ధరలు స్వారీ చేస్తున్నాయి…!

  • ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలెవీ?
  • నానాటికీ దిగజారుతున్న భారత ఆర్థిక వ్యవస్థ

ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. రూపాయి మారకం విలువ నానాటికి దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 84 రూపాయలు దాటింది. ధరలు స్వారీ చేస్తున్నాయి. ప్రధానంగగా బియ్యం,ఉప్పు, పప్పుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా అజమాయిషీ చేయడంలేదు. ధరలను కంట్రోల్‌ చేయడం తమ పని కాదన్న రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ధరలను అదుపు చేసే యంత్రాంగం లేకుండా పోయింది. పాలకులకు ఇది పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మోదీ పాలనలో గత పదేళ్లుగా అన్నిరకాల వస్తువుల ధరలు, మందుల ధరలు దాడి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. జిఎస్టీ గురించి సవిూక్షించకుండా నిరంకుశం గా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు నిత్యావసర ధరలతో పాటు, నిత్యం వాడే మందుల ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఇవన్నీ వాటంతట అవే పెరుగుతున్నాయని అనుకోవడానికి లేదు.

అయినా నియంత్రించే వ్యవస్థ లేకుండా పోయింది. వ్యాపారులపై అజమాయిషీ లేకపోవడంతో ధరలతో దాడి చేస్తున్నారు. పేదవాడు మరింత పేద వాడుగా, ధనవంతులు మరింత ధనవంతులగా మారుతున్నారు. పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతున్న మోదీ సర్కార్‌ ఈ పరిస్థితులను సవిూక్షించడం లేదు. ఎక్కడ పేదరికం పోయిందో చెప్పడం లేదు. పేదరికం పోతే పేదలకు ఉచిత బియ్యం పంపిణీ ఎందుకు చేస్తున్నారో చెప్పడం లేదు. వ్యవసాయోత్పత్తులను పెంచి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం ద్వారా దేశంలోని పేదలకు అన్నం పెట్టాలన్న ప్రణాళికలకు అడుగులు పడడం లేదు. సహజంగానే వ్యవసాయిక దేశమైన భారత్‌లో ఉన్న నేలలు అన్ని పంటలకు అనువుగా ఉన్నాయి. సహజవనరులు కూడా ఉన్నాయి. పరిమితంగా ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించడం వంటి విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటించట్లేదు. పథకాల పేరుతో పంచడం తప్ప, ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించడం లేదు. నీటి వనరులను సద్వినయోగం చేసే దిశగా సాగడం లేదు.

వ్యవసాయోత్పత్తులు పెరుగుతున్నా వాటిని ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించి..విదేశీ మారక ద్రవ్యం సంపాదించేలా ప్రణాళికలు లేకుండా పోయాయి. వ్యవసాయ అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి కుంటుపడటమే ధరలు నానాటికీ పెరగడానికి కారణంగా చూడాలి. ఇబ్బడిముబ్బడిగా ఉచిత పథకాలు, డబ్బుల పందేరంతో ప్రజలను సోమరులుగా తయారు చేస్తున్నారు. అన్నింటికీ ప్రభుత్వాలపై ఆధారపడేలా చేస్తున్నారు. పేదరికానికి మూలం ప్రభుత్వ విధానాలే అన్నది గుర్తించడం లేదు. ప్రజలను దేశ ఉత్పత్తిలో భాగస్వాములుగా చేయడం అన్నది పక్కన పెట్టేశారు. ప్రజలను చైతన్యవంతులుగా, విజ్ఞానవంతులుగా, ఆలోచనా పరులుగా, అవగాహనాపరులుగా చేస్తే తమకు ముప్పు అన్న ఆలోచనలో రాజకీయ పార్టీల నేతలు, పాలకులు ఉన్నారు. భారతదేశంలో ఆర్థిక, సామాజిక, రంగాల అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నా అది ఎంతన్నది …మన ఆర్థికాభివృద్దిని లెక్కలేసుకుంటే కొంతేనని తేలుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారి చివరకు ఎటుదారితీస్తుందో అన్న భయం కలుగుతోంది. దారిద్య్ర సూచికలో భారతదేశం 107వ స్థానానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశ స్థితిని దారిద్య్ర వైపు, దివాళాకోరుతనం వైపు చూడడానికి ఒక అవకాశం కలిగింది. ఈ విధంగా భారతదేశం దిగజారిపోవడానికి కారణం పాలకవర్గం తీసుకుంటున్న తిరోగమన చర్యలే అని చెప్పక తప్పదు. కార్పొరేట్‌ శక్తులు, బ్యాంకులకు డబ్బులు ఎగవేసిన వాళ్ళు, అవినీతి అధికారులు, దోపిడీని కొనసాగిస్తున్న రాజకీయ నాయకులే అత్యధికం. భారతదేశం ఎందుకు ఆర్థికంగా సంక్షోభంలో వుందని పరిశీలిస్తే పాలకుల తిరోగమన విధానాలు కారణంగా చెప్పుకోవాలి.

