విశ్వవిద్యాలయాల్లో నానాటికి ప‌డిపోతున్న ప్ర‌మాణాలు

పునర్వైభవంతీసుకొచ్చేందుకు కొత్త‌ గ‌వ‌ర్న‌ర్ దృష్టి సారించాలి..

ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : ఏ దేశ‌మైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ మాన‌వ వ‌న‌రులే కీల‌కం. ఆ మ‌నవ వ‌న‌రుల‌ను తీర్చిదిద్దేవి విశ్వవిద్యాలయాలే.. సరస్వతి మాత కొలువై ఉండే ఆలయాలుగా వీటిని మ‌నం భావిస్తాం కానీ నేడు విశ్వ విద్యాలయాలు వివిధ రకాల భావజాలాలకు, సంఘర్షణలు, రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మారాయి. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు ఖాలీ తరగతి గదులు, సమస్యలతో సతమ‌వుతున్న వసతిగృహాలు, పరికరాలు లేని పరిశోధనా కేంద్రాలు,. పరిశోధక విద్యార్థులు లేని పరిశోధనాశాలలతో దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని విశ్వ విద్యాలయాలు అభివృద్ధికి అంద‌నంత దూరంలో ఉన్నాయి. విద్యార్థులకు నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ఆజ్యం పోసే ఆలోచనలే కల్పించలేకపోతున్నాయి. నానాటికీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో సైతం మన విశ్వ విద్యాలయాలు వెనుకపడిపోయాయి. గతంలో రెండు అంకెల స్థానంతో సరిపెట్టుకున్న విశ్వ విద్యాలయాలు నానాటికీ నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా పాటించని కారణంగా ఇప్పుడు మూడు అంకెల స్థానానికి పడిపోయాయి. అయితే విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ పడిపోవడానికి వివిధ కారణాలను మనం విశ్లేషించుకోవచ్చు.
దాదాపుగా విశ్వ విద్యాలయాల్లో 2010 నుంచి వందలాది ప్రొఫెసర్ పోస్టులు ఖాలీగా ఉన్నాయి. దాదాపు ఒక దశాబ్దం నుంచి విశ్వవిద్యాలయాల్లో ఒక్క పోస్టును కూడా భ‌ర్తీ చేయలేదు. తద్వారా పరిశోధనలు జరగలేదు రీసెర్చ్ గ్రాంట్స్. రూస వంటి నిధులు, వివిధ రకాల పరిశోధనలకు సంబంధించిన ఏజెన్సీల నుంచి సైతం నిధులను తెచ్చుకోలేకపోయాం. ఇందు కారణంగా విశ్వవిద్యాలయాల్లో ఎటువంటి అభివృద్ధి సైతం కనిపించలేదు. విద్యా వాతావరణంతో పాటు పరిశోధనలకు సంబంధించిన వాతావరణాన్ని సైతం విశ్వవిద్యాలయాల్లో కల్పించుకోలేకపోయాం.

సమైక్య పాలకుల పాలనలో తెలంగాణ యూనివ‌ర్సిటీలు వెన‌క‌బ‌డిపోతున్నాయ‌నే ఆందోళ‌న విద్యార్థుల్లో మొద‌లైంది. ఈక్ర‌మంలోనే విద్యార్థుల‌ ఉద్యమం విశ్వవిద్యాలయాల్లోనే పురుడు పోసుకుంది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం అధికారం చేజిక్కించుకున్న టీఆర్ ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను గాలికొదిలేసి సవతి తల్లి ప్రేమను చూపించింది. విశ్వ విద్యాలయాలు తమ అస్తిత్వాన్ని కోల్పోయేలా ప్రైవేటు యూనివ‌ర్సిటీలకు అనుమ‌తిచ్చింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి వారు చేసిన చర్యలు శూన్యమ‌ని చెప్ప‌వ‌చ్చు. టీఆర్ఎస్‌ హయాంలో ఏ ఒక్క విశ్వవిద్యాలయంలోనూ ఒక్క‌ అటెండర్ పోస్టు, ఒక్క ప్రొఫెసర్ పోస్టును కూడా నియమించ‌లేదు, టీఆర్ఎస్ హ‌యాంలో మొదటిసారిగా నియమించబడిన వీసీలు సైతం తూతూ మంత్రంగానే ఏదో నడిపించాం అన్న‌ట్లు ప‌నిచేశారు. అయితే రెండో దఫాలో అధికారంలోకి వొచ్చిన తర్వాత నియమించబడిన ఉపకులపతుల పనితీరు వాస్తవానికి ప్రశంసించదగినదే అని చెప్పుకోవచ్చు, ఆయా ఉపకులపతుల పని సైతం కొత్త‌ భవనాలు నూతన కోర్సులు, పరిశోధనలకు సంబంధించిన ప్రాజెక్టులు విశ్వవిద్యాలయాలకు నిధులను తీసుకొచ్చి ఏదో రకంగా అభివృద్ధి వైపున‌కు నడిపించారు. అయితే అంతలోనే ఆయా ఉపకులపతులకు నిర్దేశించిన సమయం ముగిసిపోయేసరికి, మళ్లీ ప్రజా ప్రభుత్వం పేరుతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్చార్జి ఉపకులపతులుగా అన్ని విశ్వవిద్యాలయాలకు ఐఏఎస్ అధికారులను మే 21 2024 నాడు నియమించింది.

దాదాపుగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఈ ఐదు నెలల సమయాన్ని ఒక బ్లాక్ పీరియడ్ గానే భావించాలనుకోవడం అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్లు పాలనా వ్యవహారాలు చక్కబెడతారని నమ్మకంతో ప్రభుత్వం వీరిని ఇన్చార్జి ఉపకులపతులుగా నియమిస్తే, వీరి చర్యల కారణంగా కొన్ని విశ్వవిద్యాలయాలు మరొక 10 సంవత్సరాల పాటు వెనక్కు వెళ్లిపోయాయి. సాధారణంగా యూనివ‌ర్సిటీల‌కు ఐఏఎస్ అధికారులను ఇన్చార్జిల‌ను నియమించడాన్ని అంద‌రూ ఎందుకు వ్యతిరేకిస్తారనేది వీరి 5 నెలల పాలనను నిశితంగా పరిశీలించిన ప్ర‌తిఒక్క‌రికీ అవగతమైంది. ఒక ఉపకులపతి విశ్వవిద్యాలయంలో డివైడర్స్ మీద కూర్చోవద్దని సర్కులర్లు జారీ చేస్తే, మరొక ఉపకులపతి ధర్నాలు, ర్యాలీలు నిషేధమ‌ని సర్క్యులర్లు జారీ చేస్తారు. అంతేగాని ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా ఒక్క ఇన్చార్జి ఉపకులపతి కూడా పరిశోధనలను సరిచేసింది లేదు. విశ్వ‌విద్యాల‌యాల‌న నిర్వ‌హ‌ణ‌, త‌ర‌గ‌తులు, ప‌రీక్ష‌ల తీరును పరిశీలించింది లేదు, పాలనా వ్యవస్థను ప‌ట్టిచుకున్న‌ది అంతకన్నా లేదు.

విశ్వవిద్యాలయాల పురోగతి కోసం ప్రణాళికలు అస‌లే లేవు. ఎంతసేపు పత్రికల్లో, వార్తా చానళ్ల‌లో వచ్చిన కథనాలకు వివరణలు రాయించి పంపిస్తూ తమ మాట వినని అధ్యాపకులకు, విద్యార్ధులకు మెమోలను జారీ చేస్తూ సమయాన్ని వృథా చేశార‌నే విమ‌ర్శ‌లు వొచ్చాయి. కొంతమంది అయితే విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఆదాయ వనరులను తెలుసుకొని వాటిని వినియోగించుకునే యత్నం చేశారు. ఉపకులపతులకు ఉండే అధికారాలను అనుభవించే యత్నం చేశారు, అంతేకాకుండా వివిధ భావజాలాలతో భిన్నత్వం లో ఏకత్వంగా ఉండే విశ్వ విద్యాలయాలను, కలుషితం చేశారు. వారికి నచ్చిన భావజాలం గ‌ల‌ విద్యార్థులను, అధ్యాపకులను చేర‌దీసి మిగతా వర్గాల వారిపై కక్ష సాధింపు చర్యలు చేప‌ట్టి ఇప్పటికీ విశ్వవిద్యాలయంలో ఒక రకమైన గందరగోళ పరిస్థితులను సృష్టించిన‌ ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు తాము అనుకున్న విజయం సాధించారని చెప్పకనే చెప్పొచ్చు.

