- ఇందిరా మహిళా డెయిరీతో పేదల జీవితాల్లో వెలుగు
- గత పాలకులు చేసిన అప్పులు తీర్చే పనిలో ఉన్నాం..
- ప్రతి సభ్యురాలికి సబ్సిడీపై 2 పాడి పశువుల పంపిణీ
- డెయిరీ పాలతో నెలకు 25 కోట్ల సంపాదనకు అవకాశం
- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
- ఇందిరా మహిళా డెయిరీ లోగో ఆవిష్కరణ
మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: గత పాలకులు ఏడు లక్షల కోట్ల అప్పు భారం మోపి మోపి వెళ్లిపోయారు.. తాము ఆ రుణాలను తీర్చే పనిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం మధిర మండల కేంద్రంలో ఇందిరా పాల ఉత్పత్తి కేంద్రం లోగో ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నిమిషం ప్రజల కోసమే పనిచేస్తోంది. ప్రతిరోజు 18 గంటల పాటు పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. దేశం మన వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీ విజయం సాధించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆకాంక్షించారు.
సిరిపురంలో రూ.26 కోట్ల అంచనా వ్యయంతో సిరిపురం నుంచి నెమలి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ, పటిష్ట పనులకు శంకుస్థాపన చేసారు. మధిర రెడ్డి గార్డెన్స్ లో ఇందిరా డెయిరీ లోగో ఆవిష్కరించి మహిళా సంఘాల సభ్యులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. మధిర అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి మహిళల చేత పాల వ్యాపారం చేయించేందుకు 2011లో రూపకల్పన చేసుకున్న ఇందిరా మహిళా డెయిరీ ఆకాంక్ష నేడు నెరవేరుతుందన్నారు. గతంలో ఆహార ధాన్యాలు దొరక్క దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆకలితో మరణించారని, దీనిని గమనించిన అప్పటి ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ఆయన వేసిన పునాదులతో అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించుకున్నామని, దీని వల్ల నేడు మనకు సరిపోయే ఆహార ధాన్యలే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి మన దేశం ఎదిగిందన్నారు.
నాగార్జునసాగర్ బహుళ సార్థక ప్రాజెక్టు ద్వారా మధిర నియోజక వర్గం పరిసర ప్రాంతాల్లో ఆయకట్టు నీరు రావడం వల్ల పంటలు పండిస్తూ, పిల్లలను చదివిస్తున్నారని అన్నారు. వ్యవసాయ ఆదాయానికి తోడు పాడి పరిశ్రమతో నిలదొక్కుకుంటాయనే ఆలోచనతో ఇందిరా మహిళా మహిళా డెయిరీను 2011లో రూపకల్పన చేశామని తెలిపారు. నాగార్జునసాగర్ తో పాటు కట్టలేరుపై, మున్నేరుపై ఆనకట్ట నిర్మించుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నామని, డ్రిప్ ఇరిగేషన్ కూడా తయారు చేసుకున్నామని అన్నారు. స్వశక్తి మహిళా సంఘాలచే పాడి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. కుటుంబంలో తండ్రి వ్యవసాయం ద్వారా ఆదాయం సమకూరిస్తే, తల్లి పాడి పశువుల ద్వారా కొంత ఆదాయం సంపాదించి కుటుంబం మెరుగైన జీవనం సాగించేందుకు సహాయపడుతుందని అన్నారు.
ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మహిళలకే పాడి పశువులు అందించి, పాల సేకరణ నుంచి ప్యాకింగ్, బై ప్రోడక్ట్ (వెన్నె, మజ్జిగ, పెరుగు, నెయ్యి, స్వీట్స్) ఉత్పత్తి, మార్కెటింగ్ చేసి లాభాలు పొంది మహిళలు పంచుకోవాలనే కలతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు కోసం 9.5 ఎకరాల స్థలం సేకరించి భూమి పూజ కూడా చేసామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, డిఆర్డీవో, సన్యాసయ్య, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డా. వేణు మనోహర్, ఇందిరా మహిళా డెయిరీ చైర్మన్ అన్నపూర్ణ, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.