దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

  • బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
  • అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి శోభ

తెలుగు రాష్టాల్ల్రో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రధాన ఆలయాల్లో శరన్నవరాత్రి వేడుకలు సాగుతున్నాయి. ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలు  వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏపీలోని పలు అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఇప్పటికే శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. వివిధ నైవేద్యాలను సమర్పించారు. భక్తులు కూడా తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు. ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంటారు అమ్మవారు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవగా.. చివరి రోజు దుర్గాష్టమితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.

ఈరోజు ఒక్కో ఆలయంలో ఒక్కో రూపంలో ఆ దుర్గమ్మ  భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు విజయవాడలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారికి స్నాపనాభిషేకం అనంతరం 9 గంటలకు దర్శన భాగ్యం కల్పించారు. తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని చూసేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే వినాయకుని గుడి వద్ద నుంచి క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. శ్రీస్వామి, అమ్మవారి యాగశాల ప్రవేశంతో ప్రత్యేక పూజలు చేసి దసరా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అర్చకులు. దసరా మహోత్సవాలను ఆలయ అర్చకులు, ఈవో పెద్దిరాజు దంపతులు ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం శైలపుత్రిగా భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమివనున్నారు. బృంగివాహనంపై కన్నులపండువగా శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవం జరుగనుంది. ఏలూరు జిల్లాలో ఈరోజు నుంచి ఈ నెల 12 వరకు ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో దసరా శర్నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలలో రోజుకోక అలంకరణలో భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలుగనుంది.

ఈరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు కుంకుళ్లమ్మ దర్శనమిస్తున్నారు. ఆ దేవదేవి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు శ్రీ సువర్ణ రజిత కవచ అలంకారణలో భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలకత్తా కాళీమాతగా కొలవబడుతున్న ఈడేపల్లిలోని శ్రీ శక్తి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం శక్తి పటాల ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. కలకత్తాలో మాదిరి దసరా తొమ్మిది రోజులు ఇక్కడ కూడా శక్తి పటాలు కట్టడం అనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ పాలకవర్గం అన్ని ఏర్పాట్లు చేసింది. కాకినాడలోని అన్నవరం దేవస్థానంలో శరన్నవరాత్రులు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానంలో వెలసిన వనదుర్గ, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవుతారంతో భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. విజయవాడ, బాసర, శ్రీశైలం, జోగులాంబ, భద్రకాళి ఆలయాల్లో ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page