కొన‌సాగిన‌ బెటాలయిన్‌ ‌పోలీసుల నిరసనలు

సచివాలయ ముట్టడికి యత్నం.. ప‌లువురి అరెస్టు..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 28:‌ రాష్ట్రమంతటా ఒకే పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసన తెలుపుతున్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సచివాలయ ముట్టడికి యత్నించారు. రాష్ట్ర నలుమూలల నుంచి బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్లు సోమవారం ఉదయం నగరానికి చేరుకొని సచివాలయం వద్దకు బయలుదేరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ వస్తున్న వారిని ఎన్టీఆర్‌ ‌స్టేడియం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్లు తమ ఆవేదనను వెళ్లగక్కారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి, డీజీపీ జితేందర్‌ ‌తమను పిలిచి చర్చలు జరపాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల ముందు రేవంత్‌ ‌రెడ్డే ఏక్‌ ‌పోలీస్ విధానాన్ని చేస్తానని వందసార్లు చెప్పాడని ఓ బెటాలియన్‌ ‌కానిస్టేబుల్‌ ‌గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తమను కనీసం కలవడం లేదన్నారు. ఒక రివ్యూ మీటింగ్‌ ‌పెట్టి త‌మ‌ సమస్యను తీర్చే సమయం కూడా లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా సమస్యలను తీర్చాలని బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు కొద్దిరోజులుగా చేస్తున్న ఆందోళనలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే శనివారం భార్యాపిల్లలతో రోడ్డెక్కిన కానిస్టేబుళ్లపై తెలంగాణ పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్లలో ఒకే రోజు 39 మందిని సస్పెన్షన్‌ ‌చేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. తమ సహోద్యోగులు సస్పెన్షన్‌ ‌కావడంతో వారికి బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్లంతా బాసటగా నిలిచారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని బెటాలియన్ల ముట్టడి చేపట్టారు. గంటలకొద్దీ బెటాలియన్‌ ‌ముఖద్వారం వద్ద నిరసన చేపట్టినా.. కమాండెంట్‌ ‌పట్టించుకోకపోవడంతో పట్టరాని కోపంతో రోడ్డెక్కారు.

అనంతరం రాత్రి వేళ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అయినప్పటికీ సర్కారులో చలనం రాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకారం సోమవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్లు సెక్రటేరియట్‌ ‌ముట్టడికి పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సెక్రటేరియట్‌ ‌వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. పరిపాలన సౌధం చుట్టూ 163 సెక్షన్‌ ‌విధించారు. సెక్రటేరియట్‌ ‌పార్కింగ్‌ ‌గ్రౌండ్‌లో సుమారు 200 మంది సిబ్బందిని మోహరించారు. ఎన్టీఆర్‌ ‌స్టేడియం వద్ద పోలీసు వాహనాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. కాగా, వీడియోలు తీయడానికి మీడియాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page