మిషన్ భగీరథలో భారీ అవినీతి

  • బీఆర్ఎస్ 53 శాతం ఇండ్లకు కూడా తాగునీరు ఇవ్వలేదు
  • వాస్తవాలు ప్రజలకు వివరించి ప్రతీ ఇంటికి మంచినీరు ఇస్తాం
  • రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నర్సంపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, 46 వేల కోట్ల ప్రాజెక్టులో 15 వేల నుంచి 20వేల కోట్ల మేర‌ అవినీతి జరిగిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా 53 శాతం ఇండ్లకు మంచినీరు అందడం లేదనే భయంకరమైన వాస్త‌వాలు వెలుగు చూసాయని వెల్లడించారు. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రాంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేసినట్టుగా లేదని, వారి జేబులు నింపుకోవడానికి చేసినట్టుగా ఉందని విమర్శించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసి ప్రతీ గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ప్రకటించారు.

గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి బడ్జెట్ లో రూ.72 వేల కోట్లు కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానిది. 27 రోజుల్లో 23 లక్షల మందికి రూ.18 వేల కోట్ల రైతు రుణాలను రద్దు చేశామని, సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ అందలేదని, వీలైనంత త్వరలో వాటిని పరిష్కరించి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి రైతన్నకు రుణమాఫీ చేస్తామని అన్నారు. ఇచ్చిన‌ మాట ప్రకారం 31 వేల కోట్ల రూపాయలకి ఇంకా కావాలంటే రెండు మూడు వందల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు..

అర్హులైన ప్రతి రైతన్నకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు వేరువేరుగా అందించబోతున్నామని ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేయబోతున్నామని ప్రకటించారు. ఈ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. ప్రాజెక్టుల పేరుతో మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల రూపాయలను కాజేసిన గత ప్రభుత్వ పెద్దలు తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి ప్రతీ దానిని రాద్ధాంతం చేయడం అలవాటు చేసుకున్నారని దుయ్యబట్టారు. వారి పాలనలో అవినీతి అక్రమాలు జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతున్నాయనే భ్రమలో బీఆర్ఎస్ నాయకులు జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు.

నర్సంపేట ప్రభుత్వ హాస్పిట‌ల్‌, మెడిక‌ల్ కాలేజీ ప్రారంభం
రూ.183 కోట్లతో నిర్మించిన నర్సంపేట ప్రభుత్వ ద‌వాఖానా, వైద్య కళాశాలను గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖలతో కలిసి ప్రారంభించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రు నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళి నాయక్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామి రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారదా, డిఎంఈ వాణి, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా క్యాంటీన్ ను మంత్రులు ప్రారంభించి, వివిధ రకాల టిఫిన్ల‌ను రుచిచూశారు. అనంత‌రం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. 15 స్వయం సహాయక సంఘాలకు రూ 2 కోట్ల విలువైన చెక్కుల‌ను మంత్రులు అంద‌జేశారు. అనంతరం నర్సంపేట మండలంలోని రాజుపేటలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్డిఎఫ్ నిధుల కింద 2కోట్ల వ్యయంతో నిర్మించే బంజారా భవన్ నిర్మాణ పనులకు మంత్రులు పొంగులేటి, దామోదర నరసింహ, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్ లు శంకుస్థాపన చేశారు. అలాగే 600 కేఎల్ఈఎల్ ఎస్ఆర్ నిర్మాణం, అంతర్గత పైప్లైన్లు పనులకు శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page