- కుల గణన చేయాలంటే గుండె ధైర్యం కావాలి..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : మనది రైజింగ్ తెలంగాణ అని, కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామన్నారు. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యమని చెప్పారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వేను తమ ప్రభుత్వం బాధ్యతగా భావించిందని ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన సంప్రదింపుల సమావేశంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. పౌర సమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ఇక్కడకు రావడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. కుల గణన నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలన్నారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వొచ్చారని, మాటలు కాదు.. చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యమని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారని, ఇందులో ఓసీలు-3076 (9.8%), ఈడబ్ల్యూఎస్- 2774 (8.8%), ఓబీసీలు-17,921(57.11%), ఎస్సీలు-4828 (15.3%), ఎస్టీలు-2783 (8.8%) ఉన్నారని తెలిపారు.ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.