కార్పోరేట్‌కు ధీటుగా  విద్యారంగం  వృద్ధి చెందాలి!

  • మరీ భారంగా ప్రైవేటు చదువు
  • సృజనాత్మకంగా బోధనాభ్యసనాలు సాగాలి
  • చదువు అన్నది నినాదం కావాలి!

ప్రభుత్వం  విద్యా రంగాన్ని కార్పొరేట్‌కు ధీటుగా  మార్చాల్సి ఉంది. పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చి వేస్తామని ప్రకటించింది. సూచనల కోసం ఒక నిపుణుల కమిటీని ఉన్నత, పాఠశాల విద్యా వ్యవస్థల్ని పర్యవేక్షించేందుకు, ప్రైవేటు సంస్థల నియంత్రణకు పూనుకోవాలి. నిజానికి మన పాఠశాలల్లో  కనీస వసతుల్లేవు. మన ప్రమాణాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. గ్రావిరీణులు, పేదలు, కింది వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్యతరగతికి సైతం చదువు భారంగా మారింది. ఊహించలేనంత అసమానతలు ఒకటో తరగతి నుంచే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న పథకాలు, సంస్కరణలు ఈ సమస్యల నుంచి మన పాఠశాల విద్యారంగాన్ని గట్టెక్కించగలిగితే అంతకు మించి ఆశయం మరోటి ఉండదు.  పిల్లల చదువులు భారమైనందు వల్ల మన అక్షరాస్యత తక్కువగా వుంది.  ప్రైవేటు చదువు మరీ భారంగా వుంది. సమస్యకు మూల కారణం ఊళ్లో బడి దివాళా తీయడం. కనీస వసతులు, చదువులు లేక ప్రజల్నించి దూరం గావడం. నిరుపేదలు కూడా ప్రైవేటును ఆశ్రయించడం. మన పాఠశాలల్ని చూడముచ్చటగా మార్చి వుంటే అద్భుతాలు జరిగేవి. రెండు మూడేళ్లలో వీటి రూపురేఖలే మారి పోయేవి. మంచి చదువు పేద పిల్లలకూ దక్కేది. ఆ ఊరి పిల్లలు ఆ ఊరి బడి లోనే చదివే స్థితి వుంటే మన విద్యారంగం ఎలా వుంటుందో ఒకసారి ఊహించుకొంటే ఇది తెలిసొస్తుంది.

 

ప్రభుత్వ బడిని మార్చకుండా తల్లి దండ్రులకు నగదు ఇవ్వడం వల్ల మార్పు రాదని తేలిపోయింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ’నాడు-నేడు’ పథకం తెచ్చినా మార్పు కానరాలేదు.. నిపుణుల కమిటీలన్నీ ప్రాథమిక విద్య వరకైనా మాతృభాషా విరీడియం వుండి తీరాలంటున్నాయి. నూతన విద్యా విధానం కూడా ఇదే చెబుతోంది. ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా ఇదే పేర్కొంది. కేంబ్రిడ్జి, అజీం ప్రేంజీ ఫౌండేషన్లు చేసిన పరిశీలనల్లో ఇంగ్లీషు మాధ్యమం తీవ్ర నష్టం తెచ్చిందని తేలింది. ఆంగ్ల మాధ్యమాన్ని మొండిగా ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు. మొదట మాతృభాషలో ప్రారంభించి ఒకానొక దశలో ఆంగ్లంలోకి మళ్లించాలని మాత్రమే చెబుతున్నారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో జరుగుతున్నదీ ఇదే! ఇంగ్లీషు విరీడియం పెడితే మంచి చదువు చెప్పేసినట్లు అవుతుందనుకొంటుంది ప్రభుత్వం. ప్రస్తుత టీచర్లు దీనికెంత అర్హులన్న ప్రశ్న కూడా వుంది.

పిల్లల చదువుల్ని మూల్యాంకనం చేసి, క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, మారుతున్న అవసరాలకు తగ్గ పాఠ్యాంశాలు రూపొందించి, శిక్షణలిచ్చి ఎప్పటికప్పుడు సృజనాత్మకంగా బోధనాభ్యసనాలు సాగేలా చూసే బాధ్యత ఎస్‌.సి.ఆర్‌.టి వారిది. జిల్లా విద్యా శిక్షణా సంస్థలది. ఉమ్మడి సర్వీసు నిబంధనల సాకుతో అన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి.  ఒక స్పష్టమైన దృక్పథం వుంటే మొదట దీనిపైన దృష్టి సారించాల్సి వుంటుంది. అన్ని స్థాయిల్లో బలమైన వ్యవస్థల్ని నిర్మించాల్సి వుంటుంది. వ్యవస్థలోని మరో బలహీనత ప్రజల్ని ఏ మాత్రం భాగస్వాముల్ని చెయ్యలేకపోవడం. బడిని ఒంటరిగా మార్చడం. పంచాయతీలకు, స్థానిక దాతలకు స్థానం లేకుండా పోవడం.  నాడు-నేడు నిధుల్ని పాఠశాల విద్యా కమిటీలే వ్యయం చేసేలా ఉత్తర్వులిచ్చారు. ఉన్నత పాఠశాలల్ని గుర్తించి, అన్ని హంగులు కల్పించాలి. బలమైన అకడమిక్‌ వ్యవస్థను రూపొందించాలి. అధ్యాపకుల్ని నియమించి ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ప్రారంభించి దీనికి పూనుకోవాలి. ప్రస్తుత జూనియర్‌ కళాశాలల్ని, అందులోని రెగ్యులర్‌, కాంట్రాక్టు అధ్యాపకుల్ని ఎలా సర్దుబాటు చెయ్యాలో కూడా చర్చించాలి. మన ప్రాథమిక పాఠశాలలు కనీస వసతుల్లేని, ఒకటి రెండు గదుల్లో నడుస్తున్నాయి. వాటిలోకి పసి బిడ్డల్ని తేవడం వారికి రక్షణ కల్పించడం అంత సులవైనపనిగాదు.

ఇకపోతే… ప్రపంచంలోనే  అనేక దేశాలు, అందులో అతి చిన్న దేశాలు మొదలు అతి పెద్ద జనాభాగల చ్కెనా వరకు అన్ని దేశాలూ వారి మాతృభాషలోనే ప్రాథమిక విద్య బోధిస్తున్నాయి. కొన్ని దేశాలు పి.జి వరకు మాతృభాషనే వాడుకుంటున్నాయి. జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌తో సహా అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు మాతృభాష మాధ్యమంలోనే నడుస్తున్నాయి. చిన్న దేశమైన క్యూబా మాతృభాషలోనే వైద్యంలో అద్భుతాలు సాధించింది. ప్రాంతీయ భాషలు కూడా అర్థం కాని అనేక గిరిజన తెగలు మన దేశంలో ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాలో ఆదిలాబాద్‌ తదితర గిరిజన ప్రాంతాల్లో ఉండే గోండులు తమ తెలుగును కూడా అర్థంచేసుకోవడం కష్టం. వారికి ఇక ఇంగ్లీష్‌ అర్థంకావడం కష్టమే.  తెలుగు భాషలో అనువాదం చేస్తే తప్ప గిరిజన పిల్లలు స్కూలుకు రాని పరిస్థితి వుంది. ఇక ఇంగ్లీషు రుద్దితే బడి మానేస్తారు తప్ప అద్భుతంగా రాణించలేరు. ఇంట్లో తెలుగు, ఊరిలో తెలుగు, సమాజమంతా తెలుగు వినిపిస్తోంది.  పుట్టిన దగ్గర నుండి తెలుగు వింటూ, మాట్లాడు తుంటారు. కనుక తెలుగులో క్లిష్టమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోడానికి అవకాశం వుంది. ఒకవేళ తెలియకపోతే ఎవరిని అడిగినా చెప్పగలరు.

 

అదే తెలియని ఇంగ్లీషు భాషలో అర్థం చేసుకోవడం కష్టం. ఇంగ్లీషు తెలియని ఇళ్ళు, సమాజం నుండి వివరణ అడిగి తెలుసుకునే అవకాశం తక్కువ. అందువలన ప్రాథమిక విద్యా స్థాయిలో… ఆంగ్ల మాధ్యమంలో విషయ పరిజ్ఞానం, జ్ఞాన సంపాదన కష్టం. పైగా పేదలు తమ పిల్లలకు డబ్బు పెట్టి ట్యూషన్‌కు పంపించలేరు. టీచర్లను పెట్టి చదివించుకోలేరు. అన్ని విధాలా పేదల పిల్లలు ఇంగ్లీషు మాధ్యమంలో నష్టపోవడం ఖాయం. డబున్న వాళ్లకు అన్ని అవకాశాలు వుంటాయి గనుక ఏ మాధ్యమమైనా ఫర్వాలేదు. అయినా వారిలో కూడా విషయపరిజ్ఞానం అంతగా ఉండదనే గుర్తించాలి. భారతీయుడి ఆలోచన బ్రిటీష్‌ వాడిదిగా ఉండాలనే లక్ష్యంతో మెకాలే విద్యా విధానం ప్రవేశ పెట్టారు. మన గురుకుల విద్యను దెబ్బతీయాలన్న సంకల్పంతో ఆ పనిచేశాడు. దీంతో మనం నష్టపోయి..వాడు లాభపడ్డాడు. తన ఆలోచనలతో ప్రభావితం చేసి భారతీయులను శాశ్వతంగా బానిస మనస్తత్వంతో బతికేలా కుట్ర చేశారు. ప్రజలంతా ఒక్కట్కె తనపై తిరగబడకుండా 3 లేక 4 భాషల ప్రజలను ఒక ప్రావిన్స్‌లో ఇరికించారు. ఈ కుట్రను భగ్నం  చేసి అందరినీ ఒక్కటి చేసేందుకే మాతృభాషా ఉద్యమాలకు జాతీయో ద్యమం పిలుపునిచ్చింది. అందువల్ల ముందుగా ప్రతి ఒక్కరికి చదువు అన్నది నినాదం కావాలి. అది దేశంలో జాతీయోద్యమంగా సాగాలి. ఇకపోతే ప్రతి పాఠశాలలో సమగ్ర గ్రంధాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలి.
 -కందుల శ్రీనివాస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page