మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే
పాలన గాలికి వొదిలి ..గాలి మోటర్లలో మంత్రులు
రుణమాఫీ, రైతుబంధు. వరికి బోనస్ అంతా బోగస్
40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు
సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు..
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : మహారాష్ట్రలో సీఎం రేవంత్ అబద్దాల ప్రవాహాన్ని కొనసాగించారని, తెలంగాణలో మోసం చేసినట్లు మహారాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీలు అమయ్యాయో లేదో చెప్పాలి. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధం. అభయహస్తంలో మొదటి హామీ మహిళకు రూ. 2500 దిక్కులేదు. మొదటి హామీకి దిక్కేలేదు.. మహారాష్ట్రలో కోతలు కోస్తున్నారు. మహిళలకు రూ.2500 అమలు చేశావా? ఒక్కో మహిళకు రూ. 27500 ప్రభుత్వం బాకీ ఉంది
రేవంత్ గోబల్స్ ప్రచారం చేస్తున్నాడు. మహారాష్ట్రకు వెళ్లి అన్ని అబద్దాలే ప్రచారం చేస్తున్నాడు. మొదటి సంతకం ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. రుణమాఫీపై మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలి. డిసెంబర్ 9 2023 రుణమాఫీ చేస్తామని మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలి.
42 లక్షల మందికి రూ.31 వేల కోట్ల చేస్తామని.. రూ.17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేశామని ట్విట్టర్లో ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. 40 లక్షలు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుంది.
రుణమాఫీ 7 నెలలు ఆలస్యం చేసి రైతులపై వడ్డీల భారం మోపింది కాంగ్రెస్ పార్టీ. బ్యాంకులు ముక్కుపిండి రైతుల నుంచి వడ్డీలు వసూలు చేశాయి. ప్రభుత్వం ఆలస్యం చేయటంతో రైతులపై వడ్డీ భారం పడింది. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజల కు అబద్ధాలు కాదు తెలంగాణలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిజాన్ని చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. రైతు భరోసా ఎవరికిచ్చారని హరీష్ రావు ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఇచ్చారా. రైతు కూలీలకు ఇచ్చిన హామీ ఇవ్వలేదని చెప్పాలి. వరి పంటకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చారో లేదో చెప్పాలి. ఉన్న వడ్లను ప్రభుత్వం కొనకపోవడం తో రైతులు తక్కువ రేటుకు దళారులకు అమ్ముకునే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడైనా బోనస్ వస్తుందా రేవంత్ చెప్పాలి. ఇండ్లు కూలగొట్టావు కానీ ఒక్క ఇళ్లు కట్టావా? 11 నెలల్లో ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని మహారాష్ట్రలో చెప్పి ఉంటే నిజం ఒప్పుకోవాలి. ఒక్క ఇళ్లు కట్టలేదు కానీ.. వందల ఇండ్లు కూలగొట్టానని చెప్పాల్సి ఉండే. ఒక్కరికైనా 5 లక్షల భరోసా కార్డు ఇచ్చావా రేవంత్.? ఫీజు రియింబర్స్ మెంట్ బంద్ పెట్టిన ఘనత రేవంత్ ది. నేడు విద్యార్థులను, నిరుద్యోగులను రోడ్డు మీదికి తెచ్చావ్. రూ.4000 ఫించన్ ఇస్తానని వృద్ధులను మోసం చేశారు. ఒక్కొక్కరికి రూ. 26 వేల పెన్షన్ కాంగ్రెస్ పార్టీ బాకీ పడింది. 41 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రభుత్వ బాకీ పడిందన్నారు.
10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు. . ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పి, కెసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు మహారాష్ట్రలో చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చింది లేదు.. ఎగ్జామ్ పెట్టింది లేదు మరి ఎలా 50,000 ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. అశోక్ నగర్ లైబ్రరీలో నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయించిన ఘనత రేవంత్ రెడ్డిదని మండిపడ్డారు. అర్ధరాత్రి ఆడపిల్లల్ని అరెస్ట్ చేయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని.. ఉద్యోగాల భర్తీలో వైఫల్యంపై మహారాష్ట్రలో ఎందుకు చెప్పలేదు. జీవో 29 పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు అన్యాయం చేశారు. ప్రశ్నించిన నిరుద్యోగులపై పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా వడ్లు కొనే పరిస్థితి లేదు మద్దతు ధరకు వడ్లు కొనకపోవటంతో రైతుల తీవ్రంగా నష్టపోతున్నారు.రూ.1900లకే వడ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది అన్ని వడ్లకు ఎంఎస్పీ, బోనస్ ఇస్తున్నానని ప్రకటించావు. రేవంత్ రెడ్డి అసమర్థత పాలనకు రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే సాక్ష్యం. బోనస్ ఇచ్చానని బోగస్ మాటలు మాట్లాడావు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి.నిరుద్యోగత యువతకు ఇస్తానన్న రూ. 4 వేల భృతి ఏమైంది. మహారాష్ట్రలో యువతను మోసం చేసే ప్రయత్నం చేశారు.
ఎన్నికల హామీలను ఎగవేయటమే కాంగ్రెస్ నైజంగా మారింది. ఎన్నికల ముందు గ్యారెంటీ.. గెలిచాకా గ్యారేజీకి గ్యారెంటీలు. రేవంత్ ఇస్తామన్న గ్యారెంటీలు ఒక్కటీ అమలు చేయలేదు. గెలిచేదాకా గ్యారెంటీలు.. గెలిచిన తర్వాత గ్యారెంటీలు గ్యారేజీకి. ఎన్నికల ముందు ఓట్ల కోసం గ్యారెంటీల వల.
గెలిచాకా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటర్లు విలవిల. పోలీసు కానిస్టేబుల్స్ రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి వచ్చింది. హాస్టళ్లలో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. సోనియమ్మ మాట.. రాహుల్ గాంధీ మాట అంటూ హామీలిచ్చారు ఇప్పుడా గాంధీలు ఎక్కడికి పోయారో తెలియదు. మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని అబద్ధాలు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదు. వడ్డీ లేని రుణం రూ. 5 లక్షల వరకే ఉంది. ప్రతీ అప్పుకు వడ్డీ లేని రుణం వర్తిస్తుందొ చెప్పాలి. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని పచ్చి అబద్ధాలు చెప్పారు. మహారాష్ట్ర ప్రజల్ని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్రకు డబ్బులు పంపించే పనిలో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంతే డబ్బులు సమకూర్చుతున్నారు పాలన గాలికి వదిలి.. మంత్రులు రాష్ట్రాల బాట పట్టారు. తెలంగాణ డబ్బును రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నాడు. మహారాష్ట్రలో ఏ పార్టీకి అనుకూలంగా.. వ్యతిరేకంగా ప్రచారం చేయం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై వాస్తవాలు చెప్పటం మా బాధ్యత అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.