రుణానికి ‘మాఫీ’ లేదు.. రైతుకు ‘భరోసా’ లేదు

  • ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన
  • కౌలురైతుకు భరోసా ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పాలి
  • ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేని పాలన
  • కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శలు

ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రుణానికి ’మాఫీ’ లేదు.. రైతుకు ’భరోసా’ లేదు అని అన్నారు. రుణమాఫీ ఒక మాయ.. రైతుభరోసా ఒక భ్రమ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన విూడియా సమావేశంలో నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని అన్నారు. రాష్ట్రంలో రూ.2 లక్షల రుణం మాఫీ అయిన ఒక్క రైతును చూపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీకి మళ్లించారని.. ఇప్పుడు రైతుభరోసా పది ఎకరాల వరకే అంటున్నారని నిరంజన్‌ రెడ్డి అన్నారు. కౌలురైతులకు రైతుభరోసా ఇవ్వమని అంటున్న కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

10 నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు అప్పుచేసినా ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేదని సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ పాలనలో అప్పులు చేసి అనేక రంగాల్లో సమూల మార్పులకు బాటలు వేశామని తెలిపారు. అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పులు చేసి ఏం చేశారో తెలియదు. కానీ రుణమాఫీ మాత్రం చేయలేదని విమర్శించారు. మొదట రూ.49 వేల కోట్లు రుణమాఫీకి అంచనా వేశారని .. ఆ తర్వాత రేవంత్‌ రూ.41 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. అదేబడ్జెట్‌లో రూ.26 వేల కోట్లుగా చెప్పారని.. చివరికి రూ.17 వేల కోట్లు మాఫీ చేసి అయిపోయిందని చెబుతున్నారని అన్నారు.రైతుభరోసా ఎగ్గొట్టారు .. పంట కాలం పూర్తవుతున్నా రైతుకు పెట్టుబడి సాయం అందించలేదని సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు.

వరంగల్‌ డిక్లరేషన్‌లో రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా, పసుపు బోర్డు, చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామఅని గొప్పలు చెప్పారని .. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన మూలంగా బీమా కంపెనీలకు లాభం తప్ప రైతులకు ప్రయోజనం ఉండదని చెప్పామని .. కేంద్రమే ఒక కొత్త పథకం తేవాలని అనేకమార్లు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. బీమా కంపెనీలు తమ లాభం తప్ప రైతుల లాభం కోసం పనిచేయవని చెప్పామని.. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం బీమా గురించి గొప్పలు చెబుతున్నారని అన్నారు. రైతులకు ఏదో చేయాలన్న ఆలోచనతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఉన్నప్పటికీ.. ఆయన సూచనలు ఆమోదించే స్థితిలో సీఎం రేవంత్‌ రెడ్డి లేరని నిరంజన్‌ రెడ్డి అన్నారు.

రైతుభరోసా రైతుకు, కౌలురైతుకు ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని.. కానీ రైతుభరోసా ఎవరు తీసుకుంటారో రైతు, కౌలురైతు తేల్చుకోవాలని కొద్ది రోజుల క్రితం వ్యవసాయ మంత్రి చావు కబురు చల్లగా చెప్పారని విమర్శించారు. తెలంగాణలో కౌలురైతు విధానం, ఆంధ్రాలో కౌలు విధానం వేర్వేరుగా ఉంటాయని కేసీఆర్‌ శాసనసభలో పలుమార్లు చెప్పిన విషయాన్ని నిరంజన్‌ రెడ్డి ఈ సందర్భగా గుర్తుచేశారు. తెలంగాణలో ఏటా పాలుకు ఇచ్చే విధానం ఉంటుందని.. ఆంధ్రాలో కౌలుకు ఇచ్చే విధానం ఉంటుందని చెప్పామన్నారు. కొందరు ఆంధ్రా నేతల చేతుల్లో ఉన్న రైతు సంఘాలు ఈ వాదన తెచ్చాయి .. దానిని కాంగ్రెస్‌ అందుకుని కౌలు రైతులకు రైతుభరోసా అని బురిడీ కొట్టించిందన్నారు. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టి ముసుగు తొలగించిందని చెప్పారు. రూ.80 వేల కోట్లు అప్పు చేసినా రైతుభరోసా, రూ.2500 తులం బంగారం, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, విద్యార్థులకు అల్పాహారం అన్నీ మాయమయ్యాయని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page