వినాయకుడు, నాయకుడు

భాద్రపదశుద్ద చవితి సెప్టెంబర్ 7 న రాష్ట్రవ్యాప్తంగా మరియు  హైదరబాద్‌ – ‌సికింద్రాబాద్‌ ‌జంటనగరాలలో విఘ్నేశ్వరుని పూజలు ఘనంగా ప్రారంభమయినాయి . జంట నగరాలలోని వాడవాడ, ప్రతిబస్తీలో, ప్రతివీధిలో, అన్ని రోడ్లపైన ఎటుచూసినా గణపతి దర్శనం లభిస్తుంది . ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనానికి విఘ్నం కూడా తొలిగి పోయింది.హై కోర్టు అనుమతినిచ్చింది. జంట నగరాలలోని వివిధ భాగాలలో కొన్ని వేల గణేష్‌ ‌మండపాలు వెలసి ఉంటాయి. ఏటేటా జంట నగరాలలో వినాయకుని పూజా మండపాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదనడంలో సందేహం లేదు. అన్ని బస్తీలవారు పోటీ పడుతూ మండపాలను విద్యుద్దీపాలతో అకర్షణీయంగా అలంకరిస్తున్నారు, రకరకాల, పలు రూపాల బహుభంగిమల భారీ వినాయక విగ్రహాలను తమ మండపాలలో ఆవిష్కరిస్తున్నారు.

 

ఒకరితో ఒకరు పోటీపడుతూ విగ్రహాల ఎత్తును, బరువును పెంచుతున్నారు. సంవత్సరానికి ఒకసారి, భాద్రపద మాసంలో ఇనుమడించిన ఉత్సాహంతో, భక్తి ప్రపత్తులతో యువతీ యువకులు కొన్ని రోజులపాటు వినాయక పూజలు జరుపుతున్నందుకు సంతోషించని వారుండరు. ఈ భక్తి శ్రద్దలు క్షణభంగురాలు కాగూడదు. కేవలం భాద్రపద మాసానికే పరిమితం కారాదు. భక్తితో పాటు వ్యక్తుల జీవితాలలో సమాజంలో నైతిక విలువలు, నైతిక ప్రమాణాలు చేయిచేయి కలిపి పెరిగితే సమాజంలో అశాంతికి, అరాచకత్వానికి తావుండదు. ప్రభుత్వాలు పోలీసు బలగాలను పెంచుతూ కొన్నికోట్ల రూపాయల ప్రజాధనాన్ని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం ఖర్చుచేయవలసిన అవసరం ఉండదు. ఆ కోట్ల రూపాయలను అభివృద్ధి కార్యక్రమాల మీద వెచ్చించడానికి అవకాశం ఉంటుంది – ఇదంతా ఒక కల! ఇది నిజంగా జరుగుతుందా? ఎందుకంటే, వినాయక మండపాలలో పూజల సందర్భాన నాయకులు (బడా నాయకులు, ఛోటా నాయకులు) కన్పించినప్పుడు, ఆ నాయకులకు గూడ మండపాలలో సత్కారాలు, సన్మానాలు జరిగినప్పుడు కొంత నిరుత్సాహం కలుగుతున్నది.

 

వినాయక విగ్రహాల సరసన కొందరు నాయకుల ఫోటోలు గూడ కన్పించడం మరింత ఘోరం. వినాయకుడి పూజా మండపాలు అధ్యాత్మిక కేంద్రాలుగా రూపొందాలి, పూజల సందర్భాన ప్రతిరోజు ఉత్తమమయిన, విజ్ఞాన ప్రదమయిన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయవచ్చు. సాంస్కృతిక అభివృద్ధికి వినాయక మండపాలు ఆలంబనాలు కావొచ్చు. కానీ మండపాలలో వినాయకుని విగ్రహం ముందు అశ్లీల నృత్యాలు ప్రదర్శించడం దురదృష్టకరం. కొన్ని మన సంప్రదాయక సాంస్కృతిక కళారూపాలు ఆదరణలేక మరుగున పడిపోతున్నాయి.

 

వాటిని ఆదరించడానికి, ప్రోత్సహించడానికి వినాయక మండపాలు వేదికలు కావాలి. వినాయక మండపాలు రాజకీయ నాయకుల ప్రచారానికి ఉపయోగపడడం సముచితం కాదు. అంతేకాదు -వినాయక పూజా మండపాలు రాజకీయ కేంద్రాలు కావడం, కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం అవి ఉపయోగపడడం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. . విఘ్నేశ్వరుడు రాజకీయాలకు అతీతుడు . గణపతిని రాజకీయాలకు గురిచేయడం సబబుకాదు. గజాననుడు ఏదో ఒక పార్టీ సభ్యుడు కాదు, పార్వతీ తనయుడు పక్షపాతం లేనివాడు. ! ఒక వంక పరిహాసం చేస్తూ మరోవంక సాష్టాంగ ప్రణామం చేయడం మన విచిత్ర, విపరీత ప్రవృత్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page