ప్ర‌పంచ వేదిక‌పై ఫ్యూచ‌ర్ స్టేట్‌గా తెలంగాణ‌

  • ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు..
  • ప్ర‌జ‌ల ఆకాంక్షలే… మా కార్యాచరణ
    ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 : తెలంగాణ‌ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘‘ఫ్యూచర్‌ స్టేట్‌’’ గా బ్రాండ్‌ చేస్తున్నామ‌ని, పెట్టుబడులను ఆక‌ర్షించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల బేగరి కంచె వద్ద ఫోర్త్‌ సిటీకి శంకుస్థాపన చేసుకున్నామ‌ని, మూసీ సుందరీకరణ హైదరాబాద్‌ రూపు రేఖలను మార్చివేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు… వేలమంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్‌ హబ్‌గా తీర్చి దిద్దబోతున్నామ‌ని చెప్పారు. తెలంగాణ ప్ర‌జాపాల‌న దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంద‌ని, ఒకవైపు గడచిన పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటున్నామ‌ని, టీ – న్యాబ్‌ ను బలోపేతం చేశామ‌న్నారు. మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నామ‌ని, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నామ‌ని తెలిపారు. ఇటీవలే ఇంటర్‌ కాంటినెంటల్‌ ఫుట్‌బాల్‌ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించుకున్నాం. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యాలకు పదును పెడుతున్నాం… ఉపాధి, ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతోంది.

ప‌దేళ్ల పాల‌కుల పాపాల ఫ‌లితంగానే వ‌ర‌ద‌లు..

తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌గా మాత్రమే కాదు… క్లీన్‌ స్టేట్‌గా కూడా ఉండాలి. నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు…. పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాలి. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌.. ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ళ పాలకుల పాపమే.. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా (Hydra) ఏర్పాటు చేశాం. చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాం. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం…. ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం….దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుంది. ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్‌కు ట్రాక్‌ రికార్డు ఉంది. సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే తిరగ రాస్తున్నాం. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే… గత పాలకులు పదేళ్ల కాలంలో కేవలం లక్ష వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు. మేం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏక కాలంలో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. ఆరు నెలల వ్యవధిలో 18 వేల కోట్లు , 22 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా!? ఇదీ రైతుల విషయంలో మా కమిట్‌మెంట్‌.

మన ఆడబిడ్డలు 87 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లబ్ధిని పొందారు. దీనివల్ల వాళ్లకు 2,958 కోట్లు ఆదా అయ్యాయి. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచాం. ఆడబిడ్డలకు రూ.500 కే వంట గ్యాస్‌ ఇచ్చి 43 లక్షల కుటుంబాలకు మేలు చేశాం. దీని కోసం ఇప్పటి వరకు 282 కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తం చెల్లించాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్న ఇళ్లకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఈ పథకంలో 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దీని కోసం ఇప్పటి వరకు 965 కోట్ల రూపాయల మేర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నాం. స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. నేతన్నల కోసం ఇటీవల ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ ప్రారంభించుకున్నాం. దీనికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్‌ను ఇటీవలే ఏర్పాటు చేశాం. యువతకు శిక్షణతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటికి పునాది రాయి వేశాం. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి యువతకు భవిష్యత్‌ పై ఆశలు చిగురింపజేశాం. గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం. 11,062 పోస్టులతో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహించాం. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళాశక్తి పథకం ప్రారంభించాం. వచ్చే ఐదేళ్లలో 63 లక్షల మంది ఆడబిడ్డలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని సంకల్పించాం. మరణించిన గల్ఫ్‌ కార్మికుల కుటుంబానికి 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. గల్ఫ్‌ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకులాల్లో ఉచిత విద్యను అందివ్వబోతున్నాం. గల్ఫ్‌ కార్మికులు, ఇతర దేశాల్లో పనిచేస్తున్న మనవారి సమస్యలు వినడానికి… సత్వర పరిష్కారానికి ప్రజాభవన్‌లో ‘‘ప్రవాసీ ప్రజావాణి కేంద్రం’’ ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు గల్ఫ్‌ కార్మికుల సమస్యల అధ్యయనానికి, వాటి పరిష్కారాల కోసం ఒక కమిటీని వేసి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తాం. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. సెప్టెంబర్‌ 17 ఇకపై ప్రజా పాలన దినోత్సవం. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులని, . వారి ఆలోచనలే మా ఆచరణ‌ అని . వారి ఆకాంక్షలే… మా కార్యాచరణ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page