హైడ్రాను బూచిగా చూపించొద్దు..

  • భవిష్యత్ తరాల కోసమే మా తపన
  • సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేయొద్దు..
  • ఇండ్ల కూల్చివేతలపై కమిషనర్‌ రంగనాథ్ ప్రకటన

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్  స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొన్ని కట్టడాలు కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తోందని ప్రశంసలు కురిపించాలరు. ఇప్పుడేమో సామాజిక మాధ్యమాల్లో  అసత్య ప్రచారం చేస్తున్నారు.  మేం అక్రమకట్టడాలను మాత్రమే కూల్చివేశాం. అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతమయ్యాయి. అమీన్‌పూర్‌లో ఒక దవాఖానాపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నామళ్లీ నిర్మించారు. ఆ హాస్పిటల్ ను  కూల్చినపుడు అందులో రోగులెవరూ లేరు.

దీనికి సంబంధించి వీడియో కూడా రికార్డు చేశాం. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశాం.. దాని పక్కన ఉన్న గుడిసెలను కదిలించలేదు. పేద ప్రజలు నివసిస్తున్న భవనాలను ఎక్కడా కూల్చలేదు. అని రంగనాథ్ స్పష్టం చేశారు.
ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయడంలేదు. వారికి సమయం ఇచ్చిన తర్వాతే ఆక్రమణలు కూల్చివేస్తున్నాం. ఇటీవల కూకట్‌పల్లి నల్ల చెరువులో ఆక్రమణలు కూల్చివేశాం. పేదలు, మధ్యతరగతి ప్రజలు చెరువులు ఆక్రమించరు. అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే ముఖ్యమంత్రి హైడ్రాను తీసుకొచ్చారు.

చెరువులు, నాలాలు కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు చెరువులు నాలాలను కాపాడుకోలేం. పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదు. ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికికి చెందిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయి. విద్యా సంవత్సరం నష్టపోతారనే వాటిపై చర్యలుతీసుకోలేదు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత. హైడ్రాను బూచిగా చూపించి ప్రజలను భయపెడితే భవిష్యత్‌ తరాలకు నష్టం జరుగుతుంది. చెరువులు, ప్రభుత్వ భూములను ఎవరూ కాపాడలేరు. జన్వాడ ఫామ్‌హౌస్‌ 111 జీవో పరిధిలో ఉంది. 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదు’’ అని రంగనాథ్‌ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page