హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవహక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త సాయిబాబా తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. కాగా.. యూనివర్సిటీ పరిధిలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసే సమయంలో ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్లుగా నాగ్‌పుర్ జైలులో శిక్ష అనుభవించారు. ఈ ఏడాది మార్చిలోనే బాంబే హైకోర్టు ఆధ్వర్యంలోని నాగ్‌పూర్ బెంచ్ ధర్మాసనం ఆయనను విడుదల చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నుంచి విడుదలైన ఆయన గుండె సంబంధిత సమస్యతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా.. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
రేపు అంత్యక్రియలు
హైదరాబాద్, మౌలా అలీ, జవహర్ నగర్, శ్రీనివాస హైట్స్, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ఎదురుగా నివాసంలో సాయిబాబాకు స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు 14న 2024న సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు నివాళులర్పించవచ్చని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా ఆదివారం పలువురు సాయిబాబా పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా ప్రొఫెసర్ సాయిబాబా కోరిక మేరకు మృతదేహాన్ని హాస్పిటల్ కు దానం చేయనున్నారు. అలాగే ఆయన నేత్రాలను ఇప్పటికే ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు దానం చేశారు.