పెట్టుబడులకు తెలంగాణా వడ్డించిన విస్తరి

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం

ప్ర‌తీ ఒక్క‌రికి ఉద్యోగ, ఉపాధి కల్ప‌నే మా ల‌క్ష్యం
మహిళలు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహం
ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ కోసం కృషి
స్కిల్‌ ‌వర్సిటీ ద్వారా యువతకు శిక్షణ
ఎంఎస్‌ఎంఈ ‌పాలసీ-2024 ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌18: ‌కాంగ్రెస్ ప్ర‌భుత్వం పార్టీలకతీతంగా అంద‌రికీ అభివృద్ధి ఫలాలను అందజేస్తోందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ‌పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్‌ఎంఈ ‌పాలసీ-2024ని బుధవారం ప్రారంభించింది. మాదాపూర్‌ ‌శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంద‌న్నారు. రాష్ట్ర సంపదను పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఎంఎస్‌ఎంఈ ‌పాలసీ-2024 ను ఆవిష్కరించామ‌ని, కొరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు వొచ్చాయి. చైనాతో పాటు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాల‌ని వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. తెలంగాణ వడ్డించిన విస్తరి లాంటిది. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమ‌ని  సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు చైనా తర్వాత తెలంగాణే బెస్ట్ ‌ప్లేస్‌ అన్నారు.

తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకే ఎంఎస్‌ ఎంఈ ‌పాలసీని తీసుకొచ్చామన్నారు. పరిశ్రమల కోసమే యంగ్‌ ఇం‌డియా స్కిల్‌ ‌యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్కిల్‌ ‌యూనివర్సిటీ లో పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు ప్ర‌వేశ‌పెడతామని చెప్పారు.  తద్వారా గ్రామాల్లోని యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.  యేటా లక్ష మంది ఇంజనీరు బయటకు వస్తున్నార‌ని  ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు ఉపయోగపడేలా చేస్తామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప‌రిస్థితి దెబ్బతిన్న కాలంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు దూరదృష్టితో ఆలోచించారని, పారిశ్రామిక విధానంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టార‌ని గుర్తుచేశారు. ప్రపంచంతో పోటీపడేలా విధి విధానాలు రూపొందించారని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్‌ ‌బాబు గొప్ప ఆలోచన చేశారంటూ ఆయనకు అభినందనలు తెలిపారు.  పాలసీ డాక్యుమెంట్‌ ‌లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు. అందుకే తాజా పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే… కొత్త పాలసీని ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం అనేది నిరంతర ప్ర‌క్రియ.. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలపై చర్యలు తీసుకునే విషయంలో వెనకాడబోం. ప్రస్తుతం చదివిన చదువుకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడింది. అందుకే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అధునాతన టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం. టాటా ఇన్‌ స్టిట్యూట్‌తో కలిసి వాటిని రూ.2,400 కోట్లతో ఆధునీకరిస్తున్నాం. పూర్తి అధ్యయనం తర్వాత యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీని ఏర్పాటు చేశా. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేలా యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌ వెల్లడించారు. యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామికవేత్తల నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్‌ ‌ఫండ్‌ ఏర్పాటు చేయబోతున్నాం. వీటిని యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసింది. ప్రభుత్వం చేస్తున్న ఈ పని రాజకీయ ప్రయోజనాల కోసం కాదు’ అని సీఎం పేర్కొన్నారు.

