వరదలతో రాష్ట్రంలో అపార నష్టం

ప్రభుత్వం అప్రమత్తతో నష్ట నివారణ
వేగంగా తీసుకున్న చర్యలతో తగ్గిన ప్రాణనష్టం
కేంద్రబృందానికి వివరించిన సిఎస్‌ శాంతికుమారి
సచివాలయంలో ఫోటో ప్రదర్శన తిలకించిన కేంద్రబృందం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11: ఇటీవలి వరదలకు తెలంగాణలోని పలు ప్రభావిత ప్రాంతాలలో సంభవించిన వరద నష్టాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర బృందానికి నివేదించారు. కల్నల్‌ కెపి సింగ్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో చర్చలు జరిపింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన అపారమైన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. అతి తక్కువ సమయంలో వాతావరణ శాఖ అందించిన హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడం వలన ప్రాణనష్టం తగ్గించగలిగామని సిఎస్‌ తెలియజేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు క్రమం తప్పకుండా పరిస్థితిని సవిూక్షించి, వరద, పునరావాస, సహాయక చర్యలను పర్యవేక్షించారని సి.ఎస్‌ కేంద్ర బృందానికి తెలియ జేశారు.

 

సహాయక చర్యలు చేపట్టేందుకు ఉపముఖ్యమంత్రితో పాటు మరో ఇద్దరు రాష్ట్ర మంత్రులు హుటాహుటిన ఖమ్మం చేరుకొని సహాయక కార్యక్రమాలను వేగవంతం చేశారని, ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగానికి వరద సహాయం, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి నిధులు వెంటనే విడుదల చేశామని సి.ఎస్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలను అందించడానికి వీలుగా మార్గదర్శకాలను ఉదారంగా రూపొందించాలని సి.ఎస్‌ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో సమానంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సి.ఎస్‌ తెలియజేశారు. ప్రత్యేక బృందాలకు శిక్షణ, ఇతర లాజిస్టిక్స్‌ ఏర్పాట్లలో ఔఆఓం మద్దతు కావాలని సి.ఎస్‌ కేంద్ర బృందాన్ని కోరారు. భారీ వర్షాల సమయంలో ఎయిర్‌ రెస్క్యూ ఆపరేషన్‌ల సమస్యను కూడా సీఎస్‌ ప్రస్తావించారు. ఈ సవాళ్లు ఎదుర్కోవడంలో కేంద్రం సహకారాన్ని కోరారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ చెట్లు కూలిన సంఘటనలను, పర్యావరణ విపత్తు సమస్యను కూడా సి.ఎస్‌ ప్రస్తావించారు. ఈ పర్యావరణ విపత్తుకు మూలకారణాన్ని తెలుసుకోవడానికి సమగ్ర అధ్యయనం చేయాలని కేంద్ర బృందం సి.ఎస్‌ కు సూచించింది.

 

విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ వరదల కారణంగా సంభవించిన నష్టాలను, ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర బృందానికి వివరించారు. వరద నష్టం ప్రాథమిక అంచనాలు రూ.5,438 కోట్లుగా ఉన్నాయని, పూర్తిస్థాయి అంచనా పక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన తెలియజేశారు. వ్యవసాయం, రోడ్లు, భవనాలు, మున్సిపల్‌ అడ్మినిస్టేష్రన్‌, పంచాయతీరాజ్‌, ఇంధనం, పశుసంవర్ధక, అటవీ శాఖల ఉన్నతాధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర బృందాలకు జరిగిన నష్టాన్ని వివరించారు.

 

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం పరిశీలించింది. ఆయా జిల్లాల్లో వర్షాల వల్ల జరిగిన అపార నష్టాన్ని వారికి ఈ ప్రదర్శనలో వివరించారు. వరద ప్రభావిత జిల్లాలైన ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించి వరదల్లో చిక్కుకున్న వారితో సంభాషించడంతోపాటు జిల్లా యంత్రాంగంతోనూ చర్చలు జరుపుతాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె రామకృష్ణారావు, వికాస్‌ రాజ్‌, అడిషనల్‌ డిజి మహేష్‌ భగవత్‌, డిజాస్టర్  సర్వీసెస్‌ నాగిరెడ్డి, మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌, పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, హౌసింగ్‌ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంత రావు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page