ఆందోళనకరంగా అంతర్జాతీయ పరిణామాలు
దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్న వేళ అంతర్జాతీయ పరిస్థితులు కూడా భారతీయులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా తదితర దేశాల్లో పనిచేస్తున్న వారికి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ట్విట్టర్, మెటా తదితర సంస్థల్లో పరిణామాలతో చాలామంది రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిరది. ట్విట్టర్ లో ఉద్యోగం కోల్పోయిన అమెరికాలోని మనోళ్లకు కొత్త చిక్కు వొచ్చి పడింది. హెచ్ 1బీ వీసాపై అక్కడ ఉంటున్న మనోళ్లు.. రెండు నెలల్లోగా కొత్త ఉద్యోగంలో చేరాలి. లేదంటే అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీంతో ట్విట్టర్ తదితర సంస్థల్లో ఉద్యోగం కోల్పోయిన మనోళ్లందరూ కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలోని కంపెనీలు Non-immigrant visa H1B నాన్ ఇమిగ్రెంట్ వీసా హెచ్ 1బీ కింద ఇతర దేశాల ఎంప్లాయీస్‌ను తీసుకుంటాయి. ఈ వీసా కింద ఎక్కువ శాతం మన దేశం, చైనా వాళ్లే వెళ్తుంటారు. హెచ్ 1బీ వీసాతో మూడేండ్ల పాటు అమెరికాలో ఉండొచ్చు. ఈ గడువు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఆరేండ్లకు మించి ఉండరాదు. అయితే చట్ట ప్రకారం.. ఉద్యోగం లేకుండా హెచ్ 1బీ వీసాపై అమెరికాలో ఉండడానికి వీల్లేదు. ఈ వీసా ఉండి ఉద్యోగం కోల్పోయిన వాళ్లు రెండు నెలల వరకు దేశంలో ఉండొచ్చు. అంతలోపు వేరే ఉద్యోగంలో చేరాలి. లేదంటే దేశం వదిలి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ఎక్స్‌లో ఎంతమందిని కంపెనీ తొలగించిందనేది స్పష్టత లేదు. ఒకవేళ కొత్త జాబ్ దొరకకున్నా హెచ్ 1బీ వీసాదారులు అమెరికాలో ఉండేందుకు ఒక అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాళ్లు బీ2 వీసాకు మారాలని సూచిస్తున్నారు. ఇది విజిటర్ వీసా. దీనిపై గరిష్టంగా 6 నెలలు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత కొన్ని నెలలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. 45 రోజుల్లోగా జాబ్ దొరక్కపోతే బీ2 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతో మాజీ ఉద్యోగులకు కొంత ట్కెమ్ దొరుకుతుంది. అప్పుడు కొత్త జాబ్ చూసుకొని మళ్లీ హెచ్ 1బీకి మారిపోవచ్చు. అయితే బీ2 వీసాపై ఉద్యోగం చేసేందుకు అవకాశం లేదు. ఈ ట్కెమ్‌లో బతికేందుకు అవసరమైన డబ్బులు సమకూర్చు కోవాలని యూఎస్ ఇమిగ్రేషన్ సూచిస్తోంది. కాగా, మాజీ ఉద్యోగులు కొందరు వర్సిటీల్లో అడ్మిషన్లకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే వేలాది మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించేందుకు మెటా నిరాకరించింది. సెప్టెంబర్ క్వార్టర్ లో నిరాశజనక ఫలితాలు నమోదవుతాయని భావిస్తున్న మెటా వచ్చే ఏడాది నాటికి కంపెనీ స్టాక్ వాల్యూ 67బిలియన్ డాలర్ల మేర తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే మెటా అర ట్రిలియన్ డాలర్ల మేర నష్టాన్ని మూటగట్టుకుంది.
దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధిరేటు తగ్గడం, టిక్ టాక్ నుంచి ఎదురవుతున్న పోటీ, యాపిల్ ప్రైవసీ పాలసీలో చేసిన మార్పులు, మెటావర్స్ కోసం భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉండటం తదితర అంశాలు తలకు మించిన భారాన్ని మోపుతున్నట్లు మెటా చీఫ్ జూకర్ బర్గ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మెటావర్స్ కోసం భారీ మొత్తంలో పెడుతున్న పెట్టుబడి నుంచి పదేళ్ల తర్వాత గానీ రాబడి వచ్చే అవకాశం లేదు. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఉద్యోగ నియామకాలను పక్కన బెట్టడంతో పాటు ఉన్న ఉద్యోగులను సైతం సాగనంపాలని అనేక కంపెనీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితి అమెరికన్ ల కైనా, మనకైనా తట్టుకోవడం చాల కష్టం. అలా కాకుండా మానవ వనరులను ఉపయోగించుకునేలా ఆయా కంపెనీలు ప్రణాళికలు సిద్దం చేసుకోవడం ఉత్తమం.
-వడ్డె మారన్న
9000345368