కొండారెడ్డిపల్లిలో కోలాహలం.!

స్వ‌గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి సంద‌డి..
ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి ప‌ర్య‌ట‌న‌
పెద్ద ఎత్తున‌ అభివృద్ధి ప‌నులకు శంకుస్థాప‌న‌

నాగ‌ర్ క‌ర్నూల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 13 :  అధికారంలోకి వచ్చాక తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రేవంత్‌ రెడ్డి చేరుకున్నారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామంలో పర్యటించి సందడి చేశారు. గ్రామంలోనే దసరా పండుగ చేసుకుని అనంతరం భారీగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. రేవంత్‌ రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. కాగా ఆయన రాకతో పోలీసులు బందోబస్తు పటిష్టంగా నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో రేవంత్‌ రెడ్డి జన్మించిన విషయం తెలిసిందే.  అయితే సుదీర్ఘ కాలం తర్వాత రేవంత్‌ రెడ్డి త‌న‌ స్వగ్రామంలో పర్యటించారు.

దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి గారు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అభివృద్ధి ప‌నులు ఇవీ..
కొండారెడ్డిప‌ల్లి   గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు. రూ. 55 లక్షలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ. 18 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.

రూ.18 కోట్లతో భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులు, రూ. 64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, ప్రధాన రహదారి మీదుగా విద్యుత్ దీపాలంకరణ పనులకు అలాగే,  రూ. 32 లక్షలతో చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాప‌న‌లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page