ధాన్యం కొనుగోళ్ల‌పై నిర్ల‌క్ష్యం వీడ‌ని ప్ర‌భుత్వం

  • ఇప్ప‌టివ‌ర‌కు కిలో స‌న్న వ‌డ్లు కూడా కొన‌లేదు..
  • మ‌ద్దతు ధ‌ర కోసం అన్న‌దాత‌లు రోడ్ల‌పైకి వ‌చ్చే దుస్థితి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు

నల్లగొండ, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 13 : రైతులు ఎన్ని అవ‌స్థ‌లు పడుతున్నా స‌కాలంలో ధాన్యం కొనుగోలు చేయ‌డంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వీడ‌డం లేద‌ని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధ‌వారం ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గత సంవత్సరం నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే ఈ ఏడాది కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు రావడం వల్ల ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు అయింద‌ని హ‌రీష్ రావు తెలిపారు. సాగు పెరిగిన కారణంగా నల్లగొండ జిల్లాలో ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మూడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి కూడా నల్లగొండ జిల్లాలో లేద‌ని విమ‌ర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలయింద‌న్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయక, గన్నీ బస్తాలు అందించకపోవడంతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతులు రూ .1800లకు క్వింటాల్ చొప్పున దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఎన్నికల ముందు బాండ్ పేపర్ రాసి రైతులకు 500 బోనస్, రూ.15000 రైతుబంధు ఇస్తానని చెప్పి రేవంత్ మాట త‌ప్పార‌ని, కానీ రేవంత్ రెడ్డిని రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే మహారాష్ట్రకు నోట్ల‌ కట్టల లోడ్ ఎత్తుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, 200 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటే అందులో 50 కోట్లు మాత్రమే చెల్లించారు. రైతులకు సకాలంలో డబ్బులు అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. వడ్లకు మద్దతు ధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేశార‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం జగిత్యాల జిల్లా పర్యటనలో అక్కడి రైతులని అడిగితే ఒక కిలో సన్న వడ్లు కూడా కొనలేదని చెప్పారని హ‌రీష్ రావు తెలిపారు. ఇప్పటివరకు నల్ల‌గొండ జిల్లాలో కూడా ఒక కిలో సన్న వడ్లను కొనలేదన్నారు. సన్న వడ్లను కొనే వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ విఫ‌ల‌మైంద‌న్నారు.
ముఖ్యమంత్రికి మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంద‌ని, వడ్లు కొనకపోతే అధికారులను, మిల్లర్లను అని అడగడం లేదు కానీ.. మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారని విమ‌ర్శించారు. ఇటీవ‌ల 25 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు మెమో జారీ చేశారని, తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చాల‌ని రేవంత్ రెడ్డి చూస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణలో ఆడబిడ్డలకు రూ.2500 ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చి ఇప్ప‌డు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసి మహిళల పుస్తెల్లు తెంపుతున్నాడ‌ని మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి ప్రజల గురించి కాకుండా పైసల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడ‌న్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందిందా లేదా రుణమాఫీ జరిగిందా లేదా సకాలంలో బోనస్ అందించారా లేదా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశారా లేదా అనే సోయి లేద‌న్నారు.
రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది కానీ పరిస్థితి చూస్తుంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేద‌న్నారు. పక్క రాష్ట్రం నుంచి దళారుల వొచ్చి తెలంగాణలో రైతుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని కొంటున్నార‌ని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేశార‌ని రేవంత్ రెడ్డి రాజ్యంలో రైతులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నార‌ని హ‌రీష్ రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page