రెండో రోజూ కొనసాగిన నిమజ్జనం

భారీగా తరలిచ్చిన వినాయక విగ్రహాలు
పలు ప్రాంతాల్లో ట్రాఫక్‌ ‌జామ్‌తో ఇక్కట్లు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌18: ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద గ‌ణేశ్‌ ‌నిమజ్జనాలు వరుసగా రెండోరోజు బుధవారం కొనసాగాయి. నిమజ్జనం కోసం వొచ్చిన వాహనాలతో ట్యాంక్‌బండ్‌ ‌పరిసర ప్రాంతాల్లో భారీగా వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. బషీర్‌బాగ్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహం వరకు గణనాథులు నిలిచిపోయాయి. బర్కత్‌పుర ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్‌ ‌వరకు వినాయక విగ్రహాలు బారులు తీరాయి. ఈ క్రమంలో సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించేందుకు అధికారులు ప్రయత్నించారు. నారాయణగూడ నుంచి ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు వొచ్చే గణనాథులను వన్‌ ‌వేలో అధికారులు అనుమతించారు. ఎన్టీఆర్‌ ‌మార్గ్, ‌పీపుల్స్ ‌ప్లాజా, ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. బుధవారం  మధ్యాహ్నంలోపు గణేశ్‌ ‌నిమజ్జనాలు పూర్తికానున్నాయని పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు 1లక్ష 3500 గణనాథులు నిమజ్జనం అయ్యాయి. అత్యధికంగా మూసాపేట ఐడియల్‌ ‌చెరువులో 26,546 గణనాథుల నిమజ్జనం జరిగింది. ట్యాంక్‌ ‌బండ్‌, ఎన్టీఆర్‌ ‌మార్గం వద్ద 4730, నెక్లెస్‌ ‌రోడ్‌ 2360, ‌పీపుల్స్ ‌ప్లాజా 5500, అల్వాల్‌ ‌కొత్తచెరువులో 6221 వినాయకులను అధికారులు నిమజ్జనం చేశారు. గ్రేటర్‌లో మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జనాల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

మరోవైపు ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద గణేశ్‌ ‌నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది. మధ్యాహ్నంలోపు మరో 5 వేల గణేశ్‌ ‌విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. బల్దియా కంట్రోల్‌ ‌రూమ్‌ ‌ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. గణేశ్‌ ‌నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపు పూర్తిచేసేలా బల్దియా టార్గెట్‌ పెట్టుకుంది. సాంకేతిక కారణాలతో మోరాయిస్తున్న క్రేన్ల స్థానంలో తక్షణమే వేరే క్రేన్లను ఏర్పాటు చేశారు.

దాదాపు 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్‌ ‌సాగర్‌ ‌చుట్టూ జీహెచ్‌ఎం‌సీ క్లీనింగ్‌ ‌పనులు చేపట్టింది. కాగా.. వినాయక నిమజ్జనాలు ఆలస్యం అవుతుండటంతో పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ‌స్వయంగా రంగంలోకి దిగారు. మోజంజాహి మార్కెట్‌ ‌వద్దకు సీపీ చేరుకున్నారు. మోజంజాహి కూడలి మూడు మార్గాల్లో భారీగా గణనాథులు బారులు తీరాయి. పోలీస్‌ అధికారులు గణపతులను వేగంగా నిమజ్జనాలకు పంపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page