India Alliance మోదీ ప్రతిష్టకు సవాల్‌గా ఎన్నికలు

మహారాష్ట్రలో బలపడుతున్న ఇండియా కూటమి
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికల సమరం సాగబోతోంది. ఈ ఎన్నికలలో ఆరు కీలక పార్టీలు తలపడుతున్నాయి. గతంలో శివసేనను చీల్చి దానిని చికాకు పెట్టిన మోదీకి ఇప్పుడు ఈ ఎన్నికలు సవాల్‌ లాంటివే. శివసేనను చీల్చి ఏక్‌నాథ్‌ షిండేను సిఎంగా చేసినా… ఫలితం లేదు. అక్కడి ప్రజలు బిజెపి కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇది స్పష్టం అయ్యింది. రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాలు 288. ఏ ఒక్క పార్టీకీ రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లేదు. ఒక్కో పార్టీకి ఒక్కో ప్రాంతంలో బలం ఉంది. ఈ ఎన్నికలలో పలు అంశాలు ప్రభావం చూపబోతున్నాయి. మరాఠాలు, ఒబిసిల మధ్య వివాదం, ఉల్లి రైతుల డిమాండ్లు, చెరకు పండిరచే  ప్రాంతాలలో ఆందోళనలు?  ఇవన్నీ వోటర్లపై ప్రభావం చూపే అంశాలే. ఈ ప్రాంతంలో చెరకు తోటలు అధికంగా ఉన్నాయి. అవిభక్త ఎన్‌సిపి, కాంగ్రెస్‌ పార్టీలకు ఇక్కడ మంచి ఆదరణ ఉంది. ఈ ప్రాంతంలోని ఆరు జిల్లాలలో 70 శాసనసభ స్థానాలు ఉన్నాయి. పశ్చిమ మహారాష్ట్ర రాజకీయాలపై సహకార రంగం ప్రభావం ఎక్కువ. 1960 నుండి మహారాష్ట్రను పాలించిన 20 మంది ముఖ్యమంత్రులలో ఐదుగురు ఈ ప్రాంతం వారే. సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ది కూడా పశ్చిమ మహారాష్టే. 2014 వరకూ ఇక్కడ కాంగ్రెస్‌-ఎన్‌సిపి కూటమిదే హవా. గత శాసనసభ ఎన్నికలలో అవిభక్త ఎన్‌సిపి 27, కాంగ్రెస్‌ 12 స్థానాలు గెలుచుకోగా, బిజెపికి 20, శివసేనకు ఐదు స్థానాలు వొచ్చాయి.

 

ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో ఈ ప్రాంతంలోని మొత్తం 10 స్థానాలలో ఎంవిఎకు 8 సీట్లు లభించాయి. ఇప్పుడు శరద్‌ పవార్‌, ఆయన మేనల్లుడు అజిత్‌ పవార్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బిజెపి నుండి సీనియర్‌ నేతలను ఆకర్షించడంలో శరద్‌ పవార్‌ విజయం సాధించగలిగారు. రాబోయే శాసనసభ ఎన్నికలలో అజిత్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్‌సిపి ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. పశ్చిమ ప్రాంతంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష ఎంవిఎ ప్రయత్నిస్తోంది పోటిలో కాంగ్రెస్‌, బిజెపి జాతీయ పార్టీలు కాగా శివసేన, శివసేన (యుబిటి), ఎన్‌సిపి, ఎన్‌సిపి (శరద్‌ పవార్‌) ప్రాంతీయ పార్టీలు. అధికారంలో ఉన్న మహాయుతిలో బిజెపి 152, ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన 78, అజిత్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్‌సిపి 52 స్థానాలలో అభ్యర్థులను నిలిపాయి. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవిడి)లో కాంగ్రెస్‌ 102, సేన (యుబిటి) 96, ఎన్‌సిపి ఎస్‌పి) 87 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ఈ రెండు శిబిరాలూ తమ మిత్రపక్షాల్కెన చిన్న చిన్న పార్టీలకు కొన్ని స్థానాలను వదిలేశాయి. ప్రస్తుతానికి ఇరు పక్షాల పరిస్థితి నువ్వానేనా అన్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో ఎంవిడికి అధిక స్థానాలు వచ్చినప్పటికీ రెండు కూటములకు వొచ్చిన వోట్ల శాతంలో తేడా స్వల్పమేనని అభరు తెలిపారు.

 

మజ్లిస్‌, ప్రహార్‌ జనశక్తి పార్టీ (పిజెపి), వంచిత్‌ బహుజన్‌ అఘాడీ (విబిఎ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) వంటి పార్టీలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. రాజ్‌ థాకరే నాయకత్వంలోని ఎంఎన్‌ఎస్‌ మహిమ్‌లో సేన (యుబిటి) ఓట్లకు, నాసిక్‌లో మహాయుతికి నష్టం చేకూర్చవచ్చునని దేశ్‌పాండే అంచనా. హిందూత్వ సంస్థల వేదికగా ఉన్న హిందూ సకాల్‌ సమాజ్‌ పలు ప్రాంతాలలో ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ కూడా ఎన్నికల ఫలితాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఆరు ప్రాంతాలు, 36 జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని నాలుగు జిల్లాలలో కలిపి 35 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ గిరిజనులు, ఓబీసీలు అధికంగా ఉంటారు. ఓబీసీల ఓట్లు సంఘటితం కావడంతో గతంలో బిజెపి లబ్ది పొందగలిగింది. ఉల్లి పండిరచే  రైతులలో పెల్లుబుకుతున్న ఆగ్రహం మహాయుతిని దెబ్బతీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి కేవలం రెండు స్థానాలు మాత్రమే వొ చ్చాయి. కాంగ్రెస్‌కు రెండు, ఎన్‌సిపి (పవార్‌), శివసేన (యుబిటి)లకు ఒక్కో స్థానం దక్కాయి. గత శాసనసభ ఎన్నికలలో బిజెపికి 13 సీట్లు లభించాయి. ఎన్‌సిపి 7, సేన 6, కాంగ్రెస్‌ 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఉత్తర మహారాష్ట్రలో మజ్లిస్‌ పార్టీకి రెండు స్థానాలు వచ్చాయి. గత సంవత్సరం డిసెంబరులో ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఈ మేలో తొలగించారు. ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని 40 శాతం నుండి 20 శాతానికి తగ్గిస్తూ కేంద్రం గత సెప్టెంబరులో నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలు వోటర్లపై ప్రభావం చూపవొచ్చు.

 

ఐదు జిల్లాలలో విస్తరించి ఉన్న కోస్తా ప్రాంతంలో 39 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బాల్‌ థాకరే నేతృత్వంలోని అవిభక్త శివసేన ప్రభావం ఎక్కువే. థానే ప్రాంతంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు గట్టి పట్టుంది. ఈ ప్రాంతంలో కూడా మహాయుతి ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకుంది. గతంలో శివసేనకు కంచుకోటలుగా ఉన్న కొంకణ్‌, రత్నగిరి, సింధుదుర్గ్‌లో కాలూనాలని బిజెపి ప్రయత్నిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ముంబయి, దాని పరిసర జిల్లాలలో అవిభక్త శివసేనకు మంచి పట్టుంది. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌పై శివసేన పాతిక సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఆధిపత్యం చెలాయించింది. రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రభుత్వం పొరుగున ఉన్న గుజరాత్‌కు కట్టబెడుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు బిజెపి వ్యూహాత్మకంగా మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. శివసేన వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన ఎన్నడూ ముందుకు రాలేదు. విదర్భను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానంటూ బిజెపి కొత్త పల్లవి అందుకుంది. 2019 శాసనసభ ఎన్నికలలో బిజెపికి 29, శివసేనకు 7 సీట్లు వచ్చాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో విదర్భలోని 10 స్థానాలలో ఎంవిఎకు 7 సీట్లు లభించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ఈ ప్రాంతంలోని నాగపూర్‌లోనే ఉంది. బిజెపికి చెందిన గడ్కరీ, ఫడ్నవీస్‌ వంటి ప్రముఖ నేతలు ఇక్కడి వారే. సోయాబీన్‌, పత్తి పండిరచే రైతులకు పెట్టుబడి వ్యయం అధికంగా ఉండడం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

 -మారుపాక గోవర్ధన్‌ రెడ్డి
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page