గుమ్మడి వెన్నెలకు కీలక పదవి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : ప్రజా గాయకుడు గదర్ కుమార్తె కాంగ్రెస్ నేత గుమ్మడి వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గదర్ మరణానంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆల్వాల్ లో గదర్ ఏర్పాటు చేసిన మహాబోధి స్కూల్ బాధ్యతలను గత పదేళ్లుగా ఆమె నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సాంస్కృతిక సారధి కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కెసిఆర్ ప్రభుత్వం గత ఉద్యమంలో పని చేసిన జానపద కళాకారుల కోసం సాంస్కృతిక సారథి సంస్థను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రభుత్వం నిర్వహించే ప్రజా సభల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం వీరి విధులు. గతంలో రెండు పర్యాయాలు అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక సాంస్కృతిక సారథి సంస్థకు తొలి అధ్యక్షురాలిగా గుమ్మడి వెన్నెల నియమించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చిత్రమయిలో సాంస్కృతిక సారథి కార్యాలయం కొనసాగుతోంది.