‘‌హైడ్రా’ రంగనాథ్‌ ‌సారు.. జర ఇదర్‌ ‌దేఖో..!

  • జూబ్లీ హాల్‌ ‌పక్కన, తెలంగాణ శాసన మండలి భవనం వద్ద
  • శిథిలావస్తకు చేరిన పూరతన బావి
  • మురుగు నీటి కూపంగా మారిన వైనం
  • పునరుద్దరించాలని సామాజిక కార్యకర్తల డిమాండ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌15: ‌నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌లో ఉన్న జూబ్లీ హాల్‌ ‌పక్కన, తెలంగాణ శాసన మండలి భవనం వద్ద ఉన్న చారిత్రక బావి శిథిలమై నీరు పూర్తిగా కలుషితమైంది. ఒకప్పుడు ఈ బావి స్వచ్ఛమైన నీటిని అందిస్తూ, జూబ్లీ హాల్‌ ‌తోటలు, శాసన మండలి భవనాల సరఫరాలో కీలకంగ ఉండేది. అయితే, ప్రస్తుతం ఈ బావి కలుషితమై, పూడికనిండిన మలినమయమైన నీటితో నిండిపోయి ఉంది. దీంతో పబ్లిక్‌ ‌గార్డెన్‌లోని సందర్శకులు బావిని బాగు చేయాలని హైడ్రాను కోరుతున్నారు. నిజాం కాలంలో నిర్మించిన పలు బావులు పలు చోట్ల పాడవటంతో చారిత్రక నిర్మాణాలు బురద నీటి కూపాలుగా మారుతున్నాయి. అంతే కాకుండా ఎన్నో ఏళ్లుగా బావిలో నివసించిన 12 తాబేళ్లు మరణించినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారసత్వ కట్టడాలు సంరక్షించాలి: సామాజిక కార్యకర్త మొహ్మద్‌ ఆబీద్‌ అలీ
హైదరాబాద్‌లో వారసత్వ పరిరక్షణపై సుస్థిరంగా ప్రయత్నాలు చేస్తున్న సామాజిక కార్యకర్త మొహమ్మద్‌ ఆబిద్‌ అలీ ఈ అంశాన్ని ప్రాముఖ్యంగా పరిగణిస్తూ, వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ వారసత్వ భవనాల మురికివాడలను పునర్నిర్మించాలని, పునరుద్ధరించాలని, దీనిపై ఇప్పటివరకు గత ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యం ఇకనుండి తొలగించాలని ఆయన శాసన మండలి చైర్మన్‌, ‌జూబ్లీ హాల్‌ ‌సంరక్షకులను కోరారు. ఈ బావి కేవలం ఒక చారిత్రక అవశేషమే కాదని, గార్డెన్‌ ‌పర్యావరణ వ్యవస్థకు కూడా కీలకమన్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం భవనాల సమగ్రతకు రోజువారీ సందర్శకుల ఆహ్లాదాన్ని భంగం కలిగిస్తుందన్నారు. బాధ్యులు త్వరిత గతిన చర్యలు తీసుకొని బావిని పునరుద్ధరించాలని మెరుగుపరచాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page