సెప్టెంబర్ 17 అప్రమత్తమైన పోలీస్ శాఖ

 నిమజ్జనం …రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన ..కేంద్ర ప్రభుత్వ ‘విమోచన’ దినం

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 16  గ‌ణేష్ నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలు మంగ‌ళ‌వారం ఒకేరోజు  జ‌రుగుతున్న నేప‌థ్యంలో హైదరాబాద్‌ పోలీసులకు గ‌ట్టి సవాల్‌ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్థాయిలో సిద్ధ‌మ‌య్యారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన  పబ్లిక్‌ గార్డెన్‌లో సిఎం రేవంత్‌ జెండా కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం  పరేడ్‌ గ్రౌండ్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీంతో 48 గంటల పాటు హైదరాబాద్‌ పోలీసులు కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వహించాల్సి వొస్తుంది. నిమజ్జనాన్ని ప్రశాంత వాతావ‌రణంలో నిర్వహించడం పోలీసులకు కత్తి మీద సాముగా మారింది. గత ఏడాది మిలాద్‌ ఉన్‌ నబీ, వినాయ‌క‌ నిమజ్జనం ఒకే రోజు వొచ్చినా పోలీస్‌ వ్యవస్థ ముందుచూపుతో వ్యవహారించి రెండు పండుగలు ఒకే రోజు కాకుండా చర్యలు తీసుకుంది.

అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితే ఉన్నా.. అదనంగా సెప్టెంబర్‌ 17 కూడా వొచ్చింది. కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు, బీజేపీ శ్రేణులు హాజరవుతాయి. ప్రజాపాలనకు సీఎం హాజరయ్యే అవకాశాలున్నాయి. దీంతో అన్ని కార్యక్రమాలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. నిమజ్జనాలు బుధవారం ఉదయం వరకు జరిగే అవకాశాలుంటాయి. దీంతో సోమవారం ఉదయం పోలీసుల పహారా మొదలైంది.  బుధవారం ఉదయం వరకు అప్రమత్తంగా ఉండాల్సిన ఉంటుంది. అయితే మధ్యాహ్నం ఒంటిగంట‌ వరకు నిమజ్జనం పూర్తి చేయాలని నగర పోలీస్‌ కమిషనర్  సివి ఆనంద్‌ అన్నారు. ఇక 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 17న నిమజ్జనంతో పాటు పబ్లిక్‌ గార్డెన్స్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సంసిద్దమ‌య్యారు. క్రిటికల్‌ జంక్షన్స్‌, క్రాస్‌రోడ్స్‌, బషీర్‌బాగ్‌ చౌరస్తా, ఎంజే మార్కెట్‌లో చాలా కీలకం.

చెకింగ్స్‌, సోషల్‌మీడియా మానిటరింగ్‌, షీ టీమ్స్‌ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి. డ్రోన్‌ కెమెరాలు, మౌంటెడ్‌ కెమెరాలు, కెమెరా మౌంటెడ్‌ వాహనాలను ఏర్పాటుచేస్తున్నామ‌ని సివి ఆనంద్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వొచ్చాక జరుగుతున్న తొలి నిమజ్జనోత్సవం కాబట్టి ఎక్కడా రాజీపడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు.  ప్రతిసారీ విలీనం, విమోచనం అంటూ గొడవ జరిగేది. ఈసారి ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అటు గణేష్ మండపాల వద్ద కూడా సందడి భారీగానే ఉంటుంది. దీంతో 18 వేలమంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. అన్ని జోన్‌ ల డీసీపీలు, స్టేషన్‌ ఆఫీసర్లు, పెట్రోలింగ్‌, బ్లూ కోల్ట్స్‌ సిబ్బందితో కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రాష్ట్ర డీజీపీ జితేందర్‌ కూడా గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇతర అధికారులతో కలసి ఆయన హైదరాబాద్‌ లోని ముఖ్యమైన మండపాలను సందర్శించారు. పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ కాదు, ఇతర విభాగాలు కూడా నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులను నడప‌నుంది. ఇక రైల్వే కూడా రాత్రి వేళల్లో ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది. అటు మెట్రో సర్వీస్‌లను కూడా పొడిగించారు. 70 అడుగుల ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ట్రాలీ తీసుకొచ్చి విగ్రహాన్ని దానిపైకి తీసుకొచ్చేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధ‌రాత్రితో ఖైరతాబాద్‌ లో దర్శనాలు నిలిపివేశారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వాహకులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page