రైత‌న్న‌లు వ్య‌వ‌సాయాన్ని వొద‌లొద్దు..
రైతన్నలు వ్యవసాయాన్ని వదలొద్ద‌ని సీఎం రేవంత్‌ ‌కోరారు. కాంగ్రెస్‌ ‌వొచ్చాక వ్యవసాయాన్ని పండగ చేసి చూపించినట్లు చెప్పారు. ’రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి వ్యవసాయం పండగ అని నిరూపించాం. అయినా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం రైతుల కుటుంబాలకు సరిపోవడంలేదు. తెలంగాణ రైతాంగానికి ఇదే వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. వ్యవసాయాన్ని వొదలొద్దు.. అగ్రికల్చర్‌ అనేది మన కల్చర్‌.. ‌వ్యవసాయం చేసే వాళ్లు వ్యవసాయం చేస్తూనే కుటుంబ సభ్యులను ఉపాధి అవకాశాలవైపు మళ్లించండి. వ్యాపారాల్లో రాణించేలా తీర్చిదిద్దండి. హైదరాబాద్‌లో ఫ్యూచర్‌ ‌సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. ఫ్యూచర్‌ ‌సిటీలో లైఫ్‌ ‌సైన్సెస్‌, ‌గ్రీన్‌ ‌ఫార్మా ఏర్పాటు చేస్తాం. మూసీ అంటే మురికి కూపం కాదు. మూసీని మ్యాన్‌ ‌మేడ్‌ ‌వండర్‌గా తీర్చిదిద్దుతాం. మా ప్రభుత్వం గత ప్రభుత్వంలా గడీల మధ్య లేదు. ప్రజల కోసమే పని చేసే సర్కారిది. ప్రజలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అని రేవంత్‌ ‌తెలిపారు.

స్వ‌యంస‌హాయ సంఘాల‌కు చేయూత‌
స్వయంసహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రయత్నిస్తున్నామ‌ని సీఎంఅన్నారు. శిల్పారామంలో మూడెక‌రాల‌ స్థలంలో స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్‌ ‌కోసం సదుపాయం కల్పిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో నిర్వహణ బాధ్య‌త‌ల‌ను మహిళల చేతుల్లోపెట్టాం. మహిళా సంఘాలకే స్కూల్‌ ‌యూనిఫామ్‌ ‌కుట్టు పని ఇచ్చాం. యూనిఫామ్‌ ‌ధరను రూ.25 నుంచి రూ.75 చేసి ఆడబిడ్డలను ఆర్థికంగా ఆదుకుంటున్నామ‌ని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు.

అన్ని జిల్లాలు స‌మానంగా అభివృద్ధి చెందాలి : మంత్రి శ్రీధ‌ర్ బాబు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఎంఎస్‌ఎంఈల పాలసీని విడుదల చేసినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈల పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే కాలంలో ఎంఎస్‌ఎంఈల్లో సాంకేతికతను వాడుకోవాలి. ఎంఎస్‌ఎంఈలను కాపాడుకోవాలని రాహుల్‌ ‌గాంధీ కోరారు. ఎక్కువ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్‌ఎంఈలు. ఈ పరిశ్రమలకు చెందిన 120 మంది ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాం. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వ విధానం. మన రాష్ట్రం వన్‌ ‌ట్రిలియన్‌ ఎకానమీ చేరుకోవాలని సీఎం సంకల్పించారు. పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక వసతులతో ప్లాట్‌ ‌ఫ్యాక్టరీస్‌ ఏర్పాటు చేస్తాం. కొత్తగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేందుకు సాంప్రదాయ, ప్రత్యామ్నాయం మార్గాలు చూశాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక పురోభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగేలా అందుబాటులోకి తీసుకొచ్చాం అని తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాహుల్‌ ‌గాంధీ ఆలోచనలతోనే ఎంఎస్‌ఎంఈ ‌నూతన పాలసీ తీసుకొచ్చాం. చాలా రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయి. ఇక్కడ ఇతర రాష్ట్రాలకు విభిన్నంగా రూపొందించారు. ఎంఎస్‌ఎంఈ ‌పాలసీ రూపొందించిన శ్రీధర్‌ ‌బాబుకు ధన్యవాదాలు. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠత కోసం ఎంఎస్‌ఎఈలు కీలకం. దేశ జీడీపీకి, రాష్ట్ర జీడీపీకి ఎంఎస్‌ఎంఈ ఎం‌తో తోడ్పడుతుంది. దాదాపు రూ. 80వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు బహుళ జాతి కంపెనీలు ముందుకు వొచ్చాయి. భారీ పరిశ్రమలకు ఎంఎస్‌ఎంఈల నుంచి పలు ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page