మరోసారి భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

మెరికా ఎన్నికల ప్రభావంతో భారీ కుదుపు
జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికలు!

అమెరికా ఎన్నికల ప్రభావంతో  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి.  భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.  బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌, నిప్టీ ఒక్కో శాతం మేర నష్టపోయాయి. అమెరికా ఎన్నికలు, వడ్డీ రేట్లపై త్వరలో ఫెడ్‌ తన నిర్ణయాలను ప్రకటించనుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.  అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ఇది ప్రభావం చూపించే అంశంగా నిలిచింది. ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు ఈ నెల 7న వెలువడనుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ దాదాపు 1500 పాయింట్ల మేర నష్టపోగా.. ఆ తర్వాత కాస్త కోలుకుంది. నిప్టీ 24 వేల మార్కును కోల్పోయింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.448 లక్షల కోట్ల నుంచి రూ.442 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. సెన్సెక్స్‌ ఉదయం 79,713.14  స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. క్రమంగా భారీ నష్టాల్లోకి జారుకుంది. ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 78,232.60 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 941.88 పాయింట్ల నష్టంతో 78,782.24 వద్ద ముగిసింది. నిప్టీ 309 పాయింట్ల నష్టంతో 23,995.35 వద్ద స్థిరపడిరది.  డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠమైన 84.11 స్థాయికి చేరింది. సెన్సెక్స్‌ 30 సూచీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్‌, రిలయన్స్‌, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ప్రధానంగా నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 75 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2753 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య ఘర్షణలు పెరుగుతుండటంతో పీపా చమురు ధర  రెండు శాతం వరకు పెరిగి 75 డాలర్లకు చేరింది. ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి పెంచే విషయమై పెదవి విరుస్తున్నాయి.  మన రూపాయి విలువ భారీగా పతనమైన జీవనకాల కనిష్ఠానికి రూ.84.11 చేరింది. దీంతో భారత విదేశీ కరెన్సీ నిల్వలపై దీని ప్రభావం పడనుంది. చమురు ధరల పెరుగుదల, రూపాయి పతనం వెరసి ఆర్‌బీఐ వద్ద ఉన్న డాలర్ల నిల్వలను తగ్గించే అవకాశం ఉంది. రెండో త్రైమాసిక  ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా మార్కెట్‌ సూచీల పతనానికి కారణంగా నిలిచింది. విదేశీ పోర్టుఫోలియో మదుపరులు భారీగా పెట్టుబడులను ఉపసంహరిస్తుండటం సూచీలు పడిపోవడానికి మరో కారణంగా నిలిచింది. ఒక్క అక్టోబర్‌ నెలలోనే వీరు రూ.1,13,858 కోట్లను ఉపసంహరిం చుకొన్నారు.
ఇప్పుడు అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. నవంబర్‌  5న అంటే మంగళవారమే వోటింగ్‌ జరుగనుంది.  అధ్యక్ష ఎన్నికలు తుది దశకు చేరుకోగానే ఇప్పుడు అందరి దృష్టి స్వింగ్‌ స్టేట్స్‌ పైనే ఉన్నాయి.  అమెరికా ఎన్నికల ఫలితాలను మూడు రకాల రాష్ట్రాలు  నిర్ణయిస్తాయి. వీటిని రెడ్‌, బ్లూ, స్వింగ్‌ స్టేట్స్‌ అంటారు. 1980 నుంచి రిపబ్లికన్స్‌ విజయం సాధిస్తున్న వాటిని రెడ్‌ స్టేట్స్‌ అంటారు. అలాగే 1992 నుంచి డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను  బ్లూ స్టేట్స్‌ అంటారు. ఇక స్వింగ్‌ స్టేట్స్‌ లో రెండు పార్టీల మధ్య గెలుపోటమలు దోబూచులాడుతాయని భావిస్తారు. ఈసారి ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలువనున్నారు. ఎందుకంటే పోటీ చాలా తీవ్రంగా ఉన్నది. రాయిటర్స్‌, ఐపిఎస్‌ఓఎస్‌ పోల్‌ గత వారం అక్టోబర్‌ 29న ప్రచురించిన దాని ప్రకారం కమలా హారిస్‌ కే ఆధిక్యత ఉంది. సింగిల్‌ పర్సంటేజ్‌ ఆధిక్యతతో డెమోక్రట్లు ఉన్నారు.  డెమోక్రాట్లు 44 శాతం, రిపబ్లికన్లు 43 శాతం మేరకు వోట్లు పొందనున్నారని అంచనా. ఓ సర్వే ప్రకారం స్వింగ్‌ స్టేట్స్‌ అరిజోనా, జార్జియా, మిచిగాన్‌, నెవడా, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ లలో రిపబ్లికన్‌ నామినికే మొగ్గు ఉంది.  అమెరికాలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త నేట్‌ సిల్వర్‌ తాజాగా తన అంచనాలను వెల్లడిరచారు.  ట్రంప్‌-హారిస్‌ల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్నారు. అయితే కొంచెం మొగ్గు మాత్రం రిపబ్లికన్ల వైపే ఉందని చెప్పారు. ఈమేరకు న్యూయార్క్‌ పోస్టు కథనం ప్రచురించింది.
