- ప్రజల పక్షాల ప్రశ్నిస్తే కేసులా?
- మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన, సోకాల్డ్ ప్రజాపాలనపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొట్టారని, లగచర్ల గ్రామ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అనంతరం చర్లపల్లి జైలు వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రజల తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరని, రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అంటున్నారని, అశోక్ నగర్ లో విద్యార్థులు తిరగబడినపుడు, రైతులు రోడ్ల మీదకు వొచ్చినపుడు పోలీసులు రోడ్లెక్కి ధర్నాలు, గురుకుల విద్యార్థులు నిరసన చేస్తే కూడా బీఆర్ఎస్ కుట్ర అని దుష్ప్రచారం చేస్తున్నారని, చివరకు సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులు పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నాయో వారికి అండదండగా ఉండటం ప్రతిపక్షం బాధ్యత అని చెప్పారు. మీరు అణిచివేస్తున్న విద్యార్థులు, పోలీసులు, రైతులు, గిరిజనులకు మద్దతు ఇవ్వడం, వారి హక్కుల కోసం పోరాటం చేయడం తమ బాధ్యత అని తెలిపారు. మీరు చేసే తప్పులకు, నేరాలకు, అక్రమాలకు చిడుతలు వాయిస్తూ చెక్క భజన చేయాలా? అని ప్రశ్నించారు. పీడిత వర్గాలకు అండదండగా నిలబడటమే మా బాధ్యత. మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు. నన్ను గానీ, కేటీఆర్ గానీ, మా ఎమ్మెల్యేలను గానీ అరెస్టు చేయండి.. కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టులు చేయడం సరికాదన్నారు.
మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా మీ మోసపూరిత వైఖరి మీద బీఆర్ఎస్ చేసే పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆరోజు మల్లన్న సాగర్ లో రేవంత్ రెండు రోజులు నిరాహార దీక్ష చేశాడు. అయనకు రక్షణ కల్పించాం కానీ అడ్డుకోలేదు, అరెస్ట్ చేయలేదు అని తెలిపారు. మా మధుసూదనాచారి లగచర్లకు వెళ్తే అడ్డుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్, కార్తీక్ రెడ్డి లను అడ్డుకున్నారు. ఎంపీ అరుణ వెళ్లకుండా అడ్డుకున్నారు. తొమ్మిది నెలల గర్బిణీ మీద చాతి మీద తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు. ఇదేనా మీరు చేసే పాలన? ఇదేనా ప్రజాపాలన? మిమ్మల్ని గద్దె దించడం మాత్రం ప్రజలు మరిచిపోరు అని ధ్వజమెత్తారు.
ఫార్మా సిటీ పెట్టాలంటే గత ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాల్లో పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కొడంగల్, జహీరాబాద్ లలో పార్మాసిటీ భూముల సేకరణ నిర్ణయం పసంహరించుకోవాలన్నారు. మీ ప్రాధాన్యం అదానీ, అల్లుల్లు.. దళిత, గిరిజన, పేదల పక్షాన మేం పోరాటం చేస్తాం.. వారి తరఫున బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని తెలిపారు. సమాధానం చెప్పలేక కేటీఆర్ మీద కుట్ర చేస్తు న్నారు. రేవంత్ .. కోదండరాం, దామోదర్ రాజనర్సింహ ప్రజల్ని రెచ్చగొట్టారు. ఆనాడు మీమీద కేసులు పెట్టలేదు. ప్రశ్నించే గొంతు కేటీఆర్ మీద కేసులు పెడతారా? కేటీఆర్ ఇందులో ఇరికించే ప్రయత్నం చేశారు. చదివే అవకాశం లేకుండా తప్పుడు రిమాండ్ రిపోర్టులో సంతకం పెట్టించారు. తనకే సంబందం లేదు, కేటీఆర్ ను ఎందుకు ఇరికించారు పట్నం నరేందర్ రెడ్డి చెప్పాడు. రిమాండ్ రిపోర్టుపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించారు, మేజిస్ట్రేట్ ముందుకు కూడా ఇదే చెప్పానని తెలిపారు. నరేందర్ రెడ్డిని జైలులో పెట్టి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అని హరీష్ రావు ఆరోపించారు. నరేందర్ రెడ్డి ఉన్నాడని, బీఆర్ఎస్ పార్టీ ఆయనకు పూర్తి అండగా ఉంటుందని, తమకు న్యాయం మీద, న్యాయస్థానం మీద నమ్మకం ఉందని హరీష్ రావు తెలిపారు. నిర్దోషిగా నరేందర్ రెడ్డి బయటకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.