ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
రేవంత్‌రెడ్డి, మంత్రులు.. ఒక్క కొనుగోలు కేంద్రానికైనా వెళ్లారా..?
91లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్న మంత్రి ఉత్తమ్ చెప్పినవన్నీ ఉత్తయే…
రాఘవపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ, చేతలు మాత్రం గడప దాటడం లేదనీ, ప్రభుత్వం నిర్లక్ష్యంతో వొడ్లు పండించిన ఒక్కో రైతు వేలాది రూపాయలు నష్టపోయాడని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సిద్ధిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ..రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసారి రాష్ట్రంలో 91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని గొప్పగా చెప్పారనీ, కానీ, వాస్తవ పరిస్థితులు మరో విధంగా ఉన్నాయనీ, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల ధాన్యం దలారుల పాలయ్యాయనీ, ఒక రాఘవపూర్‌లోని రైతులు నాలుగైదు వేల క్వింటాళ్ల వొడ్లను ఐకెపి సెంటర్‌లో పోసి రోజుల తరబడి ఎదురుచూసి ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే చేసేదేమీ లేక రైతులు ఆవునూరు, గూడెం రైస్‌మిల్లర్లకు, దలారులకు తక్కువ ధరలకు అమ్ముకోవల్సి వొచ్చిందన్నారు.
రాఘవపూర్‌కు చెందిన రైతు అబ్బుల దేవయ్య 92క్వింటాళ్ల వడ్లను కల్లంలో పోసి నెల రోజులు ఎదురు చూసి ప్రభుత్వం కొనకపోతే 1900రూపాయ ప్రయివేట్ వ్యక్తులకు అమ్ముకున్నాడనీ, దీంతో ఒక్క రైతు దేవయ్య క్వింటాల్‌కు మద్దతు ధర 420రూపాయలు, రేవంత్ రెడ్డి ఇస్తానన్న బోనస్ ఇవ్వకపోవడంతో రూ.500 కలిపి ఒక క్వింటాల్‌కు రూ.920 నష్టపోయాడనీ, 92 క్వింటాళ్ల వడ్లకు రూ.81వేల ఒక దేవయ్య ఆర్థికంగా నష్టపోయాడన్నారు. ప్రభుత్వ మోసం, చేతగాని తనం వల్ల, వొడ్లను కొనకపోవడం వల్ల నష్టపోయాడన్నారు. రేవంత్‌రెడ్డి తప్పిదం, మోసం వల్ల ఒక రాఘవపూర్‌లో అనేక మంది రైతులు వేలు, లక్షల రూపాయలు నష్టపోయారన్నారు. నెల రోజులైనా ఐకెపి సెంటర్‌లో కొనుగోలు చేయకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడాల్సి వొస్తుందన్నారు. రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ వల్ల అనేక మంది వేలు, లక్షల రూపాయలు నష్టపోయారన్నారు. ఎన్నికల వేల అన్ని పంటలకు బోనస్ ఇస్తానని రేవంత్‌రెడ్డి చెప్పి ఇప్పుడేమో పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వొచ్చాక ఆయన కానీ, ఆయన మంత్రులు కానీ ఏనాడైనా ఒక్క వడ్ల కల్లంనైనా సందర్శించారా? అని ప్రశ్నించారు. దొడ్డు వడ్లు ఎందుకు కొనవన్నారు.
ఇది రైతు ప్రభుత్వం కాదు, రాబంధుల ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. తుఫాన్లు వొచ్చి, అనేక కష్టాల మధ్య రైతులు తక్కువ ధరకు వొడ్లు అమ్ముకున్నారన్నారు. ధాన్యం కొన్న రైతులకు తక్షణమే 48 గంటల్లో డబ్బులు చెల్లించడంతో పాటు, వానాకాలం, యాసంగికి కలిపి ఎకరానికి 15 వేలు రైతుబంధు డబ్బులను వెంటనే రైతు ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేశారు. పోయిన పంద్రాగస్టు వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తానని కనిపించిన దేవుళ్లందరిపైన రేవంత్‌రెడ్డి ఒట్టు పెట్టి వొట్లు డబ్బాలు వేయించుకున్న ప్రజలందరినీ మోసం చేశాడన్నారు. రేవంత్ పాలనలో ఒకటే నడుస్తుందని అదేంటంటే..అయితే తిట్లు…లేకపోతే ఒట్లు… అన్నారు. ఎవరైనా ఏదైనా అడిగితే తిట్ల దండకం అందుకుంటాడనీ, అధికారంలోకి రావడం కోసం అందరు దేవుళ్లపై ఒట్లు పెట్టుకుంటున్నాడన్నారు. కేసీఆర్ సిఎం ఉండగా కేసీఆర్ కిట్టు ఇచ్చు, మహిళలకు చీరలు ఇచ్చు, ముసలోళ్లకు పింఛన్లు నెల నెలా ఇచ్చేవాడనీ, కానీ రేవంత్‌రెడ్డి సిఎం అయ్యా కేసీఆర్ కిట్టు, మహిళలకు బతుకమ్మ చీరలు బంద్ చేయడమే కాకుండా, ముసలోళ్లుపింఛన్లు ఎగ్గొట్టిన పుణ్యాత్ముడు రేవంత్‌రెడ్డి అని విరుచుకుపడ్డారు.