సిల్వర్‌ మోడల్‌ అంచనాల ప్రకారం ట్రంప్‌నకు ఎలక్టోరల్‌ కాలేజ్‌లో 51.5 శాతం వోట్లు లభించే అవకాశం ఉన్నట్లు వెల్లడిరచారు.  హారిస్‌ వైపు 48.1శాతం మంది మొగ్గు చూపుతున్నారన్నారు. ఈసందర్భంగా నేట్‌ సిల్వర్‌ మాట్లాడుతూ.. న్యూయార్క్‌ ట్కెమ్స్‌ స్వింగ్‌ స్టేట్స్‌ పోల్స్‌ హారిస్‌కు సానుకూలంగా ఉన్నా.. అద్భుతంగా మాత్రం లేవు. అలానే మార్నింగ్‌ కన్‌స్టలెంట్‌వి ట్రంప్‌నకు మంచిగానే ఉన్నా.. అమోఘంగా లేవు. ఇది పూర్తిగా హోరాహోరీ పోరే అని విశ్లేషించారు.  రిపబ్లికన్లకు పట్టున్న అయోవాలో ట్రంప్‌ వెనుకంజలో ఉన్నారంటూ సెజలెర్‌ సర్వే  ప్రకటించడాన్ని నేట్‌ సిల్వర్‌ ప్రస్తావించారు. ఆ ఒక్క రాష్ట్రంతో అధ్యక్ష పదవి వచ్చే అవకాశం లేదన్నారు.   సిల్వర్‌ తాను చేపట్టిన నేషనల్‌ పోలింగ్‌ యావరేజ్‌ను విడుదల చేశారు. దీనిలో దేశవ్యాప్తంగా చూసుకొంటే హారిస్‌కు 48.5శాతం వోట్లు రాగా.. ట్రంప్‌నకు 47.6శాతం వోట్లు లభించాయి. కానీ, స్వింగ్‌స్టేట్స్‌ అయిన నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, నెవడా, జార్జియా, అరిజోనాల్లో ట్రంప్‌ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొన్నారు. హారిస్‌కు మిషిగన్‌, విస్కాన్సిన్‌లో ఆధిక్యం చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇప్పటికే ముందస్తు వోటింగ్‌ మొదలుకాగా.. నవంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది.
వోటర్లకు సౌలభ్యంగా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు వివిధ భాషల్లో బ్యాలెట్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో న్యూయార్క్‌ రాష్ట్రం ఇంగ్లిష్‌కు అదనంగా మరో ఐదు భాషల్లో వీటిని ముద్రించగా.. అందులో భారతీయ భాష ’బెంగాలీ’ ఉండటం విశేషం.  ఎన్నికల పక్రియలో ఇంగ్లిష్‌ కాకుండా మరో నాలుగు భాషలకు చోటు కల్పించారు. చైనీస్‌, స్పానిష్‌, కొరియన్‌, బెంగాలీ భాషల్లో బ్యాలెట్‌ అందుబాటులో ఉందని న్యూయార్క్‌ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ జే రియాన్‌ పేర్కొన్నారు. ఇక్కడ స్థిరపడిన వారికి ఇంగ్లిష్‌ తెలిసినప్పటికీ మాతృ భాషలో అందుబాటులో ఉండటం ఆయా ప్రాంతాల వారికి సంతోషకర అంశమన్నారు. అయితే, భారత్‌లో అనేక భాషలున్నప్పటికీ గతంలో కోర్టులో వేసిన ఓ దావా వల్ల ఎన్నికల పక్రియలో బెంగాలీకి చోటు లభించింది. ఎన్నికల నిర్వహణలో అనేక దేశాలు ఏకీకృత వ్యవస్థను అనుసరిస్తున్నప్పటికీ అమెరికా మాత్రం ఇందుకు భిన్నం. ప్రచార చట్టాలను ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ పర్యవేక్షిస్తుండగా.. ఎన్నికల పక్రియను మాత్రం ఆయా రాష్టాల్రు చూసుకుంటాయి. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, పోలింగ్‌ సమయం, కౌంటింగ్‌ పక్రియకు ఆయా రాష్టాల్రు ప్రత్యేక నిబంధనలను పాటిస్తాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు తారాస్థాయికి  చేరుకున్నాయి.  ప్రధాన అభ్యర్థులు ట్రంప్‌, కమలా హారిస్‌ ప్రచారం ఉధృతం చేశారు. తాజాగా దేశ ఆర్థిక విధానాలపై ప్రకటనలు చేస్తున్నారు. విదేశాంగ  విధానంపైనా మాట్లాడు తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించి అధికారంలోకి వొస్తే దేశంలో సరికొత్త ఆర్థిక అద్భుతాన్ని సృష్టిస్తానని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌  అంటున్నారు.  మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలాహారిస్‌ ఆర్థిక విధానాల్లో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఆమె విఫల ఆర్థిక అజెండా కారణంగా ఇటీవలే ప్రైవేటురంగంలో 30 వేల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయాయన్నారు. తయారీరంగంలోనూ దాదాపు 50వేల ఉద్యోగాలు కోల్పోయామని పేర్కొన్నారు. హారిస్‌ అధికారంలోకి వొస్తే ఆర్థికవ్యవస్థ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ‘హారిస్‌ విధానాలు దేశాన్ని నాశనం చేసేలా ఉన్నాయి. వాటివల్ల అమెరికన్‌ కార్మికులు మునిగిపోతున్నారు. ఆమె ఒక రాడికల్‌ లెప్ట్‌ మార్క్సిస్ట్‌,  నేను మాత్రం దేశంలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వేలకొద్దీ కర్మాగారాలను అభివృద్ధి చేస్తాను. నా పాలనలో హింసాత్మక నేరాలు జరగకుండా అణచివేస్తాను’ అని పేర్కొంటున్నారు.
 దేశ సమస్యలే కాకుండా ప్రపంచదేశాల పరిస్థితులను నిరంతరం గమనిస్తుంటానని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను నివారించడానికి, రష్యా- ఉక్రెయిన్‌కు మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తానన్నారు. మూడో ప్రపంచయుద్ధం రాకుండా నిరోధిస్తానని హావిరీ ఇచ్చారు. అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి, ఆధునికీకరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తామన్నారు. పిల్లలు, యువతకు దేశాన్ని, మన చరిత్రను, జెండాను గౌరవించడం నేర్పిస్తానన్నారు. జెండాను అగౌరవపరిచినవారికి ఒక ఏడాది జ్కెలు శిక్ష విధిస్తానని పేర్కొన్నారు. దేశ పౌరుల మతపరమైన స్వేచ్ఛను, వాక్‌ స్వాతంత్రియాన్ని  పునరుద్ధరిస్తానన్నారు. దేశ సరిహద్దులను కాపాడుకుంటూ అక్రమ వలసలను నివారిస్తామని ట్రంప్‌ అన్నారు. ఇకపోతే ట్రంప్‌ విధానాలను కమలా ఎండగుడుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా ప్రజల్లో విద్వేషాలు రేకెత్తిస్తున్నారని డెమోక్రాటిక్‌ అభ్యర్థి కమలాహారిస్‌ అన్నారు. అమెరికాకు ట్రంప్‌ కంటే మెరుగైన అధ్యక్షుడు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల పాత్ర, బాధ్యతలను అర్థం చేసుకొనే వ్యక్తి వారికి కావాలని, ప్రపంచానికే ఆదర్శంగా కనిపించే నాయకుడు అమెరికా అధ్యక్షుడిగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. కానీ ట్రంప్‌ అమెరికన్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడంపై దృష్టిపెడతారని హారిస్‌ అన్నారు.
మొత్తం మీద అమెరికా ఎన్నికల ప్రభావంతో  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయని చెప్పొచ్చు.  భారీగా నష్టాలను మూటగట్టుకుని  బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌, నిప్టీ ఒక్కో శాతం మేర నష్టపోయాయి. అమెరికా ఎన్నికలు, వడ్డీ రేట్లపై త్వరలో ఫెడ్‌ తన నిర్ణయాలను ప్రకటించనుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.  అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ఇది ప్రభావం చూపించే అంశంగా నిలవడం గమనార్హం. -ఎస్‌.కె. వహీద్‌ పాషా
(ఎంఎస్సీ బి.ఎడ్‌), ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌, 

హైదరాబాద్‌, సెల్‌ : 9848787917

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page