- అద్భుతాలు చేశామనే భ్రమ నుంచి బయటపండి
- కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్ గా మోగించింది
- వరంగల్ వేదికగా ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
- కాంగ్రెస్ పార్టీ, సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్..
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారని, రైతులు దారుణంగా మోసపోయారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబురాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదు. డిక్లరేషన్ లో చెప్పిన మొట్ట మొదటి హామీ 2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదు. ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తాన్న రూ.12వేలు ఇవ్వనేలేదు. పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారని మండిపడ్డారు. . ఆనాడు మీరు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని, ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ అని ప్రశ్నించారు.
మీ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లిందని హరీష్రావు విమర్శించారు. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టింది. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వొచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి నెలకొంది. పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు.. స్కాలర్ షిప్పుల కోసం విద్యార్థులు.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు.. రుణమాఫీ, రైతు బంధు కోసం రైతన్నలు.. జీతాల కోసం ఆశాలు, అంగన్ వాడీలు.. డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది.. ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు.. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు.. సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు.. పింఛన్లు పెంచాలంటూ వృద్ధులుజ.. బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్ గా రోడ్ల మీదకు తెచ్చారని హరీష్ రావు మండిపడ్డారు.
భ్రమలు వీడి పాలనపై దృష్టి పెట్టండి
కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, పది నెలల పాలనలో రేవంత్ అందరి కడుపు కొట్టాడు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచారు. మీరు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు రేవంత్ రెడ్డి, సక్సెస్ ఫుల్ గా ప్రజల్నిమోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఏడాది కావొస్తున్నది. ఇప్పటికైనా కళ్లు తెరవండి. అద్భుతాలు చేశామనే భ్రమ నుంచి బయటపడి ఇచ్చిన హామీలు అమలు చేయండి. గోబెల్స్ ప్రచారాలు పక్కన బెట్టి పరిపాలన మీద దృష్టి సారించండి అని హితువు పలికారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలన్నారు. మీ వైఫల్యాలను గుర్తించి మోసం చేసినందుకు వరంగల్ వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీగా మహిళలకు చెప్పిన రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారో, కల్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారో, స్వయం సహాయక సంఘాలకు షరతులు లేకుండా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని, తేదీలు ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.