ప్రజా ప్రభుత్వంలో విద్యాశాఖలో కీలక నిర్ణయాలు
మాది ప్రభుత్వ పాఠశాల అని గర్వంగా చెప్పుకోవాలి..
యంగ్ ఇండియా వర్సిటీతో నిరుద్యోగులకు ఉపాధి
ప్రత్యేక తెలంగాణ కోసమే నిరుద్యోగుల ఆత్మబలిదానాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదు
ప్రతీ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్స్
డీఎస్సీ-24 నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా విద్యా వ్యవస్థను తయారు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ మేరకు బుధవారం ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ-2024 ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలి దానాలు చేసుకున్నారని, ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని అందరూ ఆశించారని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ-24 ఉపాధ్యాయుల ముఖంలో ఆనందాన్ని చూస్తుంటే దసరా పండగ మూడు రోజుల ముందే వొచ్చినట్లుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే 10,006 ఉపాధ్యాయ నియామకపత్రాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 34వేల మంది టీచర్ల బదిలీలతో పాటు 21వేల మంది టీచర్లకు పదోన్నతులు అందించామని తెలిపారు.
ఇవాల్టి కార్యక్రమం జరగొద్దని కొందరు కుట్రలు చేశారని, ఉపాధ్యాయుల సంతోషం చూసి కొంతమంది కండ్లల్లో కారం కొట్టుకుంటున్నారని అన్నారు. ఉపాధ్యాయుల కుటుంబాల్లో సంతోషాన్ని చూసేందుకు అన్నింటినీ ఎదుర్కొని మీకు నియామకపత్రాలను అందజేస్తున్నామన్నారు. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు, తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మీపై ఉందని ఉపాధ్యాయులను ఉద్దేశించి సీఎం అన్నారు. నాతో పాటు ఇక్కడున్న చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్ళమే అని సీఎం అన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో రెసిడెన్షియల్స్ తో కలిపి 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా 10వేల ప్రైవేట్ పాఠశాలల్లో పాఠశాలల్లో 34లక్షల మంది చదువుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం తెలంగాణ వొచ్చిన వెంటనే ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ మూడేళ్లు ఆలస్యంగా 2017లో ఇచ్చారన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన రెండేళ్ల తరువాత 2019 నియామకాలు జరిపారని ఆరోపించారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నాం..
కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గత పదేళ్లు కోరి కొరివిదెయ్యాన్ని తెచ్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆ కొరివి దెయ్యాన్ని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదన్నారు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడే మాట ఇచ్చామని, కొన్ని కొరివి దెయ్యాలు డీఎస్సీ-24 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నం చేశాయన్నారు. గత పదేళ్లలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్, పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వాళ్లు సలహాలు ఇవ్వరు, కానీ మేం చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని మండి పడ్డారు. పదేళ్లు ఏలిన వారు పది నెలల మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కానీ ఆ అవకాశం తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వరని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషీగా భావిస్తున్న పరిస్థితికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించాలన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు.
ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.125కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 11న పనులు ప్రారంభించ బోతున్నామన్నారు. ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు.తెలంగాణలో ప్రతీ ఏటా 1లక్షా 10వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వొస్తున్నారని, కానీ ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. త్వరలో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు.
మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు, తెలంగాణ పునర్నిర్మాణానికి మీవంతు కృషి చేయండని నూతన ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదన్నారు. గతంలో విద్యాశాఖలో బదిలీలు, పదోన్నతులు లేవన్నారు. విద్యాశాఖ నా దగ్గరే ఉంది సమస్యలు పరిష్కరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టీచర్లే తెలంగాణ వారధులు, నిర్మాతలు అని కొనియాడారు. పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చే బాధ్యత టీచర్లదేనంటూ బాధ్యత అప్పగించారు. . ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.