కొనసాగుతున్న హైడ్రా దూకుడు!

  • అక్రమ నిర్మాణదారులకే కాదు..
  • నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకూ హైడ్రా సెగ

హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఎక్కడిక్కడ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుం టున్నారు. ఫిర్యాదులపైనా విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయి సమాచారంతో రంగంలోకి దిగుతున్నారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ముందుకు సాగుతున్నారు. రామ్‌నగర్‌లో కాల్వ ఆక్రమణలను కూల్చేశారు. జాన్వాడపై పూర్తిస్తాయి నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. హిమాయత్‌ సాగర్‌లో ఆక్రమణలపైనా నివేదిక తెప్పించుకున్నారు. దుర్గం చెరువులో ఆక్రమణలపై కొరడా రaుళిపించారు. ఇందులో ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు. ఇలా ఎక్కడి నుంచి ఫిర్యాదులు వచ్చినా స్వీకరిస్తున్నారు. ప్రజలు కూడా ఆక్రమణలపై తమవద్ద ఉన్న సమాచారం చేరవేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని 13 చెరువుల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌లలో నిర్మాణాలపై చర్యలు తీసుకుని, వాటిని తొలగించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల అధికారులు నిర్మాణదారులు, సంస్థల ప్రతినిధులకు తాఖీదులు జారీ చేస్తున్నారు.

వారం రోజుల నుంచి నెల రోజుల్లోపు నిర్మాణాలను ఖాళీ చేయని పక్షంలో తామే కూల్చేస్తామని వాటిలో పేర్కొంటున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో అధికంగా నిర్మాణాలున్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో కొన్ని నిర్మాణాలు పలువురు సివిల్‌ సర్వీస్‌ అధికారుల పేరుపై ఉన్నాయి. ఐఆర్‌ఎస్‌ అధికారి చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంతో పాటు మరికొందరు సినీ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి మాదాపూర్‌లోని అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో నివాసం ఉంది. వీటితో పాటు మాదాపూర్‌ పరిధిలోని అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ, కావూరి హిల్స్‌, డాక్టర్స్‌ కాలనీలో పలు నిర్మాణాలకు తాఖీదులు జారీ చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌ జోన్లలో ఇరిగేషన్‌ శాఖ అధికారులతో కలిసి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల అధికారులు సంయుక్త సర్వేలు చేశారు. మాదాపూర్‌లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధుల్లో చాలామంది బహుళ అంతస్తులు నిర్మించారని గుర్తించారు. కొందరు జీప్లస్‌3, మరికొందరు డూప్లెక్స్‌ ఇళ్లు నిర్మించారు.

ఇంకొందరు మాత్రం ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా వదిలేశారు. దుర్గం చెరువుతో పాటు గంగారం చెరువు, పెద్ద చెరువు, నల్లగండ్ల చెరువు, ఉప్పల్‌లో నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధుల్లోనూ ఈ తరహా నిర్మాణాలే ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఒక చెరువులో ఆక్రమణలు లేవని ప్రాథమికంగా గుర్తించారు. శేరిలింగంపల్లి మండల పరిధిలో దుర్గం చెరువు సహా ఐదు చెరువులు ఉన్నాయి. వీటి ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధుల్లో 340 కట్టడాలు ఉన్నాయని సర్వేల్లో నిర్దారించాం. వాటి వివరాలను హైకోర్టుకు రెండు నెలల క్రితం సమర్పించాం. ఆయా నిర్మాణాలను తొలగించేందుకు నిర్మాణదారులకు తాఖీదుల్లో గడువు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్లకు హైకోర్టు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఈ నెల 2న లేఖ రాశారు. ఈ లేఖలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆగస్టు 3న 240 మంది నిర్మాణ దారులు, సంస్థల ప్రతినిధులకు తాఖీదులు ఇచ్చాం. మరో 72 కట్టడాలను గుర్తించి.. వాళ్లకూ వివరణ ఇవ్వాలని కోరారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం ఉందని నోటీసు జారీ అయింది.

దుర్గం చెరువు సవిరీపంలోని అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో తాను కోనుగోలు చేసిన ఇల్లు బఫర్‌ జోన్‌లో ఉంటే కూల్చివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అన్నారు. కూల్చివేసే ముందు కొంత సమయమిస్తే సామగ్రి తీసుకొని బయటకు వెళ్తాను. భారాస నాయకులు నా ఇంటి గురించి రాజకీయం చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టే.. కాలనీవాసులందర్నీ సమస్యలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. మరోవైపు హైదరాబాద్‌ హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్‌ కేసులకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్‌ కమిషనర్‌కు హైడ్రా సిఫారసు చేసింది. జీహెచ్‌ఎంసీ చందానగర్‌ డిప్యూటీ కమిషనర్‌తో పాటు హెచ్‌ఎండీయే అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌, నిజాంపేట మున్సిపల్‌ కమిషనర్‌, సర్వేయర్‌ సహా బాచుపల్లి తహసీల్దార్‌పై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.

బాచుపల్లి ఎర్రకుంటలో ఇటీవల అక్రమంగా నిర్మిస్తున్న మూడు భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఆ భవనాలపై స్థానికుల నుంచి వరుసగా ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదని అధికారులపై అభియోగాలు ఉన్నాయి. ఆధారాలతో సహా సమర్పించినా పక్కనపెట్టేశారని హైడ్రా దృష్టికి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులను, అధికారులపై అభియోగాలను పరిశీలించిన రంగనాథ్‌.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఇప్పుడు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. వీరితోపాటు గండిపేట వద్ద ఖానాపూర్‌, చిల్కూరులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి సూపరింటెండెంట్‌ పై కూడా చర్యలు తీసుకునేందుకు హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకూ హైడ్రా సెగ తగిలింది. చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా పెద్దఎత్తున కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో నాటి నుంచి విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో చిన్నా పెద్దవి కలిపి సుమారు 200కి పైగా నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారుల సమాచారం. 50 ఎకరాల వరకు ప్రభుత్వ, చెరువుల భూములను పరిరక్షించినట్లు హైడ్రా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.

పలుచోట్ల చాలామంది చెరువులను ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టిన విషయం ప్రభుత్వానికి తెలియంది కాదు. పర్యవేక్షణ అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాలు నిబంధనల మేరకు జరుగుతున్నాయా? లేదా? అన్నది తనిఖీ చేయాల్సి ఉంటుంది. అనుమతులు లేని పక్షంలో కూల్చివేతలు చేపట్టాలి. పర్యవేక్షణ అధికారులే కాదు ప్రతి విభాగంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు కూడా నిర్మాణాలపై ఓ కన్నేసి ఉంచాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో సర్వే నంబర్లు వేరుగా వేసి నిర్మాణ అనుమతులు తీసుకున్నట్లు కూడా హైడ్రా అధికారులు గుర్తించారు.
-రేగటినాగరాజు
(సీనియర్‌ జర్నలిస్ట్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page