తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన
దాశరథి వర్ధంతి సభలో వక్తలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 05: దాశరథి రచనలు చదవకపోతే దాశరథికి నష్టం కాదు కానీ నేటి కవులకు, రచయితలకు మరియు యువతరానికి తద్వారా సమాజానికి చాలా నష్టం అని అన్నారు నందిని సిద్ధారెడ్డి.మహాకవి దాశరథి కృష్ణమాచార్య 37వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో కార్యదర్శి నామోజు బాలాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో దాశరథితో అనుబంధం కలిగిన అనేకమంది సాహితీవేత్తలతో ఓ సాహితీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది అకాడమీ. ఈ సందర్భంగా దాశరథి రాసిన కథలను ఏరి కూర్చి ‘‘నిప్పు పూలు’’ పేరుతో ఓ కథ సంపుటిని వెలువరించింది. ఈ కథా సంపుటిని ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నందిని సిద్ధారెడ్డి ప్రసంగిస్తూ దాశరథి పేరుతో ఓ స్మారక భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతగానో ఉందని సూచించారు. ఈ సభలో టి. ఉడయవర్లు ప్రసంగిస్తూ దాశరథితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ దాశరథి కథల వైషిట్యాన్ని వివరించారు.
ఇదే కార్యక్రమంలో అకాడమీ ప్రచురిస్తున్న ప్రస్తుత పునాస సంచికను ఆవిష్కరించారు. అలాగే ‘‘నిప్పుపూలు’’ అన్న కథను వివరిస్తూ దాశరధితో తనకు గల అనుబంధాన్ని తెలిపారు. ఆనందాచారి ప్రసంగిస్తూ దాశరథి కథల్లోని ధికారతత్వాన్ని ఎత్తి చూపారు. శరత్ చంద్ర ప్రసంగిస్తూ దాశరథి సినీ గేయాల వైశిష్టాన్నిఅద్భుతంగా ఆవిష్కరించారు. రూప్ కుమారు డబ్బికారు దాశరథి కథలను వివరించారు. ఆచార్య పిల్లలమర్రి రాములు ప్రసంగిస్తూ సంస్కృతంలో వల్లభాచార్య రాసిన కీర్తనలను సినీ గేయాలుగా దాశరథి ఎంత అద్భుతంగా మలిచిరో ఆ విధానాన్ని వివరించారు.దాశరథి కూతురు, అల్లుడు గౌరీ శంకర్ ప్రసంగిస్తూ తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం కింద ‘‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’’ అనే దాశరథి మాటల్ని పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంటా మనోహర్ రెడ్డి కే ప్రభాకర్ ఆచార్య డాక్టర్ ఎస్ రఘు తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు.