వనరుల సమీకరణ పై దృష్టి సారించాలి

  • నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్య సాధనకు చేరుకోవాలి  
  • సమృద్ధిగా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి  
  • రెవిన్యూ మొబిలైజేషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 06:  ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణ పై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. బుధవారం ప్రజాభవన్ లో రెవిన్యూ మొబిలైజేషన్ పై కమర్షియల్ టాక్స్, ట్రాన్స్పోర్ట్, స్టాంప్స్ అండ్ రెవెన్యూ, టీజీ ఎండిసి, ఎక్సైజ్, తదితర శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.‌ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖల వారీగా నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్య సాధనలో ప్రతి నెల పురోగతి సాధించాలన్నారు. శాఖల వారీగా సాధించిన పురోగతి వివరాలు, రెవిన్యూ మొబిలైజేషన్ కొరకు శాఖల వారీగా రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే పన్ను ఎగవేతదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
సిమెంట్, స్టీల్, స్క్రాప్ ట్రేడర్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. జాతీయ రహదారులపై ఏర్పాటు చేసినటువంటి ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్స్ (ANPR) ను రాష్ట్ర రహదారులపై కూడా ఏర్పాటు చేయడం వల్ల లీకేజీ లను అరికట్టి ఆదాయం పెంచడానికి దోహదపడుతుందని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో పలు చోట్ల ఉన్న ఐరన్ మైనింగ్స్ ను టీజీ ఎండిసికి రిజర్వ్ చేయాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనలపై ఫాలో అప్ చేయాలని భూగర్భ గనుల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ కు సూచించారు. ప్రతి మండల కేంద్రంలో ఇసుక మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసి సమృద్ధిగా అందుబాటులో ఉంచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర, ట్రాన్స్పోర్ట్ చార్జీలు కలుపుకొని దళారుల బెడద లేకుండా నేరుగా ఇండ్లు నిర్మాణం చేసుకునే వారికి ఇసుకను సరఫరా చేయడం వల్ల ప్రజలకు ఆర్థికంగా మేలు చేసిన వారమవుతామని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను నిర్దేశించారు.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,  రెవెన్యూ వాణిజ్య పనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ అలీ ముర్తుజా  రిజ్వీ, భూగర్భ గనుల శాఖ సెక్రెటరీ సురేంద్రమోహన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page