శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి

  • ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా
  • నివేదిక ఇవ్వాని కోరని జెపి నడ్డా

న్యూదిల్లీ,సెప్టెంబర్‌20: ‌తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆయన ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ నేను సీఎం చంద్రబాబుతో మాట్లాడాను. వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపించమని చెప్పాను. కేంద్రం ఈ విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుంది. ఫుడ్‌ ‌సేప్టీ అండ్‌ ‌స్టాండర్డస్ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ‌నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకొంటాం. ఇప్పటికి నివేదికే కోరాం అని తెలిపారు. తిరుమల ప్రసాదంలో కల్తీపై మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కూడా స్పందించారు.

ఇది ఏమాత్రం క్షమించరాని నేరమని ఆయన అభివర్ణించారు. అదే సమయంలో ఈ వ్యవహరంలో మత కోణం ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. బోర్డులో అన్యమతస్తుల కారణంగానే కల్తీ నెయ్యి సరఫరా అయిందన్నారు. తిరుమల ప్రసాదంలో కల్తీపై బీజేపీ సీనియర్‌ ‌నేత ముక్తార్‌ అబ్బాస్‌ ‌నఖ్వీ స్పందించారు. ఇది ప్రజల విశ్వాసంపై నేరుగా జరిగిన దాడి. వారి నమ్మకాన్ని వమ్ముచేయడమే. పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర ఇది. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దీనికి కారకులను కఠినంగా శిక్షించాలి. ఇది ఏమాత్రం క్షమించరాని నేరం అని వ్యాఖ్యానించారు. ’వైకాపా ప్రభుత్వంలో హయాంలో అపవిత్రంగా లడ్డూలు తయారు చేశారు.

jp nadda on Srivari Laddu Prasadam

వాటిల్లో వినియోగించిన ముడిసరకులు నాణ్యమైనవి వాడకపోవడం ఒక ఎత్తు.. అపవిత్రమైనవి వాడటం మరో ఎత్తు. తితిదే పరీక్షలు చేయించగా ఈ విషయం నిర్దారణయింది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం స్పష్టం చేశారు. తిరుమలలో ఇప్పటికే ఈ విషయంలో మార్పులు చేశామన్నారు. లడ్డూ తయారీలో నాణ్యమైన నెయ్యి వాడుతున్నామని.. దీంతో లడ్డూ నాణ్యత మెరుగుపడిందని చెప్పారు. దీన్ని మరింత మెరుగుపరుస్తామని, తిరుపతిని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో నాసిరకం వస్తువులతో పాటు జంతువుల కొవ్వు వినియోగించారనే ఆరోపణలతో చెలరేగిన దుమారంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ ‌జోషీ స్పందించారు. దిల్లీలో జరుగుతున్న గ్లోబల్‌ ‌ఫుడ్‌ ‌రెగ్యులేటరీస్‌ ‌సమ్మిట్‌కు హాజరైన ఆయన.. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘ ఇది చాలా తీవ్రమైన విషయం. అందరినీ ఆందోళనకు గురిచేసే అంశం. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఏపీలో సీఎం చెప్పినట్లు ఇది చాలా తీవ్రమైనది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలి. ఆ తర్వాత తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page