నగరంలో పలుచోట్ల భారీ వర్షం

అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
‌నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, ‌కొండాపూర్‌, ‌మాదాపూర్‌, అ‌ర్‌పేట, జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, ఉప్పల్‌, తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి వివిధ ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది తొలగిస్తున్నారు. ఐటీ కారిడార్‌, బంజారా హిల్స్ ‌తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ‌స్తంభించింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎం‌సీ అధికారులు సూచించారు. అత్యవసర సేవల కోసం 040-21111111, 9000113667 సంప్రదించాలని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.

సుచిత్ర, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్‌, ‌కండ్లకోయ, కృష్ణాపూర్‌, ‌దుండిగల్‌, ‌డబిల్‌పూర్‌ ‌తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. కరీంనగర్‌, ‌సిద్దిపేట, మెదక్‌, ‌కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, ‌యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో  కాసేపట్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది.

బుధవారం గంటకు 40 నుంచి 50 కిమీ., గురువారం 30 నుంచి 40 కిమీ. వేగంతో అక్కడక్కడ గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page