ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలి

ఫ్యాక్టరీతో వొచ్చే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ‌తా..
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

నిర్మల్ జిల్లా దిలావ‌ర్ పూర్ మండలం దిలావ‌ర్ పూర్ – గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌ను నిలిపివేయాల‌ని ప్రొఫెస‌ర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజాగళం పేరుతో దిలావ‌ర్ పూర్ మండల కేంద్రంలో రైతులతో శుక్ర‌వారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు పిఓడబ్ల్యు జాతీయ అధ్యక్షురాలు సంధ్య, ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా దిలావ‌ర్ పూర్ మండల కేంద్రంలో స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను మూసి బంద్ పాటించి మద్దతు తెలిపారు. అనంతరం ఇథనాల్ ఫ్యాక్టరీ తరలించే వరకు పోరాటాలు చేస్తామని గ్రామస్తులు, రైతులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం గ్రామస్తులు కలిసికట్టుగా పోరాడడం మంచి పరిణామమని, ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని, ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పీఓడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ… ప్రజలకు అవసరమైన విద్యాలయాలను వైద్యశాలలను ప్రభుత్వాలు ఇవ్వడం లేదు కానీ అనవసరమైన ఫ్యాక్టరీలకు మాత్రం అనుమతులు ఇస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాగైతే సబ్బండ వర్ణాలు పోరాడాయో ఫ్యాక్టరీ రద్దుకు కూడా అదే విధంగా పోరాడాలని, ఫ్యాక్టరీ రద్దుకయ్య చేస్తున్న మీ పోరాటం అభినందనీయమని గ్రామ ప్రజలను అభినందించారు.

తెలంగాణలోని దిలావ‌ర్ పూర్ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు ఫ్యాక్టరీ పెట్టడం దురదృష్టకరమని, ఫ్యాక్టరీ కారణంగా పర్యావరణం కలుషితం అవుతుందనే విషయం పాలకులకు తెలియదా అని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ తరలించే వరకు కలిసికట్టుగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఫ్యాక్టరీతో కలిగే నష్టాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అధికారులతో సర్వే చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page