అయితే ఈ విషయాలన్నింటినీ విద్యార్థి సమాజం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. కాబట్టి రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్ గా, విశ్వ విద్యాలయాలకు కులపతిగా విచ్చేసిన జిష్ణు దేవ్ వర్మ అయినా రాష్ట్రంలోని అన్ని రాష్ట్ర విశ్వ విద్యాలయాల రూపురేఖలు మార్చాలని, ఉపకులపతులకు మార్గనిర్దేశం చేయాలని అంద‌రూ కోరుకుంటున్నారు. అయితే జిష్ణుదేవ్ వర్మ వొచ్చిన వెంటనే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తారనే చర్చ జ‌రిగింది. ఎట్టకేలకు మూడు ప్రముఖ విశ్వ విద్యాలయాలు మినహా మిగిలిన విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించారు. కొత్త వీసీల‌తో గ‌వ‌ర్న‌ర్ సమావేశం నిర్వహించి, ప్రతి మూడు మాసాలకు ఒకసారి విశ్వవిద్యాలయాల పనితీరుపై ఉపకులపతులతో సమావేశం నిర్వహిస్తామని చెప్ప‌డాన్ని తెలంగాణ విద్యార్థి సమాజం పూర్తిగా స్వాగతిస్తున్నది.

అదేవిధంగా ఇప్పటికీ మూడు ప్రముఖ విశ్వవిద్యాలయాలకి ఇన్చార్జి ఉప కులపతిగా కొనసాగుతున్న అధికారోల్లో ఒకరు ప్రభుత్వంలోని అనేక డిపార్ట్మెంట్ లకు ఇన్ చార్జిగా ఉన్నందున, పని ఒత్తిడిలో భాగంగా సమయం ఇవ్వలేకపోతునందున, విశ్వ విద్యాలయాల్లో పరిస్థితులు జటిలంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్చార్జి ఉపకులపతులను వెంటనే తప్పించి, పూర్తిస్థాయి వీసీల‌ను నియమించాలని విద్యార్థులు గ‌వ‌ర్న‌ర్‌కు విన్నవించుకుంటున్నారు. వారు ప్రభుత్వం లో ఉన్న ప్రముఖ ఐఎఎస్ అధికారులు, విశ్వవిద్యాలయానికి సమయం కేటాయించని కారణంగా, ముఖ్యమంత్రికి అతి సమీపంగా ఉండే ఐఏఎస్ అధికారులు, రానున్న రోజుల్లో చీఫ్ సెక్రటరీ రేసులో ఉన్న అధికారులు కనుక సాధారణ విశ్వవిద్యాలయ అధికారులు, సాధారణ విద్యార్థులు సైతం వారిని చేరుకోవటం కష్టంగా మారింది. కానీ కొంత మంది విద్యార్థులు ఐఏఎస్ అధికారులు మాత్రం ఆయా ఐఏఎస్ అధికారుల పేరు చెప్పుకొని, ఆయా ఐఏఎస్ అధికారుల మనుషులం అని చెప్పుకొని పలువురు అధ్యాపకులు, విద్యార్థులు విశ్వవిద్యాలయాలలో అలజడి సృష్టిస్తున్నారు. యూనివ‌ర్సిటీ పాలనా వ్యవహారాల్లో తల దూరుస్తూ విశ్వవిద్యాలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. విద్యార్థులను అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనేది ఎవరూ కాదనలేని నిజం. గ‌వ‌ర్న‌ర్‌ ఈ ఐదు నెలల కాలంలో జరిగిన సంఘటనలపై అన్ని విశ్వ విద్యాలయాల నుంచి గోప్యంగా నివేదికలను తెప్పించుకొని విచారిస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగుచూస్తాయి. వెంటనే మూడు విశ్వవిద్యాలయాలకు సైతం వీసీల‌ను నియమించి, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను గాడిన పెట్టాలని, ఇంతటి సంక్షోభంలో ఉన్న విశ్వ విద్యాలయాలు పురోగతి సాధించాలంటే ఉన్న యంత్రాంగంతో కాకుండా కులపతి వారి ప్రత్యేక బృందంతో పర్యవేక్షించాల్సిన అవ‌సరం ఉంది.

ప్రతి ఆరు మాసాలకు ఒకసారి యూనివ‌ర్సిటీల వారీగా విద్యార్థులతో ఆయా విశ్వ విద్యాలయాల్లోనే కులపతి విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి తెలంగాణ విశ్వవిద్యాలయాల పురోగతిలో విద్యార్థులను సైతం భాగస్వామ్యం చేయాలని తెలంగాణ విద్యార్థి లోకం గ‌వ‌ర్న‌ర్‌ విజ్ఞప్తి చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన కులపతి విశ్వవిద్యాలయాల వారీగా అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల ఖాలీల వివరాలను తెప్పించుకొని వెంట‌నే భ‌ర్తీ చేయాలి. ప్రతి సంవత్సరం పీహెచ్ డీ నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్లు నిర్వహించుకునే అర్హత ఉన్న ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక విద్యా సంవత్సరానికి రెండు పర్యాయాలు పీహెచ్ డీ అడ్మిషన్లను నిర్వహించి విశ్వవిద్యాలయ నిధుల నుంచి తగినంత ఫెలోషిప్ ను అందజేసి విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి పరిశోధన వాతావరణం సృష్టించాలి. అదేవిధంగా పీహెచ్ డీ నోటిఫికేషన్ విడుదల చేసే అర్హత లేని విశ్వవిద్యాలయాలు, ఆయా అర్హతలను సాధించే దిశగా విశ్వవిద్యాలయాలను ఆధునికరించాలి, అభివృద్ధి చేయాలి, తగిన అర్హతలను పొందే విధంగా ఉన్న‌తీక‌రించాలి.

విద్యా ప్రమాణాలు పెంచి అన్ని యూనివర్సిటీల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుపడేలా కృషి చేయాలి. స్థానిక వనరులకనుగుణంగా ప్రతి విశ్వవిద్యాలయంలో నూతన కోర్సుల రూపకల్పన చేస్తూనే, ఆయా కోర్సులకు సంబంధించిన నైపుణ్యాలను విద్యార్థులకు అందించి, ఆయా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందేలా చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలకు చాలా వరకు భవనాల కొరత ఉంది. వెంట‌నే నూతన భవనాలను నిర్మించాలి. విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి వసతి గృహంలో ఉండే అవకాశం కల్పించాలి. విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులకు సైతం కొత్త కోర్సులు, కొత్త టెక్నాలజీలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. తద్వారా విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్ర పురోగతికి దోహదపడేలా, రాష్ట్ర అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కేలా, మళ్ళీ భారతదేశం ఆనాటి నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు అందించినటువంటి పునర్వైభవాన్ని సంతరించుకునేలా ప్రణాళికలు రచించాలని తెలంగాణ రాష్ట్ర పౌర సమాజం, విద్యార్థి లోకం, మేధావి వర్గం ఆకాంక్షిస్తోంది.

జవ్వాజి దిలీప్ సాహూ,
పరిశోధక విద్యార్థి, సామాజిక కార్యకర్త, JNTUH ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యుడు.
7801009838.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page