- బిజెపి పాలనలో రాష్ట్రాల్లో అంధకారం..
- పేదలకు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచాం
- ప్రధాని మోదీ విమర్శలకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
కాంగ్రెస్ హయాంలో చీకట్లను తరిమేసి వెలుగులు నింపామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ, తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ఇలా తదితర అంశాలను వివరిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ విమర్శలకు ఘాటు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఆనందం వెల్లువిరుస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే రెండు వాగ్దానాలను నెరవేర్చామని.. 11 నెలల్లోనే దాదాపు 50వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని సీఎం రేవంత్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ప్రియమైన నరేంద్ర మోదీ జీ. నా రాష్ట్రం, నా ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటనలలో అనేక అపోహలు, అవాస్తవాలపై స్పష్టత ఇవ్వడానికి నేను సంతోషిస్తున్నాను.
డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఆనందం ఆశలు వెల్లువెత్తాయి. దశాబ్దం బీఆర్ఎస్ దుష్పరిపాలన పోయి ప్రజల్లో సంతోషం వెల్లివిరిసిందన్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే, తెలంగాణ ప్రభుత్వం మొదటి, రెండో వాగ్దానాన్ని నెరవేర్చింది. అన్ని టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల ఆరోగ్య సంరక్షణ, హాస్పిటల్ కవరేజీని విడుదల చేసింది. గత 11 నెలల్లో తెలంగాణాలోని మహిళలు, ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారు. రాష్ట్రవ్యాప్తంగా 101 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఒక ఏడాదిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 3,433.36 కోట్లు ఖర్చు చేశాం. మొదటి సంవత్సరం పూర్తి కాకముందే, రైతులకు రైతు రుణమాఫీని అమలు చేశాం. 22 లక్షల 22 వేల మంది రైతులు ఇప్పుడు ఎలాంటి రుణం లేకుండా, రాజులా జీవిస్తున్నారు. రూ. 2,00,000 వరకు రైతుల రుణాలన్నీ మాఫీ చేశాం . 25 రోజుల్లో రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం’ అని సీఎం చెప్పుకొచ్చారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ఛార్జీ లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం రూ.500 కే సిలిండర్ లభిస్తుండడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా హయాంలో ఇప్పటివరకు 1.31 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్ రీఫిల్‌లు జరిగాయి. 42,90,246 మంది లబ్దిపొంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువత కోసం ఉద్యోగ నియామకాలను చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించింది. అన్ని స్థాయిల పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలను 11 నెలల కంటే తక్కువ సమయంలో నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 మంది అర్హులైన యువతకు ఉద్యోగాలు కల్పించింది. ఇది ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేయని రికార్డు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంగా పాఠశాల విద్యార్థులను విస్మరించింది.
దశాబ్దం తర్వాత సంక్షేమ హాస్టళ్లలో పేద పిల్లలకు మెస్, కాస్మోటిక్ చార్జీలను 40 శాతానికి పైగా పెంచాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని శుభ్రం చేసి పునర్వైభవం తీసుకొస్తున్నాం. గత 10 ఏళ్లలో ఆక్రమణలకు గురై, ధ్వంసం చేసిన మా సరస్సులు, నాలాలు విలువైన నీటి వనరులను కూడా మేము పరిరక్షిస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చినప్పటి నుంచి ఒక్క అంగుళం సరస్సు కూడా ఆక్రమణకు గురికాలేదు. అలాగే మేము ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నాం. మేము యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, జఎ స్పోర్టస్ యూనివర్శిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం బాల్ రోలింగ్‌ను సెట్ చేశాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానంపై పవిత్రమైన నిబద్ధతతో ఉన్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.గత 11 నెలల్లో మేము తెలంగాణలో చీకట్లను పారద్రోలి వెలుగులను నింపాం’ అని రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ విమర్శలకు ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు.