ఆందోళన కలిగిస్తున్న ఎంపాక్స్‌ ముప్పు!

  • పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న కేసులు.. అప్రమత్తమయిన భారత ప్రభుత్వం
  • రెండోసారి హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించిన  ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా పీడ వొదిలిందనుకుంటే ఏదో ఒక మాయదారి రోగం దాపురిస్తోంది. తాజాగా ఇప్పుడు మంకీ పాక్స్‌ భయం పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎంపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపాక్స్‌ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండోసారి హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆ తర్వాత ఎంపాక్స్‌ కొత్త స్ట్రెయిన్‌, క్లాడ్‌ ఐబీ గుర్తించారు. ఇదే కేసుల పెరుగుదలకు దారితీసి ఉండవొచ్చని అనుమానిస్తున్నారు. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో జూనోటిక్‌ వైరల్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

 

ప్రస్తుతం కాంగో దేశంలో ఎంపాక్స్‌ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైరస్‌ సోకిన వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. కాంగో ఆరోగ్యశాఖ మంత్రి రోజర్‌ కంబా ప్రకటన ప్రకారం.. ఇప్పటి వరకు 18వేల మందికిపైగా కేసులు రికార్డయ్యాయి. ఇందులో కనీసం 610 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. విస్తరిస్తున్న వైరస్‌ మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వైరస్‌ ప్రధానంగా  లైంగిక సంబంధాలు, వైరస్‌ సోకిన వ్యక్తులకు దగ్గరగా ఉండడం, రోగులు వాడిన దుస్తులు వాడడం వల్ల వైరస్‌ సోకుతుందని నిపుణులు సూచించారు.

 

కాంగోతో సహా అనేక దేశాల్లో కొత్త ఎంపాక్స్‌  స్ట్రెయిన్‌పై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు వైరస్‌ ఊహించినదానికంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, రూపంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, వైరస్‌ను సరిగ్గా ట్రాక్‌ చేసేందుకు అనువైన సౌకర్యాలు లేకపోవడం, వైరస్‌ తీవ్రత, వ్యాప్తి చెందుతున్న మార్గాలు వంటి ఎన్నో తిలయని విషయాలు ఉన్నాయని.. వీటన్నింటిపై మరోసారి  అధ్యయనం నిర్వహించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.  నైజీరియాలోని డెల్టా యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌ స్పెషలిస్ట్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ ఎఎమర్జెన్సీ  కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ డిమి ఒగోయినా మాట్లాడుతూ ఆఫిక్రాలో ఎంపాక్స్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.

 

వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందన్న ఆయన.. వైరస్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేదన్నారు. వైరస్‌ పరివర్తన, కొత్త స్ట్రెయిన్‌లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు అమెరికా, స్వీడన్‌, థాయ్‌లాండ్‌లో అనేక కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఎంపాక్స్‌ ముప్పు నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. అనుమానిత కేసులను గుర్తిస్తే చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసింది. ఎంపాక్స్‌ కేసులను గుర్తించేందుకు, సరైన చికిత్స అందించేందుకు ఆరోగ్య నిపుణులకు కేంద్రం శిక్షణ కార్యక్రమాలను సైతం ప్రారంభించింది. అయితే, భారత్‌లో ఇప్పటి వరకు కేసులు నమోదు కాకపోవడం ఊరటనిచ్చే విషయం భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు: కొన్నేళ్ల క్రితం కరోనా మహమ్మారితో వొణికిన ప్రపంచాన్ని మంకీపాక్స్‌ అనే వైరస్‌ చుట్టుముడుతోంది.

 

ఇప్పటికే ఆఫ్రికా, యూరోపియన్‌ దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్‌కు సంబంధించి తొలి కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేసింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోద్కెనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దిల్లీలో  ఒకరికి వ్యాధి లక్షణాలను నమోదైనట్లు పేర్కొంది. అతడిని పాజిటివ్‌గా నిర్దారించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్‌ ఆఫ్రికన్‌ క్లాడ్‌ 2 పూనీలీ  వైరస్‌ ఉన్నట్లు గుర్తించామని చెప్పింది. అయితే ఈ ఏడాది మంకీ పాక్స్‌ సంబంధించి భారత్‌లో ఒక్క కేసు మాత్రమే నమోదయిందని… తొలిసారి దేశంలో 2022లో 30కిపైగా కేసులు వెలుగు చూశాయని అధికారులు తెలిపారు. ఈ కేసు.. 2022లో నమోదైన 30 కేసుల మాదిరిగానే అంత ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పూనీలీ క్లాడ్‌ 1 ఆరోగ్య అత్యవసర స్థితికి సంబంధించిన వైరస్‌ కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే ఇది సోకిన వ్యక్తి పూనీలీ  తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి ఇటీవల ప్రయాణించిన ఓ యువకుడని తెలిసింది. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని.. ఆరోగ్య సమస్యలేవీ లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వివరించింది. ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న ఎంపాక్స్‌ వ్యాధిపై కేంద్రం  కీలక ఆదేశాలు జారీ చేసింది.

 

అనుమానిత వ్యక్తులందరికీ స్క్రీనింగ్‌, టెస్టింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయాలని సూచించింది. అనుమానిత, ధ్రువీకరించిన వ్యాధిగ్రస్థులకు చికిత్స చేయడానికి ఐసోలేషన్‌ కేంద్రాలను సిద్ధం చేయడానికి ఆసుపత్రులను గుర్తించాలని రాష్ట్రాలను కోరింది. అలాగే.. ప్రతిరోజూ ప్రజారోగ్య సంసిద్ధతపై సీనియర్‌ అధికారులతో  సమీక్షించాలని  కేంద్రం ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. జనవరి 2022, ఆగస్టు 2024 మధ్య 120 దేశాల్లో పూనీలీ  కేసులు వెలుగు చూశాయి. దాదాపు లక్షకుపైగా కేసులు నమోదుకాగా.. 220 మరణాలు సంభవించాయి.
-డా. సి.వి రత్నకుమార్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page