వ్యవసాయ పశుగుణాభివృద్ధి ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాలను ఎవరు కూడా పట్టించు కోవడం లేదు. గ్రావిూణ అర్ధిక వ్యవస్థకు ఊతంగా ఉండే వ్యవసాయ రంగాన్ని,పాడి పరిశ్రమను శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయడం లేదు. రైతులను, రైతు కూలీలను నిరంతరం సంక్షోభంలో ముంచుతున్నారు. దేశంలో వ్యవసాయ భూమి విస్తరించట్లేదు. పేద ప్రజలకు భూములు ఇవ్వడంలేదు. పాలకవర్గాలు వీటన్నింటినీ విస్మరించడం వల్లే ఈ రోజున పేదరికం పెరిగిపోతోంది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే వివిధ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించడం, ఆహార వస్తువుల ధరలస్థిరీకరణ సాధించడం,పేద ప్రజలకు ఆహార భద్రత కలిగించడం, వ్యవసాయదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం సాధించడం వంటివి ముందుకు సాగడం లేదు. ఆర్థికాభివృద్ధిలో భారతదేశం ఏడు శాతం వృద్ధితో ప్రపంచంలోనే అగ్రగామి గా ఉందని మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నా ..90 శాతం మంది ప్రజలకు దీని ప్రయోజనాలు అందడం లేదన్నది కఠోర వాస్తవం. ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన ధరల పెరుగుదల ప్రభుత్వ గణాంకాలకు అందనంతగా ఉందన్నది మరో వాస్తవం. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొం టోందని వివిధ ప్రభుత్వ శాఖలు ఇటీవల విడుదల చేసిన వివిధ గణాంకాలు విదితం జేస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్‌ నుండి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, విపరీతమైన విదేశీ రుణాలు, విదేశీ వాణిజ్యలోటు వంటివి మన ఆర్థిక వ్యవస్థ దుస్థితిని వెల్లడించడమే కాదు.. క్షీణతను సూచిస్తున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి అత్యధికంగా నష్టపోయింది.

డాలర్‌ విలువ రూ.84.07 పైసలు. ఆ మారకపు విలువను కొనసాగించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ తన నిల్వల నుంచి పెద్ద మొత్తంలో డాలర్లను విడుదల చేస్తోంది. ఇది విదేశీ మారక నిల్వలను కూడా తగ్గిస్తుంది. మోదీ ప్రభుత్వం 2014 మేలో అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్‌ మారకం విలువ రూ.59.44 పైసలు కాగా పదేళ్లలో దాదాపు రూ.25 పడిపోయి రూ.84కి దిగజారింది. విదేశీ వాణిజ్య లోటు కూడా పెరుగుతోంది. ఆగస్టులో వాణిజ్య లోటు 2,970 డాలర్లకు పెరిగింది. గతేడాది ఆగస్టులో ఇది 2,421 కోట్లు. భారతదేశ ఎగుమతులు చాలా బలహీన స్థితిలో ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని కూడా తగ్గిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై విదేశీ పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను భారతీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఉపసంహరించు కుంటున్నారు. విదేశీ మదుపరులు ఈ నెలలో ఇప్పటివరకు రూ.85,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ తైమ్రాసికంలో, భారతీయ కంపెనీల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడంతో విదేశీ పెట్టుబడిదారులు దూరమవుతున్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చైనా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం భారత మార్కెట్‌ను కూడా తాకింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా 2008లో భారతీయ స్టాక్‌ మార్కెట్‌ నుండి విదేశీ పెట్టుబడులు ఉపసంహరించబడ్డాయి. అప్పట్లో అది పెద్ద ప్రభావం చూపింది. రూపాయి విలువ క్షీణతకు అది కూడా కారణమైంది. సెప్టెంబర్‌లో వస్తు, సేవల పన్ను వసూళ్లే ఇందుకు నిదర్శనం. 40 నెలల్లో అత్యల్ప వృద్ధి రేటు (-) 6.5 శాతం నమోదైంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటుతో పోలిస్తే సెప్టెంబర్‌లో జిఎస్‌టి ఆదాయం పెద్దగా పెరగలేదు.

