గురుకులాల్లో విద్యార్థుల మృత్యు ఘోష

  • కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం!
  • మాజీ మంత్రి హరీష్ రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతోంద‌ని, గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్ రావు విమ‌ర్శించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దుస్థితి నెల‌కొంద‌ని, ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం గడప దాటడం లేద‌న్నారు.. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సిఎం ప్రగల్బాలు పలకడం తప్ప, ఎలాంటి కార్యాచ‌ర‌ణ‌కు దిక్కులేద‌న్నారు. . సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసింద‌ని తెలిపారు. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్దంత‌రంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడం శోచనీయమన్నారు. ఈ చావులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. వాంకిడిలో గురుకులంలో పాఠాలు వినాల్సిన విద్యార్థిని గత 17 రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నది. కారణం ఎవరు.? ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనుకున్న బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బలవన్మరణానికి కారణం ఎవరు? సంగారెడ్డి బీసీ గురుకులంలో ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్యకు కారణం ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే, గురుకులాలలో గత 11 నెలల్లో సగటున నెలకు ముగ్గురు ప్రాణాలు కూలిపోతున్నారు, ఈ మరణాలకు కారణం ఎవరు? ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ లోనూ ఇదే దుస్థితి కొనసాగడం దురదృష్టకరం. ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలో ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు కారణం ఎవరు ? బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడలుగా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకి దిగజారిపోతుండడం బాధాకరం. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాలు నరకకూపాలుగా మారాయి. విద్యాశాఖతో పాటు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, మైనార్టీ శాఖలు నిర్వహణలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, అభం శుభం తెలియని విద్యార్థుల పాలిట శాపంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహించే శాఖల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మిగతా శాఖల పనితీరు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంకెంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవాలి ముఖ్యమంత్రి గారు? ఇంకెప్పుడు మీ కార్యచరణ మొదలుపెట్టి విద్యార్థులను కాపాడుతారు? ఈ చావులకు ప్రభుత్వం బాధ్యత వహించి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page