DTF | సీఎం రేవంత్‌ నిర్ణ‌యంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌

  • 1 నుండి 3వ తరగతి వరకు అంగన్వాడీలకు ఇవ్వడంపై ఆగ్ర‌హం
  • ప్రాథ‌మిక విద్య నిర్వీర్య‌మవుతుంద‌ని డిటిఎఫ్ ఆరోప‌ణ‌

ప్రజాతంత్ర, జూలై 21 :  రాష్ట్ర విద్యా వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకువ‌స్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ చేసిన ప్ర‌క‌ట‌న‌పై రాష్ట్ర వ్యాప్తంగా అన్నివ‌ర్గాల్లో వ్య‌తిరేకత వ్య‌క్త‌మ‌వుతోంది. విద్యావేత్త‌లు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ అంశంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 1 నుండి 3వ తరగతి వరకు అంగన్వాడీలకు ఇవ్వడాన్ని ఖండిస్తున్న‌ట్లు డిటిఎఫ్ (DTF) ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లోని 1 నుంచి 3వ తరగతి వరకు ప్లేవే పద్దతిలో బోధించడానికి, ఆ తరగతుల నిర్వహణ అంగన్వాడీ (Anganwadi) కేంద్రాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం వ‌ల్ల ప్రాథమిక విద్య పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్ర‌మాదం నెల‌కొంద‌ని వెంట‌నే ఈ నిర్ణయాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిటి. లింగారెడ్డి డిమాండ్ చేశారు.
ఆదివారం హనుమకొండలోని సుబేదారి ఉన్నత పాఠశాలలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భారతి నివేదికను ప్రవేశపెట్ట‌గా నివేదికపై జిల్లా కార్యవర్గసభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి డీఈడీ, బీఈడీ అర్హతలు గల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు అందరికీ ప్రమోషన్ కు అవకాశం కల్పించాలని, ఇటీవల జరిగిన పదోన్నతుల్లో మిగిలిపోయిన పోస్టులకు వెంటనే ప్రమోషన్ కౌన్సెలింగ్ చేపట్టాలన్నారు. గతంలో మాదిరిగా ప్రతినెలా ప్రమోషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అనంత‌రం డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. పిఆర్సి గడువు ముగిసి సంవత్సరం దాటినందున వెంటనే పిఆర్సి రిపోర్టు స్వీకరించి, 01.07.2023 నుంచి వెంటనే అమలుకు ఉత్తర్వులు విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న నాలుగు డిఎలు విడుదల చేయాలని కోరారు.
అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్ట‌ర్‌ ఎం.గంగాధర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా ప్రతి పాఠశాలకు స్వచ్ఛ‌కార్మికులను వెంటనే నియమించాలని, పాఠశాలల కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని,పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు దాటినా విద్యార్థుల‌కు సరిపడా పాఠ్య పుస్తకాలు, యూనిఫార్మ్స్ ఇప్పటి వరకు అందజేయలేదని, వెంటనే పంపిణీ చేయాల‌ని కోరారు.
సమావేశంలో జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి టి.సుదర్శనం, జిల్లా కమిటీ సభ్యులు ఎన్. సుభాషిణి,రాష్ట్ర కౌన్సిలర్లు ఎ. సంజీవరెడ్డి, ఉప్పలయ్య, డాక్ట‌ర్‌ ఎం.సారంగపాణి, మండలాల బాధ్యులు రవికుమార్, ఎన్.శ్రీనివాస్, ఎం.రాజకుమార్, ఎ.శ్రీనివాస్, కిషన్, సత్యపతి, ఎ.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page