- ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్
- పిల్లలకు ప్రతి ఏటా రెండు యూనిఫామ్స్
- ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, కొత్త నియామకాలు
- విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు సమగ్ర చర్యలు
- సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
- బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : స్వాంతత్య్ర సమరయోధులు, భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి దివంగత జవహర్ లాల్ నెహ్రూ నెహ్రూ ఆకాంక్షల మేరకు తమ ప్రభుత్వం నడుచుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నవంబర్ 14న చాచా నెహ్రూ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులర్పించారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బాలబాలికలు అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించి ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేయరాదన్న చిత్తశుద్ధితోనే ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రతి ఏటా రెండు యూనిఫామ్స్ అందించాలని, ఆ బాధ్యతను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు. అలాగే పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. భావి భారత పౌరులను తయారు చేయడంలో భాగంగానే విద్యా రంగంలో సమూల మార్పులు చేపట్టామని తెలిపారు. విద్యా సంస్కరణల్లో భాగంగా నిపుణులతో కూడిన విద్యా కమిషన్ ఏర్పాటు.
ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, కొత్త నియామకాలు అన్నీ నేటి పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలన్న సంకల్పంలో భాగంగా చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఏకీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు. పిల్లలు జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని చెప్పిన నెహ్రూ ఆకాంక్షల మేరకు వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.