- వీణె జక్కగ బట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేర్చె
- మ్రాకున దీగె గూర్పంగ నేరనిలేమ గుణము నేక్రియధనుష్కోటి గూర్చి
- సరము ముత్యము గ్రువ్వజాలనియబల యేనిపుణత సంధించె నిశిత శరము
- చిలుకకు బద్యంబు చెప్పనేరని తన్వి యస్త్ర మంత్రము లెన్నడభ్యసించె..
అని కన్నవారు, విన్నవారు ఆశ్చర్యపడుతుండగా ‘ద్రిజగదభి రామ గుణధామ చారు చికురసీమ సత్యభామ’ సింహగర్జనములు చేస్తూ నరకాసుర సంహారం కావించింది. నాడు దుష్టుడయిన నరకాసురుడి సంహారం జరిగినందుకు నేటికీ కొన్ని యుగాలుగా, తరాలుగా చదల చీకట్లలో చిరు దివ్వెలు వెలిగించి పండుగ జరుపుకుంటున్నాం. సరములో ముత్యాలు గుచ్చజాలని అబల అసురాగ్రణి నరకాసురుడిని హతమార్చగలుగుతుందా అని శంకిం చినవారున్నారు. అబలను కానని, సమరశీలం గల సబలనని సత్యభామ నిరూపించింది. స్త్రీ శక్తి పట్ల విశ్వాసం లేని వారు ఇప్పటికీ ఉన్నారు. క్రీస్తు శకంలో రెండువేల సంవత్సరాలు పూర్తి పూర్తి అయిన ఈ తరుణంలో, ఈ దేశంలో అన్ని రంగాలలో స్త్రీలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం ఇష్టంలేని వారు కొందరు ఉండడం విచిత్రమే. పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో స్త్రీల రిజర్వేషన్ బిల్లును దశాబ్దాల పోరాటాల తరువాత సాధించుకుని వారు శుష్క ప్రియాలుగా స్త్రీ శక్తిని స్తుతిస్తూ మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. సత్యభామ నాడు నరకాసురుడిని హతమార్చినా, నరకాసురుని వారసులు ఇప్పటికీ ఉన్నారు- అన్ని రంగాలందు మన సమాజంలో నరకాసురుని వారసుల పెత్తనమే నడుస్తున్నది.
స్త్రీ మాతృమూర్తిగా, సోదరిగా గౌరవం పొందవలసిన మానవ సమాజంలో, విశేషించి భారత సమాజంలో ఆమె అనేక అన్యాయాలకు, అక్రమాలకు గురి అవుతున్నది. ఇందుకు ప్రధాన కారణం ఈ సమాజంలో నరకాసురుని వారసులు ప్రాబల్యం వహించడమే. సమకాలీన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ధనబలంతో, భుజబలంతో నరకాసురుని వారసులు రాజ్యం చేస్తున్నారు. తత్ఫలితంగా నైతిక విలువలు, ప్రమాణాలు ఘోరంగా దిగజారి అవినీతి వికృత స్వరూపం ధరించింది. ఈ అవినీతి కేవలం ఆర్ధిక విషయాలకు మాత్రమే పరిమితం కాలేదు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో సైతం అవినీతి భయానక స్థాయిని తాకింది . ముఖ్యంగా ఉన్నతస్థానాలను ఆక్రమించిన వారు, అధికారం చేజిక్కించుకున్నవారు అవినీతినే ఆరాధి స్తున్నారు; సమాజంలో పెద్దలుగా చలామణి అవుతున్న వారి దైనందిన జీవితాలు వర్తమాన, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం కావడం లేదు. అధికారంలో ఉన్నవారు, పెద్దమనుషులు విచ్చలవిడిగ అవినీతికి పాల్పడుతున్నందువల్ల సమాజంలో అనర్ధాలు, దౌష్ట్యం, దౌర్జన్యం హెచ్చుతున్నాయి గాని తగ్గడంలేదు.
నరకాసురుని వారసులు ధనబలంతో, భుజబలంతో సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాలలో ఆధిపత్యం వహించడంతో ప్రజాస్వామ్యం తన పటుత్వాన్ని, ప్రయోజకత్వాన్ని కోల్పోయి నిర్వీర్యమవుతున్నది- అనేక సందర్భాలలో అవహేళన పాలవుతున్నది. ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అధికార దర్పంతో, ధనబలంతో నరకాసురుని వారసులు నేటి సమాజంలో గౌరవమర్యాదలు పొందుతున్న దుస్థితి గురించి ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. సమాజంలోని, నిత్య జీవితంలోని వివిధ రంగాలకు విస్తరించి, విషకలుషితం చేసి వికటాట్టహాసం చేస్తున్న నరకాసురుని వారసులు అంతమయినప్పుడే నిజమయిన దీపావళి పండుగ. అప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి, నైతిక విలువల జీవితానికి శ్రీరామరక్ష.