీజీ చూపిన అహింసా మార్గంలో శాంతియుత విధానాలతో ముందుకు నడిచారు.యుద్ధం వల్ల కలిగే రక్తపుటేరులను తీవ్రంగా వ్యతిరేకించారు.దేశాలమధ్య ద్వేషాలు కాకుండా ప్రేమ కుసుమాలు వికసించాలని కాంక్షించారు.నేడు కొన్ని దేశాలమధ్య అధిపత్య పోరులో జరుగుతున్న యుద్ధాల వల్ల లక్షలాది పిల్లలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు.భయానక పరిస్థితుల్లో ఆకలితో అలుమటిస్తున్నారు.బాల్యం బానిసత్వంలోనే గడుపుతున్నారు.అలాంటి ప్రస్తుత తరుణంలో ‘‘ది డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’’ అంటూ తన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చిన నెహ్రూ స్వప్నించిన విశ్వ శాంతికై మనం నడవాలి.యుద్ధాలులేని స్వేచ్ఛా విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో భవిష్యత్తు బాలలు,రేపటి తరాలు జీవించేలా చూడటం మనందరి బాధ్యతగా స్వీకరించాలి.

నెహ్రూ మొదటి ప్రధానమంత్రి గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగటంతో పాటు,వారి కుటుంబ వారసత్వం కూడా దేశాన్ని పాలించడంలో నేడు ఎన్నో విభిన్న అభిప్రాయాలు మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వున్నప్పటికీ ప్రజాస్వామ్య లౌకిక భారతంలో భవిష్యత్తు తరాలకు గుణాత్మక విద్య, ఉన్నత స్థాయి వైద్యం, బ్రతుకడానికి భద్రత అందించాల్సిన బాధ్యత నేటితరపు రాజకీయ నాయకులు,పార్టీలపై వుంది.ముఖ్యంగా బాలలు,యువతకు గ్లోబలైజేషన్‌ ప్రపంచంలో ఆధ్యాత్మిక నైతిక విలువలను వెలికితీసే విద్యను అందిస్తూ మానవత్వపు మంత్రంతో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ద్వారా దూసుకెళ్ళేలా చూడాలి.

కర్బన ఉద్గారాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ప్రకృతి తల్లడిల్లుతున్న ఈ గ్లోబల్‌ వార్మింగ్‌ లో అడవులను నరకడం ఆపి, చెట్లను పెంచుతూ కాలుష్య రహిత సమాజంలో నేటిబాలలు కీలకం కావాలి.బస్టాండ్‌ ల్లో,పరిశ్రమల్లో, హోటళ్లలో, యుద్ధాలలో తదితర ప్రాంతాల్లో ‘‘బాల్యం’’ బంధీగా మారకుండా చూడాలి.తల్లిదండ్రులు కూడా తమ ఆశలు,ఆశయాల పేరిట మరియు పరువు బరువును మోపి సంప్రదాయాల పేరిట పిల్లలను ఒత్తిడికి గురి చేయకుండా జాగ్రత్త వహించాలి.పావన నవజీవన బృందావన నిర్మాతలు-రాబోవు యుగానికి దూతలు అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు,ఈ దేశపు భవిష్యత్తు పార్లమెంటులో కాదు పాఠశాలల్లోనే నిర్మించబడుతుందనే దార్శనికతను ప్రదర్శించిన గాంధీజీ, అంబేద్కర్‌ ఆలోచనలు నిజంకావాలి.నెహ్రూ శాంతిసౌధం నేటి యుద్ధం ప్రపంచానికి పాఠం కావాలి..!

ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌
9394749536

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page