- దేశం కోసం ఇందిరా, రాజీవ్ ల ప్రాణ త్యాగాలు..
- సోనియా, రాహుల్ పదవీ త్యాగాలు..
- దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనే..
- విగ్రహం ఏర్పాటుపై కొందరు చిల్లర మాటలు
- తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి వారికి పదేళ్లు సరిపోలేదా?
- రాజీవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : దేశ స్వాతంత్య్రం కోసం జైలులో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూది అని దేశ స్వాతంత్య్రం కోసం నెహ్రూ కుటుంబం సర్వం కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడిన ఘనత నెహ్రూదేనని మతకల్లోలాలతో దేశంలో రక్తం ఏరులై పారుతుంటే దార్శకనికతను ప్రదర్శించి శాంతిని నెలకొల్పింది నెహ్రూ అని గుర్తుచేశారు. హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇది రాజకీయ వేదిక కాదని, ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడం తనకు ఇష్టం లేదని, కానీ కొంతమంది చిల్లరమల్లరగా మాట్లాడేవారికి ఈ వేదికగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలచుకున్నానని చెప్పారు.
అడ్డగోలుగా వేలకోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు త్యాగం అంటే ఏమిటో గుర్తు చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని దేశ భవిష్యత్ కు పునాదులు వేసిన ఘనత నెహ్రూది అని తెలిపారు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ మనకు అందించిన సంపద. కొంతమంది వారసత్వ రాజకీయల గురించి మాట్లాడుతున్నారని, నెహ్రూ బతికి ఉండగా ఇందిరా గాంధీ ఏ పదవి తీసుకోలేదని, ఇప్పటికీ ఇందిరమ్మను పేదలు దేవతలా పూజిస్తున్నారని తెలిపారు. బ్యాంకుల జాతీయీకరణ చేసి పేదల అభివృద్ధికి కృషి చేశారని, రాజభరణాలు రద్దు చేసి ఘనత ఇందిరాగాంధీది అని, దళిత,గిరిజన, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరిగేలా భూములు పంచి పెట్టిన ఘనత ఇందిరమ్మది అని కొనియాడారు.
పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదలకు సొంతింటి కలను నిజాం చేశారని. లంబాడాలను ఎస్టీలలో చేర్చారని, దేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేసిన త్యాగశీలి ఇందిరమ్మ అని అన్నారు. దేశానికి నాయకత్వ సమస్య వొచ్చినపుడు దేశ ప్రజల కోసం ప్రధానిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. దేశ భవిత యువత చేతుల్లో ఉండాలని 18 ఏళ్లకే వోటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ కాదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని సవరించి గ్రామ పంచాయతీలకు నిధులు చేరేలా సంస్కరణలు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీది అని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారని, ఆడబిడ్డలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని, ఐదేళ్లపాటు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని సన్నాసులకు మాహిళల ఆత్మ గౌరవం గురించి ఎలా తెలుస్తుందని మండిపడ్డారు. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ, ఆయనే దేశానికి కంప్యూటర్ పరిచయం చేయకుంటే కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ,వడ అమ్ముకునే వాడని, లేదా సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వాడని ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను పరిచయం చేయడం వల్లే కేటీఆర్ ఈ స్థాయికి చేరారని అన్నారు.
వాళ్లకు అధికారం పోయినా మదం దిగలేదని, రాజీవ్ గాంధీ మరణించినా సోనియమ్మ ఏ పదవీ తీసుకోలేదని తెలిపారు. . 2004 నుంచి 2014 వరకు సోనియా, రాహుల్ ఏ పదవీ తీసుకోలేదని, ప్రాణ త్యాగం అంటే ఇందిరా, రాజీవ్ లది. పదవీ త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీలని కొనియాడారు. తెలంగాణ బిడ్డ పీవీని దేశ ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దుర్మార్గుల్లా పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని, పదవులు పంచుకున్న వాళ్లా కుటుంబ పాలన గురించి మాట్లాడేది.. గడీలలో గడ్డి మొలవాల్సిందేనని ఆనాడు చాకలి ఐలమ్మ చెప్పింది. ఐలమ్మ స్పూర్తితో రాజీవ్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా.. మీ ఫామ్ హౌస్ లలో జిల్లెళ్లు మొలవాల్సిందే.. అప్పటివరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని ధ్వజమెత్తారు. వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కట్టుకున్న మీకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా? మేం రాజీవ్ విగ్రహం పెడతామనాగానే వీళ్లకు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తొచ్చిందని మండిపడ్డారు.
దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టడం సముచితమేనని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారుని, . ఎవరు తొలిస్తారో చూస్తానని, పదేళ్లు వారికి సోయి లేదు కాబట్టే… మేం సచివాలయంలో తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ పరిపాలనకు గుండెకాయ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. . డిసెంబర్ 9లోగా తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉంటుందని హామీ ఇచ్చారు. ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపునకు కూడా వెళ్లని దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు.
కానీ మేం ఐఐహెచ్‌టికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని, మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టామని, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కేసీఆర్ అధికారం పోయిందన్న అక్కసుతో ఉన్నారని అందుకే కొంతమంది చిల్లరగాళ్లను మనపైకి ఉసిగొల్పుతున్నారని, కాలకేయ ముఠా మిడతల దండుగా మారి తెలంగాణను మింగేసేందుకు మళ్లీ ఊళ్లమీదకు రాబోతోందని ఎద్దేవాచేశారు. . తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాలని, ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.