- సమాజ స్థితిగతులను మార్చేది మార్క్సిజమే
- సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు
- హనుమకొండలో సిపిఐ నిరంతర రాజకీయ పాఠశాల ప్రారంభం
హనుమకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని, సమ సమాజ నిర్మాణానికి మార్క్సిజమే దిక్సూచి అని, సిపిఐ ది నూరేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ అని రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరంతర రాజకీయ పాఠశాలను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి అధ్యక్షతన జరిగిన రాజకీయ పాఠశాల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజల మధ్య ఉండి ప్రజలను చైతన్యం చేస్తూ ప్రశ్నించే గొంతుకగా ఉన్న సిపిఐ శత సంవత్సరాలు కలిగిందని, శతాబ్ద కాలంగా ఎన్నో పార్టీలు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రారంభించి కనుమరుగయ్యాయని అన్నారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో సిపిఐ కార్యకర్తలు, నాయకులపై అనేక కుట్ర కేసులు బనాయించినా కూడా, జైలులో పెట్టి చిత్రహింసలు పెట్టినా కూడా స్వాతంత్రం సిద్ధించే వరకు ప్రజలను చైతన్యం చేస్తూ విశ్రమించని పోరాటం చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. అంతరాలు లేని సమాజ అభివృద్ధికి మార్క్సిజమే ప్రత్యామ్నాయమని, ఈ పెట్టుబడి దారీ సమాజంలో అంతరాలు లేకుండా పేదవాడు, ధనికుడు తేడా లేకుండా అందరూ సమానంగా బతకాలని, సమ సమాజ స్థాపన కోసం మార్క్సిజం చూపిన సైద్ధాంతిక
సిద్ధాంతంతో నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర పోషిస్తూ అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు గావించాలని పిలుపునిచ్చారు. పాలక ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం మరిచి కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగా దేశంలో ఉన్న ప్రజలు సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ లక్షలాది కోట్ల రూపాయలను వారికి రాయితీల పేరు మీద కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్బంగా కమ్యూనిస్టులు ఏమి తెలుసుకోవాలి అనే అంశంపై రిటెర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్క శంకర్ నారాయణ బోధిస్తూ కమ్యూనిస్టులు దేశంలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తూనే మరోవైపు మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని అన్నారు. ఈ రాజకీయ పాఠశాల కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి అధ్యక్షత వహించగా రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, ఎన్.అశోక్ స్టాలిన్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు కర్రె లక్ష్మణ్, మునిగాల భిక్షపతి, మంచాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.