బొగ్గు, విద్యుత్‌, ముడి చమురు ప్రాసెసింగ్‌, మైనింగ్‌ వంటి ఎనిమిది కీలక రంగాల్లో ఉత్పత్తిపై ఆధారపడిన పారిశ్రామికోత్పత్తి సూచీ ఆగస్టులో ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో కార్ల విక్రయాలు 19 శాతం తగ్గాయి. సేవల రంగ సూచీ కూడా 10 నెలల కనిష్టానికి చేరింది. ఆర్థిక సంవత్సరం తొలి తైమ్రాసికంలో గృహ రుణాల పంపిణీ తొమ్మిది శాతం పడిపోయింది. బలమైన మరియు చలనశీలమైన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఇటువంటి అంశాలు క్షీణిస్తున్నాయి. పేలవమైన ఆర్థిక విధానాల ఫలితంగా మధ్యతరగతి, దిగువ తరగతులవారి ఆదాయం తగ్గింది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కొనుగోలు శక్తి లేకపోవడం. కొనుగోలు శక్తి కోవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకోలేదని చాలా సూచికలు చూపిస్తున్నాయి. కొనుగోలు శక్తిని పెంచుకోవాలంటే దిగువన ఉన్న 50 శాతం మంది చేతిలో ఎక్కువ డబ్బు రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ చట్టం, ఇతర సంక్షేమ పథకాల కేటాయింపులు పెంచడం లేదు. దానికి బదులుగా, కార్పొరేట్‌ లకు పన్ను మినహాయింపులతో సహా భారీ సబ్సిడీలు ఇస్తోంది. మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావాలి. పెరుగుతున్న నిరుద్యోగం, వేతన పెరుగుదల లేకపోవడం ప్రజల కొనుగోలు శక్తిని క్షీణింపజేసింది.

ఏడు శాతం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉందనడానికి ఇంతకన్నానిదర్శనం అక్కర్లేదు. ముఖ్యంగా సంస్కరణలు వృద్ధిరేటును పెంచినప్పటికి నిరుద్యోగ నిర్మూలనకు పెద్దగా తోడ్పడలేదు. ముఖ్యంగా సంఘటిత రంగంలో ఉపాధి తగ్గిపోతున్నది. రెగ్యులర్‌ ఎంప్లాయీస్‌ తగ్గుతూ క్యాజువల్‌ లేబర్‌ పెరుగుతున్నారు. క్యాజువల్‌ లేబర్‌ను, ప్రభుత్వ ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా మార్చకపోవడం వలన వారు అభద్రతలో వున్నారు.సమగ్రాభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సాధ్యమని గుర్తించి ముందుకు సాగాలి. వ్యవసాయ అభివృద్దికి చర్యలు తీసుకోవాలి. విప్లవాత్మక చర్యలకు పూను కోవాలి. అలాగే పాడి రంగాన్ని, కోళ్ల పరిశ్రమల అభివృద్ది తదితర రంగాలను ప్రోత్సహించాల్సి ఉంది. దేశంలో ఉత్పత్తి రంగాల్లో మాంద్యం పెరిగింది.పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన లేదు. మరోవైపు పెద్దఎత్తున ఉద్యోగాలు పోయాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసిన పాపాన పోలేదు. విద్యాధికులైన యువతకు సంపాదనా మార్గాలను పూర్తిగా మూసేశారు. మరీ ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల ఆర్థికస్థితిని చావుదెబ్బ తీశారు. వాళ్ల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే తప్ప మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోలేం.
-రేగటి నాగరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page